-వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు కేటీఆర్కు తీరిక లేదా?
-కేసీఆర్ చదివిన 80 వేల పుస్తక విజ్ఞానం ఇదేనా?
-టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరదలు సృష్టించిన బీభత్సం వల్ల ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతం. 1986లో కూడా ఇదే రకమైన వరదలు వచ్చాయి. కానీ జూలై నెలలో ఇలాంటి వరదలు రావడం గత 100 సంవత్సరాలలో ఇదే మొదటిసారి. తెలుగు రాష్ట్రాలు దిగువ ప్రాంతాలలో ఉండడం దురదృష్టకరం. ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షపు నీరు రావడం వలన మనకు మరింత నీరు చేరి వరదల ప్రవాహం బీభత్సంగా మారుతున్నది.
ఈ వరదల వల్ల తెలంగాణ రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లుగా ప్రాధమిక అంచనా. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. 14 జిల్లాల్లో 32 మంది మృతి చెందారు. వంద గిరిజన తండాలు పది రోజులుగా కరెంటు కూడా లేకుండా వరద దిగ్బంధంలో ఉన్నాయి. గర్భిణీ లు ఇబ్బందులుపడుతున్నారు. ఇలాంటి విపత్తు గతంలో ఎన్నడూ చూడలేదు.
వరదల తీవ్రత ఇంత ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కంటి తుడుపుగా ఏటూరునాగారం మాత్రమే వెళ్లి తిరిగి వచ్చేశారు. సహాయం అందక ప్రజల ఆర్తనాదాలు ముఖ్యంగా భద్రాచలంలో 2 వేల మంది పిల్లలు పాలు లేక అల్లాడుతుంటే గుండె తరుక్కుపోతోంది. మిషన్ భగీరథ పైపులు దెబ్బతిని త్రాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు దెబ్బతిని రవాణా సౌకర్యాలు ఆగిపోయాయి.
తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్-1 అని.. జాతిపిత అని, అభినవ భగీరథ అని చెప్పుకునే కేసీఆర్ రాష్ట్రంలో వరద ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి తలదించుకోవాలి.1986 వరదల సమయంలో గానీ, విశాఖ వరదల సందర్భంలో కానీ ఏ విపత్తు వచ్చినా చంద్రబాబు, తెలుగుదేశం ప్రభుత్వం తక్షణం స్పందించి సహాయ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టి ప్రజలను ఆదుకునే వారు. ఇప్పటి కేసీఆర్ ప్రభుత్వర ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు.
ఆంధ్రప్రదేశ్లో కలిపిన 7 మండలాల ప్రజల పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వీరు కట్టుబట్టలతో వచ్చి ఇతర ప్రాంతాలలో తలదాచుకుంటున్నారు. వీరిని అలాగే వదిలేయడం న్యాయమా?
విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చామని చెప్పుకునే కేటీఆర్ వరద ప్రాంతాలలో పర్యటించడానికి సమయం దొరకలేదా? రూ.760 కోట్లకు పైగా ఖర్చు పెట్టి కాళేశ్వరంలో భాగంగా బిగించిన బాహుబలి మోటార్లు.. ఇప్పుడు వరదలలో చిక్కుక్కుకు పోయి ఉన్నాయి. వీటి రిపేర్లకు రూ.420 కోట్లు ఖర్చు అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కల్వకుర్తిలో చిన్న పైపులు వరదలో చిక్కుకుంటే వాటిని తీసి బాగు చేయడానికి గతంలో 4 నెలలు పట్టింది. బాహుబలి మోటార్లు రిపేర్లు చేయడానికి ఇంకెంత సమయం పడుతుందో వేచి చూడాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలకు నీరు ఇచ్చారు? ప్రభుత్వం చెప్పాలి. ఏమి సాధించామో ప్రజలూ ఆలోచించాలి.
క్లౌడ్ బరెస్ట్ చేశారని ఇది విదేశీ కుట్ర అని కేసీఆర్ మాట్లాడటం చిన్నపిల్లలు కూడా నవ్వుకునే పరిస్థితి. కేసీఆర్ ఇలా మాట్లాడటానికి ప్రశాంత్ కిశోర్ కారణమనే అనుమానాలు ప్రజలలో ఉన్నాయి. 80 వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే కేసీఆర్ ఇలాంటి మాటలను మాట్లాడి ప్రజలలో చులకన కావొద్దు.
ఎకరాకు తక్షణ సహాయంగా రూ.15 వేలు చెల్లించాలి. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి. రైతులకు విత్తనాలు, నారు, ఎరువులు ఉచితంగా సరఫరా చేయాలి.