Suryaa.co.in

Devotional

కార్తీకమాసం

కార్తీకముతో సమానమైన మాసము లేదు. విష్ణు దేవునితో సమానమయిన దేవుడు లేడు. గంగతో సమానమగు తీర్థము లేదు అని చెప్పబడినది.తెల్లవారుజామునే నిద్రలేవడం, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లలో స్నానం చేయడం, బోళాశంకరునికి నిత్యమూ రుద్రాభిషేకం చేయడం, నుదుట విభూతిని మెడలో రుద్రాక్షల్నీ- లేదా- తులసి పూసల్ని ధరించండం రోజుకి ఒక పూట మాత్రమే భుజించడం, ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయడం…ఒకటేమిటి? ఇలా ఎన్నెన్నో సంప్రదాయాలని మూటగట్టుకుని తెచ్చింది పవిత్రమైన ఈ కార్తీకమాసం.ఈ కార్తీక మాసంలో చేసే వ్రతములలో ముఖ్యమైనవి కార్తీకస్నానం, ఉపవాసము, కార్తీకదీపము.
కార్తీకస్నానం :
కార్తీక మాసమంతా తెల్లవారుజామున లేచి కృత్తికా నక్షత్రం అస్తమించేలోగానే నదులలో గాని తటాకాలలో గాని అలాంటివి అందుబాటులేనప్పుడు ఇంట్లోని స్నానాల గదిలో అయినాసరే, తలస్నానం చేయాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది.
ఈ విధంగా నియమంతో స్నానం చేసి శివుడినిగాని, విష్ణవునుగాని, లేదా మరే దైవాన్నైనా సరే ధ్యానించడం వలన, అర్ఘ్యాదులు ఇవ్వడం వలన కురుక్షేత్రం, గంగానది, పుష్కరతీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సర్వపాపాలు నశించి పుణ్యఫలితాలు అందుతాయి.
కార్తీకమాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలనేది ఒక నియమం. దీనినే ‘నక్తమ్’ అంటారు. పగలంతా నిరాహారంగా ఉండలేనివారు పాలవంటి ద్రవపదార్థాన్ని గాని, పండువంటి ఘనపదార్థాన్ని గాని స్వీకరిస్తూ రాత్రివేళ చంద్ర దర్శనం చేసుకుని, దీపారాధన చేసుకుని భోజనం చేయాలి.
దీపారాధన :
కార్తీకమాసంలో దీపారాధన చేయడం మహామహిమోపేతమైనది. శివాలయంలోగాని, ఇంట్లోనైనా సరే ప్రాతఃకాలం, సాయంకాలం దీపారాధన చేయడం దైవానుగ్రహం లభ్యమయ్యే విధానం. ఎవరైనా సరే, తెలిసిగాని, తెలియకగాని, ఎక్కడైనా సరే కార్తీకమాసంలో దీపం పెడితే చాలు వారి సర్వవిధ పాపాలు హరింపవేస్తుంది. జ్ఞానం, మోక్షం, ఇహమున శ్రేయస్సు, శుభఫలితాలు కలుగుతాయి.
కార్తీకదీప దానంవల్ల నరకప్రాప్తి నివారణ కలుగుతుంది. ఈ మాసములో దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదము.
దీపం దానమిచ్చుట, బంగారము, నవధాన్యములు గాని, అన్నదానముగాని, శయ్య (మంచం) దానమిచ్చుట వలన స్త్రీలకు ఐదోతనము వృద్ధియగుటేగాక, మంగళప్రదము సౌభాగ్యకరముగా చెప్పబడినది.
సూర్యాస్తమయం అయిన వేంటనే సంధ్యాదీపం వెలిగించుట ముగ్గుపెట్టి ఇంటిముందు దీపం పెట్టుట, తులసి కోటలో దీపము పెట్టుట, తులసి పూజ, గౌరీపూజ చేయుట వలన ఆర్థిక బాధలు తొలగును.
కార్తీకమాసములో కొన్ని వస్తువులు నిషేధించడమైనది. అవి వాడరాదు.
ఇంగువ, పెద్ద ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి దుంప, గుమ్మడి కాయ, తీయగుమ్మడి, నువ్వులు నిషిద్ధముగా చెప్పబడినవి. ఈ మాసమున మాంసాహారం భుజించుట నిషిద్ధము. పగటి పూట ఆవుపేడతో అలికి, పద్మములతో ముగ్గులు పెట్టి, రంగు రంగుల రంగవల్లిపై కార్తీకదీపం పెట్టి, కార్తీక పురాణము చదివిన వారికి, వినిన వారికి ఏడు జన్మలవరకూ వైధవ్యం కలగదని కార్తీక పురాణము చెపుతున్నది.
ధాత్రీపూజ :
ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది. కార్తీకమాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి, మధుర పదార్థాలను నివేదించాలి.
బంధుమిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు ఉన్న వనంలో భోజనాలు చేయడం వనభోజనాలుగా ప్రసిద్ధి.

LEAVE A RESPONSE