Suryaa.co.in

Editorial

కొండపై ‘కర్ర’సాము!

– చిరుతకు చిక్కకుండా టీటీడీ కొత్త చిట్కా
– ఊత కర్రలతో పులిరాజాలు ఉలిక్కిపడతాయా?
– చిరుతలకు చిక్కకుండా చిడతలు కూడా వాయిస్తారా?
– కర్రలను చూసి మ్యానీటర్‌ కలవరపడుతుందా?
– అసలు కొండపైన చిరుతల లెక్క తేల్చారా?
– చిరుతలు సరే.. ఎలుగుబంట్ల సంగతేమిటి?
– మెట్ల మార్గం మూసివేతనే పరిష్కారమార్గమా?
– పీఠాథిపతుల సలహాలు తీసుకోరా?
– కర్రలిచ్చినా మళ్లీ చిరుత దాడి చేయదన్న భరోసా ఏమిటి?
– మళ్లీ దాడి జరిగితే బాధ్యులు ఎవరు?
– భక్తులకు కర్రల సరఫరాపై సోషల్‌మీడియాలో పేలుతున్న సెటైర్లు
– కర్రలపై జగనన్న స్టిక్కర్లతో కామెంట్లు
– కర్రల కాంట్రాక్టు కూడా రెడ్డిగారికే ఇస్తారంటూ వ్యంగ్యాస్ర్తాలు
– తిరుమల కొండపై ‘కర్ర’సాముపై సోషల్‌మీడియాలో వ్యంగ్య ప్రశ్నాస్ర్తాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇదొక ‘కర్ర’సేవ. అయోధ్యలో హిందూ సైన్యం కరసేవ చేస్తే.. ఇప్పుడు తిరుమల మెట్ల మార్గంలో ‘కర్ర’సేవ చేస్తున్న వైచిత్రి. ఇక ఎవరైనా వెంకన్న భక్తులు తిరుమలకు నరక.. సారీ.. నడక దారిన వెళ్లాలంటే, కర్రసాము తప్పనిసరి. కర్ర తిప్పే అనుభవం లేకపోయినా, కనీసం చిరుతపులి వస్తే సినిమాల్లో చిరంజీవి మాదిరిగా.. కర్రను విష్ణుచక్రం లెక్క గిరగిరా తిప్పి, చిరుతను భయపెట్టేంత అనుభవం ఉన్నా చాలు. మిగిలింది అక్కడున్న గార్డులు చూసుకుంటారు.

కాబట్టి ఇప్పటినుంచే వెంకన్న భక్తులు.. ఎవరి ప్రాంతాల్లో వారు వస్తాదుల వద్దకెళ్లి, కర్ర తిప్పే విద్య నేర్చుకుంటే మంచిది. పాలక ప్రభువుల తాజా నిర్ణయం పుణ్యాన, ఇక రాష్ట్రంలో ‘కర్రసాము కోచింగ్‌ సెంటర్లు’ వెలసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఇదేదో కామెడీగా చెబుతున్న మాటలు కాదు. స్వయంగా టీటీడీ పాలక ప్రభువులే.. కర్రల సాయంతో చిరుతపులల నుంచి, మిమ్మల్ని మీరు రక్షించుకోండంటూ ఇచ్చిన ఉచిత ఊతకర్ర సలహా! ఎలాగూ కర్రలు ప్రభువులే సరఫరా చేస్తారు కాబట్టి, చేతిలో ఉన్న కర్రను ఎలా తిప్పాలో.. బయట కోచింగు సెంటర్లలో నేర్చుకుంటే సరి. ఇదికూడా చదవండి.. ‘నరక’దారి

ఆవిధంగా పంద్రాగస్టు రోజు వివిధ దళాలు ప్రముఖుల ముందు విన్యాసాలు చేస్తూ ముందుకు సాగుతున్నట్లు.. భక్తులు కూడా మెట్ల దారిలో కర్ర సాము చేసుకుంటూ ముందుకువెళ్లే దృశ్యాలు ఇక సర్వసహజం అవుతాయన్న మాట.

వెంకన్న దర్శనానికి పిల్లా పీచులతో వెళ్లే భక్తులు.. ఇకపై తిరుమలకు బయలుదేరేముందు, ఇన్సూరెన్సు కూడా చేయించుకోవడం బెటర్‌. ఇన్ని జాగ్రత్తలు తీసుకునే వారు మాత్రమే, మెట్ల మార్గం గుండా వెంకన్న సన్నిధికి చేరడానికి సిద్ధపడాలి మరి.

దానితోపాటు.. టీవీలు లైవ్‌టెలికాస్టు ఇచ్చినట్లు.. భక్తులు కూడా తాము మెట్లు ఎక్కే ముందు నుంచి- దాటే వరకూ సెల్‌ఫోన్ల నుంచి ఫేస్‌బుక్‌ లైవ్‌ ఇవ్వడం ద్వారా.. ‘మేం బతికే ఉన్నామ’న్న సమాచారం ఇస్తే, బంధువులు కూడా భయపడకుండా ఉంటారు. ఇవేమీ లేకపోతే గమ్మున బస్సెక్కి, కొండపైకి వె ళ్లి స్వామికి దండం పెట్టి కిందకు దిగితే, అంతకుమించిన సుఖం మరొకటి ఉండదు.

అసలు టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి చిన్నతనంలో కొండపై కనిపించని చిరుతపులలు, ఇప్పుడు ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయని, ఫారెస్టు డిపార్టుమెంట్‌ అర్జెంటుగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం వచ్చింది. అదేవిధంగా కొండ బోడిగుండుగా ఎలా మారిందో కూడా, విచారణలో తేల్చాల్సిన అవసరం జాతి ప్రయోజనాల దృష్ట్యా తేల్చాల్సి ఉంది.

‘నరక దారి’గా మారిన నడక దారిలో వెళ్లే భక్తులకు, చిరుతపులల భయం లేకుండా ఊత కర్రలివ్వాలన్న టీటీడీ పాలక ప్రభువుల ఆలోచన దివ్యమైనదే. భక్తులను చిరుతల నుంచి కాపాడాలన్న, టీటీడీ వారి తపన మెచ్చదగిందే. భక్తులంతా గుంపులుగా వెళ్లాలని, వారికోసం కొందరు గార్డులను నియమిస్తున్నట్లు ప్రకటించడాన్ని కచ్చితంగా స్వాగతించాల్సిందే.

టీటీడీ ఇచ్చే కర్రలతో.. పులిరాజాలు అదిరి-బెదిరిపోతాయన్న ఆలోచన, నయాపాలక ప్రభువులకు రావడం అద్భుతం.. అపూర్వం..అనన్యం.. అనితర సాధ్యం! ఇప్పటివరకూ ఇలాంటి ఆలోచన రాని, పూర్వ పాలకవర్గాలు పనికిమాలిన వారికిందే లెక్క!!

అంతా బాగానే ఉంది. పాలక ప్రభువుల కొత్త నిర్ణయాలపై భక్తులు- ప్రజలు- సోషల్‌మీడియా స్పందన విచిత్రంగా, వ్యంగ్యంగా కనిపించడమే ఇబ్బందికరం. కొండపై కర్రసాము వ్యవహారం వల్ల, ప్రస్తుతం సినిమాలకు దూరంగా రెస్టు తీసుకుంటున్న బ్రహ్మానందం మళ్లీ తెరపైకొచ్చి, సోషల్‌మీడియాను కడుపుబ్బ నవ్విస్తున్నారు. సుత్తి వీర భద్రరావును మళ్లీ గుర్తు చేస్తున్నారు.

నెటిజన్లు ‘కర్రల కేంద్రంగా’ అటు బ్రహ్మానందం, ఇటు సుత్తి వీరభద్రరావు ఫొటోలతో కామెంట్లు పెట్టి తెగ ఆడేసుకుంటున్నారు. అవి బాగా వైరల్‌ అవుతున్నాయి. భక్తులకు కర్రలు ఇస్తున్నామన్న టీటీడీ కొత్త చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి డైలాగులతోపాటు.. సుత్తి వీరభద్రరావు పిచ్చెక్కి బట్టలు చించుకునే, పాత సినిమా వీడియో ఒకటి, భూమన డైలాగుల మధ్యలో జోడించారు.

మరొక క్లిప్పింగ్‌లో.. మనిషిని వేటాడుతున్న పులి వీడియో మధ్యలో.. ‘అన్న వస్తున్నాడూ అని చెప్పండి’ అని జగనన్న పాత డైలాగులు వినిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

టీటీడీ ఇచ్చే కర్రలపై ఎలాగూ జగనన్న స్టిక్కరు ఉంటుంది కాబట్టి, పులులు వచ్చే సమస్యనే లేదని కొందరు నెటిజన్లు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం.. ‘ఆ కర్రల కాంట్రాక్టు కూడా రెడ్డిగారికే ఇవ్వండి. కర్రలు ఊరకనే రావుకదా’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆ మేరకు జగనన్న స్టిక్కరున్న కర్రలు కూడా, గ్రాఫిక్స్‌ చేసి ప్రచారంలో పెట్టేశారు. ఇక కర్రలతోపాటు చిరుతను భయపెట్టేందుకు.. జగనన్న పాటలతో చిడతలు వాయిస్తే, చిరుతలు వచ్చే అవకాశం లేదంటూ మరికొందరు ఉత్సాహవంతులు, వ్యంగ్యాస్ర్తాలు పెడుతున్నారు.

అయితే.. ఆ కర్రలపై జగనన్న స్టిక్కర్లేమీ లే వని భక్తులు చెబుతున్నారు. ఇక కర్రల కాంట్రాక్టు కథ ఇంకా బయటకు రాలేదు. ఇదీ.. కొండపై ‘కర్రసాము’కు సంబంధించి సోషల్‌మీడియాలో జరుగుతున్న ‘కర్ర’సేవ!

అంతా బాగానే ఉంది. టీటీడీ పాలక ప్రభువులు భక్తుల ప్రాణాలపై అమితాసక్తితో ప్రవేశపెట్టిన, ఈ ‘ఉచిత ఊతకర్రల పథకం’ సక్సెస్‌ అయితే సరి. అలాకాకుండా మళ్లీ ఏ చిరుతో వచ్చి మళ్లీ ఎవరినో ఒకరిని నోటకరుచుకుని పోతే, దానికి బాధ్యులు ఎవరు? అప్పుడు కర్రల పథకం మార్చి, మరో పథకం పెడతారా?

అసలు శేషాచల అడవుల్లో పులుల సంఖ్య ఎంతో తేల్చారా? బోనులో బంధించి, వదిలిపెట్టిన పులులే మళ్లీ వస్తున్నాయా? కొత్తవి వస్తున్నాయా? వాటిలో మనుషుల రక్తానికి అలవాటుపడిన మ్యానీటర్స్‌ ఎన్ని? అసలు ఈ కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు, పీఠాథిపతుల సలహాలు తీసుకున్నారా? చిరుతల సంగతి అటుంచి, తరచూ కనిపించే ఎలుగుబంట్ల నుంచి రక్షణ ఎలా?

మెట్ల మార్గం మూసివేయకుండా మరో ప్రత్యామ్నాయం ఆలోచించలేరా? మెట్ల మార్గం మూసివేత, వాహనాల నిలిపివేత నిర్ణయాలు తీసుకునేందుకు మేధావులే కానక్కర్లేదు. ఎవరైనా తీసుకుంటారు. కానీ దాని బదులు.. జంతువుల నుంచి భక్తులను కాపాడే మేధావులైన మొనగాళ్లు టీటీడీలో లేరా? అన్నవి భక్తకోటి సంధిస్తున్న ప్రశ్నలు.

LEAVE A RESPONSE