Suryaa.co.in

Telangana

కేసీఆర్.. రచ్చబండకు రెడీనా?

– నేను సెక్యూరిటీ లేకుండానే వస్తా
– కేసీఆర్, కేటీఆర్, హరీష్‌కు మోసీ ఒడ్డున ఇళ్లు ఇవ్వండి
– ముగ్గురికీ భోజన సదుపాయాలు ఏర్పాటుచేయండని ఆదేశం
– మీరు మూడు నెలలు అక్కడ ఉంటే నేను ప్రాజెక్టు విరమించుకుంటా
– బీఆర్‌ఎస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సంచలన సవాల్
– మూసీ నదికి సంబంధించి జరిగిన ఒప్పందం రూ.141 కోట్లు మాత్రమే
– మరి లక్షా 50 వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?
– ఇది మూసీ సుందరీకరణ కాదు.ఇది మూసీ పునరుజ్జీవనం
– సచివాలయంలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ప్రజల భవిష్యత్ ను, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించే కార్యాచరణ ప్రభుత్వం తీసుకుంది. 33 బృందాలు మూసీ పరివాహక ప్రాంతంలో పేదల సమస్యలను తెలుసుకున్నాయి. దుర్గంధంలో దుర్భర జీవితాలను గడుపుతున్న పేదల కష్టాలను తెలుసుకున్నాం. ప్రపంచంతో పోటీ పడే నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతాం.

ఉపాధి కల్పనతో అక్కడి పేదలను ఆదుకోవాలనే ఆలోచన మా ప్రభుత్వానికి ఉంది. నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. కాంగ్రెస్ విజన్ వల్లే దేశానికి ప్రపంచంతో పోటీ పడే శక్తి లభించింది. దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీది. పెట్టుబడుల సరళీకరణ విధానం తీసుకొచ్చింది పీవీ నరసింహారావు. ఆనాడు నెహ్రూ, రాజీవ్, పీవీ ప్రవేశపెట్టిన పాలసీలను కొందరు వ్యతిరేకించారు.

కానీ ఆ పాలసీలే దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాయి. అధికారం కోల్పోయిన నిస్పృహతో కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు. బందిపోటు దొంగల్లా పదేళ్లు తెలంగాణను దోచుకున్నవారు మూసీ పునరుజ్జీవనాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సుందరీకరణ అంటూ కాస్మటిక్ కలర్ అద్దాలని చూస్తున్నారు. వాళ్ల మెదడులో మూసీ మురికి కంటే ఎక్కువ విషం నింపుకున్నారు.

ఇది సుందరీకరణ కోసం కాదు.. ఇది మూసీ పునరుజ్జీవనం కోసం. మూసీ మురికి నుంచి ప్రజలను కాపాడాలనేదే మా ప్రయత్నం. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచాలనేదే మా ఆలోచన. మల్లన్న సాగర్ ,రంగనాయక్ సాగర్ , కొండపోచమ్మ కు నేను ఎక్కడికైనా వస్తా.ఎక్కడికైనా సెక్యూరిటీ లేకుండా రావడానికి నేను సిద్ధంగా ఉన్నా.మీరూ రండి రచ్చబండ నిర్వహిద్దాం.

కేసీఆర్.. నీ నియోజకవర్గానికి నేను వస్తా. రచ్చబండలో కూర్చుని చర్చిద్దాం. ఇది మూసీ సుందరీకరణ కాదు…మూసీ పునరుజ్జీవనం. ఇది కొందరు దుబాయ్ వెళ్లి అందం కోసం జుట్లు నాటించుకోవడం లాంటి కార్యక్రమం కాదు. నగరం మధ్య నదీ ప్రవాహం ఉన్న నగరం దేశంలో ఎక్కడా లేదు. మూసీ పరివాహక ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారిని తరలించాలనేదే మా ఆలోచన. 1600 పైచిలుకు మూసీ ఇండ్లు నదీ గర్భంలో ఉన్నాయి.

దసరా నేపథ్యంలో వారికి ఇండ్లు ఇచ్చి, ఖర్చులకు డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి తరలించాం. మల్లన్న సాగర్, కొండపోచమ్మ బాధితులను దుర్మార్గంగా రాత్రికి రాత్రి ఖాళీ చేయించింది మీరు, కొండపోచమ్మ ప్రాజెక్టులో మునిగిన 14 గ్రామాల్లో ఏ ఒక్కరికైనా ఇండ్లు ఇచ్చారా? మిడ్ మానేరు ముంపు బాధితులకు ఇండ్లు ఇస్తామని మోసం చేసింది మీరు. కానీ మేం అలా చేయడం లేదు.

బఫర్ జోన్ లో ఉన్న 10వేల కుటుంబాలకు కూడా పునరావాసం కల్పిస్తాం. ఈ నగరాన్ని అభివృద్ధి చేయడం విపక్షాలకు ఇష్టంలేదా? చరిత్ర కాలగర్భంలో మూసీని సమాధి చేయదలచుకున్నారా? మేం ఉండేది ఐదేళ్లా, పదేళ్లా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఉప్పెనలా వరదలు వస్తే నగరమే మిగలదు. ఇదేమైనా గజ్వేల్ ఫామ్ హౌసా? లేక ధరణి లాంటి మాయాజాలమా?

ఎవరినో మోసం చేసి ఏదో చేయాలన్న ఆలోచన నాకు లేదు.మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్ట్ లో నా స్వార్థం లేదు. ఆదాయాన్ని పెంచి పేదలకు పంచడమే మా ప్రభుత్వ ఆలోచన. మూసీ విషం హైదరాబాద్ నగరాన్నే కాదు. నల్లగొండనూ విషతుల్యం చేస్తోంది. నల్గొండ ప్రాంతానికి ఎలా పునరుజ్జీవనం కలిగించాలి. మాట్లాడితే లక్షా 50వేల కోట్లు అని మాట్లాడుతున్నారు.మీలా దోచుకోవడానికి ఇదేమైనా కాళేశ్వరం అనుకున్నారా?

మూసీ రివర్ కు సంబంధించి ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసేందుకు ఐదు కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. మూసీ పునరుజ్జీవనంతో పాటు అవసరమయ్యే నిధుల అంచనా, సేకరణ లాంటి ప్రణాళికలు రూపొందిస్తారు.18 నెలల్లో మూసీని ఏం చేయాలో వారు డీపీఆర్ అందిస్తారు. ఇప్పటి వరకు మూసీ నదికి సంబంధించి జరిగిన ఒప్పందం రూ.141 కోట్లు మాత్రమే. మరి లక్షా 50 వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?

సుందరీకరణ అనే పదాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది మూసీ సుందరీకరణ కాదు.ఇది మూసీ పునరుజ్జీవనం. మూసీ పునరుజ్జీవనం అనే గొప్ప కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి.. అసూయ, ద్వేషంతో కొందరు సృష్టించే అపోహలను నమ్మకండి. హైదరాబాద్ నగరంలోని అద్భుతమైన చారిత్రక కట్టడాలను కాలగర్భంలో కలిపేయాలని కొందరు కంకణం కట్టుకు తిరుగుతున్నారు.

ఏ సంస్థల గురించి వాళ్లు మాట్లాడుతున్నారో, అవే సంస్థలకు వాళ్లు కూడా గతంలో కాంట్రాక్టులు ఇచ్చారు. అప్పుడు లేని అభ్యంతరం మూసీ అభివృద్ధి విషయంలోనే ఎందుకు? వాళ్లు చేస్తే గొప్ప.. మేం చేస్తే తప్పా? హరీష్, కేటీఆర్, ఈటెల ముగ్గురూ మూడు నెలలు మూసీ ఒడ్డున నివసించాలి. ఇప్పుడే ఆ ముగ్గురికీ ఇండ్లు కేటాయించాలని అధికారులకు ఆదేశిస్తున్నా. వాళ్లకు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయండి. మూసీ పరివాహకం అలాగే ఉండాలనుకుంటే మీరు అక్కడ ఉండి రోల్ మోడల్ గా నిలవండి.మూడు నెలలు మీరు అక్కడ ఉండగలిగితే నేను ఈ ప్రాజెక్టును విరమించుకుంటా.

ఒక తెలంగాణ కవి తన నలుగురు కూతుర్లకు గంగ, యమునా, సరస్వతీ, కృష్ణవేణి అని పేర్లు పెట్టుకున్నాడు. మన మూసీ నది పేరు పెట్టుకోకపోవడానికి గత పాలకులు కాదా? ఈ ద్రోహాన్ని ఇలాగే కొనసాగిద్దామా? దేశ ద్రోహం కంటే ఇది పెద్ద నేరం.

హిరోషిమా,నాగసాకిలలో పడిన అణుబాంబు కంటే మూసీ ఆక్రమణ ప్రమాదకరం. మూసీ నది పునరుజ్జీవనంపై చర్చకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెడదాం.

మూసీ పరివాహక ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. వారికి ఏం ఇద్దామో చెప్పాలని కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డి, ఈటెల చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నా.అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకుని ఎంపీల అభిప్రాయాలను అసెంబ్లీ రికార్డుల్లోకి తీసుకుందాం. మన నగరాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మీరు చెప్పండి.

ఎంఐఎం, బీజేపీ, బీఆరెస్, కమ్యూనిస్టు పార్టీల అధ్యక్షులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయో నాకు పంపండి. ప్రభుత్వం రాతపూర్వక వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.ఈ శనివారం లోగా మీరు యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని కోరుతున్నా.

LEAVE A RESPONSE