విజయవాడ: కాకినాడ జిల్లాకు చెందిన క్రీడాకారుడు మందపల్లి శ్రీనివాసరావు పవర్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్, అథ్లెటిక్ పోటీలలో జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 75 పతకాలు సాధించారు. రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని విజయవాడ క్యాంపు కార్యాలయంలో కలిసి సమస్యను విన్నవించారు.
తాను గత 24 సంవత్సరాలుగా ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నానని, కాగా తాను పోటీలలో పాల్గొన్నందుకు తనకు రావలసిన ప్రమోషన్స్, జీతాలు నిలిపివేస్తున్నారని మంత్రికి విన్నవించారు. ప్రభుత్వం సహాయం చేసి క్రీడల్లో రాణించడానికి చేయూత అందించాలని మంత్రిని కోరారు.
స్థానికంగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు జిమ్ ఏర్పాటు చేయడానికి తగిన తోడ్పాటు అందివ్వాలని క్రీడా శాఖ మంత్రిని శ్రీనివాస్ కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి, శ్రీనివాస్ కు తగిన సహకారం చేస్తామని తెలిపారు.