Suryaa.co.in

Editorial

కారుమూరి.. వాలంటీరు..ఒక ఉరి!

– వాలంటీర్లను అరెస్టు చేస్తే ఉరేసుకుంటానన్న మంత్రి కారుమూరి
– వాలంటీర్లను ఏమీ చేయలేడన్న మంత్రి
– వారిని అరెస్టు చేసి జైలుకు పంపితే ఉరేసుకుంటానన్న సంచలన వ్యాఖ్య
– తాజాగా దొంగనోట్ల కేసులో వాలంటీర్‌ అరెస్టు
– జైలుకు పంపిన పోలీసులు
– దొంగనోట్ల కేసులో గతంలో ఒకసారి అరెస్టయిన వాలంటీర్‌
– మంత్రి ఉరేసుంటారా అని సోషల్‌మీడియాలో ప్రత్యర్ధుల ప్రశ్నల వర్షం
– ఇప్పుడేమంటారంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి
– పెదవి విప్పని పరువుపోయిన మంత్రి కారుమూరి
– కారుమూరికి కొత్త కష్టం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయనో మంత్రి. సంచలన వ్యాఖ్యలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఆ అత్యుత్సాహంతో ఇటీవల ఒక సంచలన వ్యాఖ్య చేశారు. జనసేనాధిపతి పవన్‌కు వ్యతిరేకంగా చేసిన ఆ సవాలు, సహజంగానే చర్చకు దారి తీసింది.

‘‘వాలంటీర్లు ఎక్కడా వైసీపీ కండువా కప్పుకోవడం లేదు. పవన్‌ వారిని ఏమీ చేయలేరు. ఒక్క వాలంటీరును అరెస్టు చేసి జైలుకు పంపినా, నేను బహిరంగంగా ఉరేసుకుంటా’’- ఇదీ సదరు మంత్రి, పవన్‌నుద్దేశించి విసిరిన సవాల్‌.

సీన్‌ కట్‌చేస్తే.. మంత్రిగారు సవాల్‌ విసిరిన కొద్దిరోజులకే, వాలంటీరును దొంగనోట్ల కేసులో అరెస్టు చేసి, జైలుకు పంపడంతో.. మంత్రి గారు పరువు పోయినట్టయింది. అంతే.. దానితో సచివుడు గప్‌చుప్‌.. సాంబార్‌బుడ్డి! ఇప్పటివరకూ దానిపై పెదవి విప్పితే ఒట్టు!! ఆ కథేమిటో చూద్దాం రండి.

ఏపీలో వాలంటీర్ల అరాచకాలపై.. జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌ చేసిన ఆరోపణలు, ప్రకంపనలు సృష్టించాయి. అమ్మాయిల మిస్సింగ్‌ కేసుల్లో.. కొందరు వాలంటీర్ల హస్తం ఉందని, వారికి వైసీపీ నేతల దన్ను ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానితో వైసీపీలో అలజడి రేగింది. పవన్‌ ఆరోపణలకు నిరసనగా వైసీపీ మహిళా కార్యకర్తలు, ఆయన దిష్టిబొమ్మలు దగ్థం చేశారు. మహిళా కమిషన్‌ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. పదిరోజుల్లో పవన్‌ తన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని, చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ నోటీసులు పంపారు.

దానిపై స్పందించిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, జనసేనాధికి సవాల్‌ విసిరారు. ఒక్క వాలంటీరును అరెస్టు చేసి, జైలుకు పంపినా తాను బహిరంగంగానే ఉరేసుకుంటానని సవాల్‌ చేశారు. విచిత్రంగా ఆయన సవాల్‌ విసిరిన కొద్దిరోజులకే.. ఒక వాలంటీరును దొంగనోట్ల కేసులో పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపారు. దానితో కారుమూరికి సోషల్‌మీడియాలో కష్టాలు మొదలయ్యాయి.

లక్ష రూపాయలు అసలు నోట్లిస్తే, మూడు లక్షల దొంగనోట్లు ఇస్తానన్న ఒక డీల్‌లో.. వాలంటీరుతోపాటు మరికొందరు అరెస్టయ్యారు. కోసిగి మండలం దొడ్డి గ్రామంలో వాలంటీరు గోపాలకృష్ణ, కానిస్టేబుల్‌, మెడికల్‌ ఏజెన్సీ నిర్వహకుడు కలసి, ఈ దొంగనోట్ల దందాకు తెరలేపారు.

ఈ విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి కూపీ లాగితే, దొంగనోట్ల దందా కథ గుట్టురట్టయింది. వాలంటీరు గోపాలకృష్ణను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. కోర్టు సదరు వాలంటీరును రిమాండుకు ఆదేశించారు. అయితే వాలంటీరు గోపాలకృష్ణ ఈవిధంగా దొంగనోట్ల దందా చేస్తూ దొరికిపోవడం ఇది రెండోసారట.

ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్‌ కావడం, మంత్రి కారుమూరికి కష్టాలకు కారణమయింది. ‘‘ఇప్పుడు వాలంటీరును అరెస్టు చేసి జైలుకు పంపించారు కదా? మరి ఉరి ఎప్పుడు వేసుకుంటున్నారు మంత్రి గారూ? మా పవన్‌ చెప్పింది నిజమే కదా’’అంటూ, సోషల్‌మీడియాలో కారుమూరి రాజకీయ ప్రత్యర్ధులు, ఆయనను ఒక రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. అందుకే అతి సర్వత్రా వర్జయేత్‌ అని పెద్దలు చెప్పింది!

LEAVE A RESPONSE