– తన తప్పు బయటపడకుండా ప్రయివేటు కంపెనీ వెనక దాక్కుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం
– ధరణి సమస్యలపై ప్రజలకు భరోసా కల్పించాల్సింది పోయి.. కొత్త సమస్యలను సృష్టిస్తున్న సర్కారు
– ప్రశ్నించిన వారిపై అప్రజాస్వామిక, నిరంకుశ చర్యలకు పాల్పడుతున్న వైనం
– నిజాం పాలనను తలపిస్తున్న 9 ఏళ్ల కేసీఆర్ పాలన
– ఓవైపు ‘స్వామిత్వ’ ద్వారా సమస్యల్లేకుండా.. ఆస్తి ధృవీకరణ పత్రాలు అందజేస్తున్న కేంద్రప్రభుత్వం
– మరోవైపు ఉన్న సమస్యలను పరిష్కరించకుండా.. ప్రజలను ఇబ్బందిపెడుతున్న బీఆర్ఎస్ సర్కారు
– కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి
17 జూలై, 2023, న్యూఢిల్లీ: ఎన్నో పోరాటాల తర్వాత సాధించుకున్న తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా నిజాం అప్రజాస్వామిక, నిరంకుశపాలన కొనసాగుతోంది. తమను వ్యతిరేకించేవారిని.. తమ నిర్ణయాలకు వ్యతిరేకంగా గళమెత్తేవారిని అడ్డంగా తొక్కిపడేస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకతను చూపించే వీ6 చానెల్‌ను, వెలుగు పత్రికను.. నిషేధించారు. గతంలోనూ వివిధ పత్రికలు,చానళ్లను బ్యాన్ చేశారు. తమ అసమర్థతను ప్రజలకు చూపించే చానళ్లను 10 కిలోమీటర్ల లోతున పాతిపెడతానన్న విషయం ఇంకా తెలంగాణ ప్రజలకు గుర్తుంది.
ఇవి కాకుండా ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ఎత్తిచూపిస్తున్న పాత్రికేయులెందరినో ముఖ్యమంత్రి కేసీఆర్, వారి కుటుంబసభ్యులు బహిరంగంగానే బెదిరించడం, అర్దరాత్రి ఇళ్లపై దాడిచేసి అరెస్టులు చేయడం, కూరగాయలకు వెళ్తున్న వారిని పట్టుకుని మఫ్టీ పోలీసులతో కిడ్నాపులు చేయించి బెదిరించడం వంటివి ప్రజల కళ్లముందు ఇంకా మెదులుతూనే ఉన్నాయి.
నాటి నిజాం పరిపాలనతో తెలంగాణ చూసిన అరాచకాలన్నీ నేటి తొమ్మిదవ నిజాం పాలకుడైన కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు కనబడుతున్నాయి. అధికారం కోసం ఎంతకైనా తెగించడం, తమను ఎదిరించేవారిని అధపాతాళానికి తొక్కేయడం లక్ష్యంగా కేసీఆర్ సర్కారు పనిచేస్తోంది. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భరోసా కల్పించకుండా.. కల్వకుంట్ల కుటుంబం అహంకారపూరితంగా వ్యవహరిస్తుండటంతో.. ధరణి వంటి సమస్యలు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి.
ఇవాళ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలో ఓ ప్రైవేటు కంపెనీ ద్వారా ప్రకటన విడుదల చేయించడం.. బీఆర్ఎస్ ప్రభుత్వ, కల్వకుంట్ల కుటుంబం.. వివాదాస్పదమైన ‘ధరణి’ అంశంలో తమకే తప్పు తెలియదని చేతులు కడుక్కున్నట్లు స్పష్టమవుతోంది. ధరణి కారణంగా తెలంగాణ ప్రజలు,మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని 75 లక్షల మంది రైతులు.. తీవ్ర ఇబ్బందుల పాలవుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో రైతులకు,ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను కబ్జా చేసుకుంటున్న వారినుంచి భరోసా కల్పించాల్సింది పోయి.. తన అసమర్థతను మరోసారి బట్టబయలు చేసుకుంటూ.. ఓ ప్రయివేటు కంపెనీ ప్రకటన ద్వారా ప్రకటన కేసీఆర్ సర్కారు చేయించడం దుర్మార్గమైన చర్య.
ప్రజల్లో ధరణిపై గందరగోళమైన పరిస్థితి నెలకొన్న సందర్భంలో.. దీనికి సమాధానం ఇవ్వడం, భరోసా కల్పించడం ప్రభుత్వం బాధ్యత కాదా? ప్రభుత్వ పరంగా బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి.. పత్రికలను, విపక్షాలను విమర్శిస్తూ.. తమ తప్పులు దాచుకునేందుకు ఇతరులను బాధ్యులుగా చూపించేలా వ్యవహరించడం.. ప్రభుత్వ అనైతిక పద్ధతులకు, దివాళాకోరు విధానాలకు నిదర్శనం.
మారుతున్న సాంకేతికత నేపథ్యంలో.. డేటా ప్రైవసీ (గోప్యత) ఓ కీలకమైన అంశంగా ఉంది. అయితే.. ప్రభుత్వ వెబ్సైట్లకు, ప్రభుత్వ సంబంధిత అంశాలకు సంబంధించిన డేటా విషయంలో.. సంపూర్ణ బాధ్యత ప్రభుత్వానిదే. వీటి విషయంలో ఎదురయ్యే ఏ సమస్యకైనా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ధరణి విషయంలోనూ డేటా సంబంధిత విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. కానీ ప్రభుత్వం ప్రజల సమస్యలు, రైతుల ఆందోళనలను పట్టించుకోకుండా.. పాత సమస్యలను తీర్చాల్సిందిపోయి.. కొత్త సమస్యలను సృష్టించింది. అనవసరంగా సరికొత్త వివాదాల తుట్టెను కదిల్చింది.
VRO లను ధరణి వ్యవస్థలోకి చొప్పించి.. వారి సహాయంతో ఈ వ్యవస్థను సరిగ్గా అమలుచేయాల్సి ఉండగా.. ఒకేసారి VRO వ్యవస్థను రద్దుచేయడంతోపాటుగా.. మానవుల ద్వారా తలెత్తే సమస్యలకు (హ్యూమన్ ఎర్రర్స్) సాంకేతికత సహాయంతో.. అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరించవచ్చనే కేసీఆర్ సర్కారు దుర్గార్గపు ఆలోచన కారణంగా ఈ సమస్య మరింత పెద్దదిగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల కారణంగా.. కలెక్టర్లపైనా అదనపు భారం పడింది. తద్వారా మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇది చాలదన్నట్లు.. జరుగుతున్న సమస్యలను సరిదిద్దుకునే ప్రయత్నంలో.. ప్రభుత్వ అసమర్థత మరింత స్పష్టంగా బట్టబయలైంది.
ఓవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ‘స్వామిత్వ యోజన’ ద్వారా పేదలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా ఆస్తి ధృవీకరణ పత్రాలను, టైటిల్ డీడ్లను అందజేస్తోంది. అదే సమయంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం వైఫల్యాలను చవిచూస్తూ.. ప్రజల సమస్యలు పరిష్కరించకపోగా.. మరిన్ని ఇబ్బందుల పాలుచేస్తోంది. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రయివేటు సంస్థలను ముందునిలబెట్టి.. దాని వెనక దాక్కునే ప్రయత్నం చేస్తోంది.