పుట్ట బంగారం

ఎంత విత్తుకున్నా ఆశలు మొలకెత్తని
నెర్రెలు వారిన నేల.. పల్లె కన్నీరు ఎంకన్న పాట
ఎన్ని పైపులేసి తోడినా
నీరు గక్కని బోరు గుండెల గోస గోస
చినుకురాలని కాలం మెడమీది కత్తి
చేనూ చెలక మీది ప్రేమ
అప్పుల కుప్ప.. ఎన్ని దేవుళ్ళకు మొక్కినా
పిడికెడు మెతుకు రాశి అగుపడని నారుమడి
ఎప్పుడూ ఎడారే
ఏరు ఎండిన ఊరు
వలస పల్లవి ఎత్తుకున్న కన్నీటి మూట
దినదినం ఊరుతున్న దుఃఖం
ఏ శివుడూ మింగని హాలాహలం
బ్రతుకు కూలీ లేదూ
మంగళి పదునుపాట లయదప్పి
చాకిరేవూ అలిగి కూర్చున్నది
బార్ష మొద్దువారింది
కుమ్మరింట మట్టి చెదలు పుట్టయి
కమ్మరి పొయ్యి చల్లవడ్డది
పొద్దు మాపు గీత గీసినా
కమ్మదనం జుర్రుకునే లేగదూడ లేని ఏకాకి తాటివనం
పడుగుపేక పొలిమేర దాటని చంటిపిల్లాయే
అప్పువుట్టని ఊళ్ళే
గొళ్ళకురుమల బువ్వకుండ ఎప్పుడో అడవి పాలాయే
ఊరు అచ్చం మంచం నేస్తున్న ముసలవ్వే
ఏ దేవదేవుని వరమో.. ఏ దీన బాంధవుని దీవెనో
ఆ యాదగిరి నరసింహుడి కరుణ
ఉరుము లేని పిడుగులా రాలిపడ్డదో ఏమో
భగీరథ ప్రయత్నం.. గడప గడపనూ ముద్దాడుతుంటే
చెరువు ఆనందం నిండిన తాండవమాడుతున్నది
రెండు పదుల వసంతం
వెన్నెల అద్దుకున్న నిండు పున్నమి పరిమళం
ఏ దూర తీరానికో ఎగిరిపోయిన
ఆకలి పావురం ఊరి కొమ్మన వాలుతున్నది
తల్లికి బిడ్డ దొరికినట్టు.. అరువయ్యేండ్ల బిడ్డ
అమ్మ వొడిల పసితనం అయినట్టు
ఇప్పుడు ఊరు.. పూల నవ్వుల నెత్తుకున్న పూల చెట్టు
నవ నాగరికం దిద్దిన స్వచ్ఛ భారతం
ముక్కుతూ మూల్గుతూ.. వొళ్ళంత వొత్తి
చమురు దీపమై నెగ్గిన పోరుగాణం
నేల మనదే నింగి మనదే
నడుమ జొచ్చిన పరపీడనం
ఎన్ని దీపాలు దొర్లిన నూరేండ్ల శాపం
ఓ నా దేవ దేవుడా.. యాదాద్రి నిలయా
ఈ నా పుట్ట బంగారం మీద
ఏ రాబందు కన్ను పడనున్నదో
ఏ దుష్టశక్తి కరి మింగిన వెలగపండులా
పొదుగు పాలు తాగనున్నదో
కాయకష్టం అలవాటైన దేహం
తల వొంచుకుపోతున్నది
ఎన్నుపూస నిలబడు ఉపాయం
ఏ జమ్మి కొమ్మల్లోనో దాగినట్టు
బ్రతుకు సాగుతున్నది
జరంత కాపుగాయి సామీ..
కూలుతున్న సూరు
పెంక కొప్పు సవరించుకున్నది
ఇరుకిరుకూ బొంబాయి భీమండీ వలస రెక్కలు
మాయిముంత జాడ పట్టుకుని
స్వతంత్ర రాగం ఆలపిస్తున్నయి
ఒంటి చేత్తో ఎత్తుకున్న ఇసుక దేశాలన్నీ
అనాథ పిల్లల్లా చూస్తున్నయి
అద్దంలా మెరుస్తున్న ఊరు
తెప్పలు తెప్పలుగా నీరుజేరిన పద్యం
ఈ వూరి పిట్టగూడు
ఫీనిక్స్‌ పక్షులు జేరిన కలెగూర గంప
పట్నమయితున్న పల్లె
పచ్చపచ్చని లంగవోణీ పరువం
యాదగిరి లక్ష్మీనరసింహా
లోతు తెలియని అడుగులు పడుతున్నయి
ఆపద గాయి సామీ
మళ్ళీ నగరం మీది బ్రతుకు దెరువుకు సైరనూది
పిల్ల జెల్లల దండుగట్టు ఓపిక జారిపోయింది
ఇన్నాళ్ళ ఆకలి కావడి
దేశంగాని దేశం తిరిగింది
ఇప్పుడే కూరాడు పూదిచ్చిన అమ్మ
కడుపు నిండు అన్నమవుతున్నది
ఊరంతా కలువలు పూసిన కొలను సంబురం
తూరుపు వెలుగు విరబూసిన సంతోషం
ఈ బొడ్డుతాడు బంధం తెగకుండా చూడు తండ్రి..

(కమల్‌గౌడ్)

Leave a Reply