Suryaa.co.in

Andhra Pradesh Telangana

తిరుమలలో కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుమల శ్రీవారి ద్వారదర్శనం కోసం టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచిన 21 నిమిషాల్లోనే భక్తులు బుక్‌ చేసుకోవడం విశేషం.డిసెంబర్‌ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారదర్శనానికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనం, గదుల కోటా టికెట్లను శుక్రవారం సాయంత్రం ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేసింది.

2.25 లక్షల రూ.300 దర్శన టికెట్లను ఉదయం 10 గంటలకు విడుదల చేయగా, కేవలం 21 నిమిషాల్లోనే పూర్తయ్యాయి. వీటి ద్వారా టీటీడీకి రూ.6.75 కోట్ల ఆదాయం సమకూరింది.మరో 10 రోజులపాటు రోజుకు 2 వేల చొప్పున ఈ టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. శ్రీవాణి దర్శన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు, గదుల కోటాను సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినం సందర్భంగా ఆదివారం దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్ర్తోక్తంగా నిర్వహించనున్నది. ఈ సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది.

తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇదేరోజు శ్రీవారి ఆలయంలో ప్రొటోకాల్‌ దర్శనం మినహా బ్రేక్‌ దర్శనం రద్దు చేశారు. శనివారం బ్రేక్‌ దర్శనం సిఫారసు లేఖలు స్వీకరించడం లేదని టీటీడీ పేర్కొన్నది.

పద్మావతి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పుష్ప ప్రదర్శన, శిల్పకళా ప్రదర్శన, పుస్తక ప్రదర్శన శాలను ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. చెన్నైకి చెందిన హిందూ మహాసభ ట్రస్ట్‌ చైర్మన్‌ డీఎల్‌ వసంత్‌కుమార్‌ తదితరులు అమ్మవారికి ఆరు గొడుగులను కానుకగా అందించారు.

టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, జేఈవో సదా భార్గవి, జేఈవో వీరబ్రహ్మం దంపతులు, డిప్యూటీ ఈవో గోవిందరాజన్‌, వీజీవో బాలిరెడ్డి, పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, కంకణ భట్టార్‌ మణికంఠస్వామి, అర్చకులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE