– ఇక్కడ యుద్ధం.. అక్కడ మంతనాలు
– రేవంత్‌పై తాజాగా కేటీఆర్ మాటల దాడి
– కేసీఆర్ కుటుంబ ఆస్తుల చిట్టా విప్పుతున్న రేవంత్
– రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతల పోలీసు కేసులు
– తాజాగా చెన్నైలో కాంగ్రెస్ జాతీయ నేతలతో కవిత భేటీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్- విపక్ష కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని, ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో కేసీఆర్ కుటుంబసభ్యుల పేరిట ఉన్న భూముల చిట్టాను రేవంత్ సందర్భంగా ఉన్నప్పుడల్లా విప్పుతున్నారు. ధరణి పేరుతో బీఆర్‌ఎస్ దందాను బహిర్గతం చేస్తున్నారు.
తాజాగా రేవంత్ లక్ష్యంగా శాసనసభలో మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రేవంత్‌ను ఆర్‌టీఐని అడ్డుపెట్టుకునే బ్లాక్‌మెయిలర్‌గా కేటీఆర్ అభివర్ణించారు. మరోవైపు సెక్రటేరియేట్ నక్సల్స్ పేల్చేసినా తమకు అభ్యంతరం లేదని, రేవంత్ చేసిన వ్యాఖ్య దుమారం రేపుతోంది. రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహించిన బీఆర్‌ఎస్ నేతలు, ఆయనపై తెలంగాణ వ్యాప్తంగా పోలీసుస్టేషన్లలో కేసులు పెట్టారు. దానితో కాంగ్రెస్-బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. ఈ పరిణామాల నేపథ్యంలో చైన్నై వేదికగా జరిగిన ఓ భేటీ.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగే అవకాశాలు-అనుమానాలకు తెరలేపింది. అదేంటో చూద్దాం రండి.
కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చెన్నైలో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఒకవైపు ఒకరిపై మరొకరు యుద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయ నేతలతో, కేసీఆర్ కుమార్తె కవిత మంతనాలు
జరపటం చర్చనీయాంశమయింది. కాంగ్రెస్ సీనియర్ మనీష్ తివారీ, తిరుచ్చి ఎంపీ శివ, ఏఐసిసి అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్‌ను ఆమె కలిశారు. అదేవిధంగా కేంద్రమాజీ మంత్రి, బీజేపీ మాజీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్య స్వామితో కూడా ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ రాజకీయాలతోపాటు, తనపై సీబీఐ-ఈడీ కేసుల గురించి వారికి వివరించినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాడి,
ఆ పార్టీని గద్దెదింపాల్సిన అవసరాన్ని కవిత వారి వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో, కాంగ్రెస్ నేతలతో కవిత చర్చల ప్రభావం, తెలంగాణ రాజకీయాలపై ఎంతవర కూ ఉంటుందన్న చర్చకు తెరలేచింది.