ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ 20 ఏండ్లూ కేసీఆర్ యుగం
TRS 20 వేల ఏండ్ల చరిత్ర కలిగిన పవిత్ర భూమి తెలంగాణ. రాజులను, రాజ వంశాలను, రాజధానులను కన్న గడ్డ. కాలం కాలనాగై కాటేసి, అర్థం లేని సిద్ధాంతాలు ఆవరించి, పరాయి పాలనలో పడ్డ మాతృభూమి విముక్తి కోసం నడుం కట్టిన ముద్దు బిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ఒక కల గని, కాలంతో కలబడి, ఆఖరిదాకా నిలబడి, కేవలం సంకల్ప బలంతోనే బలవంతులతో కొట్లాడి కోరుకున్నది సాధించిన యోధుడతడు.
చరిత్రలో 20 ఏండ్ల కాలం చాలా స్వల్పమైనది… ఒక ఉద్యమానికైనా, ఒక రాజకీయ పార్టీకైనా! పరిపాలనలో ఏడేండ్లు చాలా చిన్నది.. ఏ ప్రభుత్వానికైనా, జాతి పునరుజ్జీవనానికైనా! కానీ ఇంత తక్కువ వ్యవధిలోనే సకల జనమనోరథాన్ని సాధించి నిరూపించారు కేసీఆర్.
2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, 2021 నాటికి పల్లెపల్లెనా ప్రగతి జెండా ఎగరేయడమనేది అందరికీ సాధ్యం కాదు. 20 ఏండ్ల కిందట మన మనస్సెట్లా గడబిడ పడ్తుండె? ఇప్పుడేమంటున్నది! ఏడేండ్ల కిందట మన జీవితేచ్ఛ ఎట్లుండె? ఇప్పుడెట్లున్నది!
టీఆర్ఎస్ సాధించింది ఏమిటంటే..
అదే..మన బతుకులో వచ్చిన మార్పు… మన మనసు చెప్పే మాట!చరిత్రను టీఆర్ఎస్ మలుపు తిప్పడంలో కర్త కర్మ క్రియ కేసీఆర్. గుండెల నిండా ఆత్మ విశ్వాసం, వెంట నడిచే ప్రజా సమూహాలకు ఆశావాదం, గురిపెట్టిన బాణంలాంటి వ్యూహం, కాలాన్ని సైతం మార్చగల కర్తవ్యం, మంత్రముగ్ధం చేసే మాట, మాట ఇస్తే తప్పని కమిట్మెంట్, ఏదేమైనా తన ప్రజలకు కించిత్తు హానీ జరగకూడదనే పరిణత, ఉద్దండుల్ని మించిన రాజకీయ చతురత.. ఇవన్నీ కలిస్తే కేసీఆర్. అంపశయ్యనెక్కి ఆశయాన్ని సజీవంగా నిలపడమే కాదు; మన ఆశల ఆకాశాన్ని నేల మీదికి దించి చూపిస్తున్నవాడు కేసీఆర్!
కేసీఆర్ ఏది చేసినా, దాని ఆంతర్యం తెలంగాణ.. అంతరార్థం తెలంగాణ! తన అధికారాన్ని కాదు; తన తెలంగాణ శాశ్వతంగా ఉండేట్టు చేస్తున్నడు కేసీఆర్. ఆయన పెట్టిన ప్రతి పథకమూ ఇర్రివర్సబుల్.కేసీఆర్ ఇండిస్పెన్సబుల్!
ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ 20 ఏండ్లూ కేసీఆర్ యుగం, కేసీఆర్ శకం!
కేసీఆర్ భాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, నిరంతరం ప్రజ్వలించే ఆకాంక్ష. గమ్యం చేరే వరకూ కాడి దించనిది అయన విజయ జిగీష. కలలు కనండి, కష్టపడండి, అవి కచ్చితంగా నిజమవుతాయి, ఇదీ ఆయన జీవితమిచ్చే సందేశం. కేసీఆర్ వ్యక్తిత్వంలో అనేక పార్శాలున్నాయి. ఆయనను పూర్తిగా వివరించడానికి కలాలు చాలవు, కాలం సరిపోదు. అయినా టీఆర్ఎస్ 20 ఏండ్ల పండుగ సందర్భంగా ఆకాశమంత ఆయన వ్యక్తిత్వాన్ని అద్దంలో చూపించే చిరు ప్రయత్నం చేసింది నమస్తే తెలంగాణ!
తెలంగాణ ప్రజలకు, పోరాట యోధులకు, టీఆర్ఎస్ శ్రేణులకు ద్విదశాబ్ది శుభాభినందనలు. తెలంగాణ అమర వీరులకు జోహార్లు.
నాకు తల్లివి నీవు నే నీకు తండ్రి
నల్ల నాటికి నేటికి నను దినమ్ము
మ్రోయుచున్నావు నా గళమ్మున, కలాన
నా తెలంగాణ! కోటి రత్నాల వీణ!
– దాశరథి
20 ఏండ్ల ఉద్యమంతో గెలిచింది తెలంగాణ.
గెలిపించింది కేసీఆర్.
కలబడింది టీఆర్ఎస్,
నిలబడింది తెలంగాణ.
అవహేళనల, అవమానాల కాలం నుంచి
ఇప్పుడు తెలంగాణ ఆత్మాభిమానంతో తలెత్తుకుంటున్నది…
కాళేశ్వరమంత విశాలంగా…
యాదాద్రి అంత ఉన్నతంగా..
బతుకమ్మంత కలర్ఫుల్గా!
సిగ్గుపడాల్సిన పని లేదు.
నామోషీ అంతకంటే అవసరం లేదు.
మీరు, నేను ప్రతి ఒక్కరం…
ప్రపంచంలో ఎక్కడికి పోయినా…
గర్వంగా తలెత్తుకుని చెప్పుకోవచ్చు ఇప్పుడు…
నా తెలంగాణ.. నాది తెలంగాణ
అయామ్ ఫ్రమ్ తెలంగాణ!
( నమస్తే తెలంగాణ సంపాదక బృందం)