– బిఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల
– 40 మంది ముఖ్య నేతలకు అనుమతి
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి బీఆర్ఎస్ అథినేత, మాజీ సీఎం కేసీఆర్ రానున్నారు. ఇప్పటివరకూ తన ఫాంహౌస్‌లోనే పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్న కేసీఆర్.. తొలిసారిగా ఉప ఎన్నిక ప్రచారం కోసం బయటకు రానున్నారు. ఆ మేరకు బీఆర్ఎస్ తాజాగా ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు కనిపించింది.
అయితే అనారోగ్యం కారణంగా ఇప్పటివరకూ బయటకు రాని కేసీఆర్.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పూర్తి స్థాయిలో పాల్గొంటారా? లేక ఒక రోడ్‌షోతో ప్రచారం పరిమితం చేస్తారా? అన్నది చూడాలి. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్ధికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నందున, కేసీఆర్ ప్రచారానికి వస్తే అది అభ్యర్ధి విజయంతోపాటు, క్యాడర్లో జోష్ పెంచేందుకు కారణమవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం కోసం బిఆర్ఎస్ పార్టీ తరపున మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆమోదం తెలిపింది.
బిఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా (ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు):
పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనే 40 మంది ప్రముఖులలో మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలైన కె. తారక రామారావు, టి. హరీష్ రావు, టి. శ్రీనివాస్ యాదవ్, వి. ప్రశాంత్ రెడ్డి, జి. జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి మరియు ఎస్. నిరంజన్ రెడ్డి ఉన్నారు. ఇతర మాజీ మంత్రులలో మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ ఉన్నారు.
మాజీ ఉప సభాపతులు టి. పద్మారావు గౌడ్, పద్మా దేవేందర్ రెడ్డి తో పాటు, ఎమ్మెల్యేలైన ఎం. కృష్ణ రావు, కె.పి. వివేకానంద గౌడ్, డి. సుధీర్ రెడ్డి, డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, పాడి కౌశిక్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, అనిల్ జాదవ్, బండారు లక్ష్మా రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, ముఠా గోపాల్, చింతా ప్రభాకర్ కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు.
ఎమ్మెల్యేలలో దాసోజు శ్రవణ్, శంబీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తత మధుసూధన్, ఎల్. రమణా, తక్కెలపల్లి రవీందర్ రావు ఉన్నారు. ఎంపీ వద్దిరాజు రవి చంద్ర, మాజీ ఎమ్మెల్యేలు విష్ణు వర్ధన్ రెడ్డి, షకీల్ అమీర్ మొహమ్మద్, మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, షేక్ అబ్దుల్లా సోహైల్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు తధ్యం: దాసోజు
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత విజయం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా, మాగంటి గోపీనాధ్ బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రధానంగా మైనారిటీలు మాగంటి కుటుంబం వైపే ఉన్నారని, కాంగ్రెస్‌కు ఎవరిని చూసి ఓటు వేయాలని ప్రశ్నించారు. మహిళా అభ్యర్ధిని అవమానిస్తున్న కాంగ్రెస్‌ను మహిళాలోకం చిత్తుగా ఓడించి, మహిళల సత్తా చాటాలని శ్రవణ్ పిలుపునిచ్చారు.