-లేనిపక్షంలో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
-ఇన్నేళ్లుగా అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు ఎందుకు వెళ్లలేదు?
-దళితుడిని సీఎం ఎందుకు చేయలేదు?
-దళితులకు మూడెకరాలివ్వకుండా ఉన్న జాగాలను ఎందుకు లాక్కుంటున్నావ్?
-ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ నిధులివ్వకుండా పేదలకు విద్య, వైద్యాన్ని ఎందుకు దూరం చేస్తున్నావ్?
-దళిత బంధు యాడ్ ను చూసి జనం నవ్వుకుంటున్నారు
-కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దళిత బంధుపై శ్వేత పత్రం విడుదల చేయాలి
-అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిన పార్టీ కాంగ్రెస్
-అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న పార్టీ బీజేపీ
-అణగారినవర్గాలకు రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర మంత్రి పదవులిచ్చిన ప్రభుత్వం మోదీదే
-లిక్కర్ స్కాం, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశాలపై ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు కేసీఆర్ డ్రామాలు
-రేపు వేలాది మందితో వరంగల్ లో నిర్వహించే ‘‘నిరుద్యోగ మార్చ్’’ భారీగా తరలిరండి
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
-పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించిన బండి సంజయ్
రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి, వర్దంతి కార్యక్రమాలకు హాజరుకాకుండా ఆవమానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలొస్తున్నాయని అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతోపాటు కోట్ల రూపాయలు వెచ్చించి యాడ్స్ ఇస్తూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను ఉద్దేశించి ‘‘ఇన్నేళ్లుగా అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు ఎందుకు వెళ్లలేదు? తెలంగాణ ఉద్యమం సమయంలో దళితుడినే తొలి సీఎంగా చేస్తానని ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదు? దళితులకు మూడెకరాలు ఎందుకివ్వలేదు? దళితుల పేరిటనున్న జాగాలను ఎందుకు లాక్కుంటున్నారు? ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ నిధులివ్వకుండా పేదలకు విద్య, వైద్యాన్ని ఎందుకు దూరం చేస్తున్నావ్?…కేసీఆర్ కు దమ్ముంటే నా ప్రశ్నలకు ఈరోజు అంబేద్కర్ విగ్రహా ప్రతిష్ట కార్యక్రమ వేదికగా సమాధానం చెప్పాలి. లేనిపక్షంలో తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి’’అంటూ సవాల్ విసిరారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా బండి సంజయ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జై భీమ్… భారతమాతాకీ జై అంటూ నినదించారు. అంతకుమందు పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి క్రిష్ణప్రసాద్, సీనియర్ నేత చింతా సాంబమూర్తి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు..
అణగారిన వర్గాల ఆశాజ్యోతి, పేద వర్గాల దిక్సూచి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలందరికీ హ్రుదయ పూర్వక శుభాకాంక్షలు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుని ఈనెల 6 నుండి 14 వరకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయ వారోత్సవాలను నిర్వహిస్తూ అంబేద్కర్ ఆలోచనలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళుతోంది. బీజేపీ కార్యకర్తలు పోలింగ్ బూత్ ల వారీగా అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఉన్నోడు కాదు. అగ్ర కులస్తుడు కాదు.. చిన్నప్పటి నుండే కష్టపడి చదువుకుని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితం ధారపోసిన వ్యక్తి. తనలాగ రాబోయే తరాలు ఇబ్బంది పడకూడదని అనేక సంస్కరణలు తీసుకొచ్చిన నేత. అణగారిన వర్గాల దిక్సూచి అంబేద్కర్ అని ఐక్యరాజ్యసమితి పొగిడిందంటే అంబేద్కర్ గొప్పతనం అర్ధం చేసుకోవాలి. ప్రపంచంలో ప్రజాస్వామ్యం సన్నగల్లుతుంటే 140 కోట్ల భారత్ లో ప్రజాస్వామ్యం ఫరిఢవిల్లుతుందంటే అందుకు అంబేద్కర్ రాజ్యాంగమే కారణం. సంక్షేమ ఫలాలు చివరి వ్యక్తి వరకు అందించాలనే ఉద్దేశంతో అంత్యోదయ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తి అంబేద్కర్, దేశ విభజనను, 370 ఆర్టికల్ ను వ్యతిరేకించిన వ్యక్తి అంబేద్కర్. 370 ఆర్దికల్ ను రద్దును వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్. అంబేద్కర్ ను ఓడించిన పార్టీ కాంగ్రెస్ అయితే అంబేద్కర్ కు భారత రత్న ఇచ్చేలా చేసిన పార్టీ బీజేపీ. అంబేద్కర్ జన్మించిన, మరణించిన, నివసించిన, చదువుకున్న స్థలాలను పంచ్ తీర్ధాలుగా తీర్చిదిద్దిన పార్టీ బీజేపీ. అంబేద్కర్ ఆలోచన, ఆశయాలను కొనసాగిస్తున్న పార్టీ బీజేపీ.
దళితులు ఉద్యోగాలిచ్చే స్థాయికి రావాలనే లక్ష్యంతో ఏటా 1.25 లక్షల మంది దళితులను పూచికత్తు లేని రుణాలిచ్చి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్న పార్టీ బీజేపీ. దళిత, గిరిజనులను రాష్ట్రపతిని చేసిన పార్టీ బీజేపీ. కేబినెట్ లో 12 మంది దళితులకు స్థానం కల్పించిన పార్టీ బీజేపీ. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేటాయించిన ఇండ్లలో అత్యధికంగా దళిత, బడుగు, బలహీనవర్గాలే లబ్ది పొందుతున్నాయి. జన్ ధన్ ఖాతాల్లో అత్యధికంగా దళితులే లబ్ది పొందుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఏనాడూ అంబేద్కర్ ను గుర్తించిన దాఖలాల్లేవ్. ఆయన జయంతి, వర్దంతి కార్యక్రమాలకు ఏనాడూ హాజరుకాని వ్యక్తి ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి బీజేపీ వ్యతిరేకం కాదు.. కానీ ఏళ్ల తరబడి పెండింగ్ లో నున్న అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు పూర్తి చేయడం లేదని బీజేపీ అనేకసార్లు గళమెత్తింది. సచివాలయాన్ని అనేక సార్లు సందర్శించి పనులను పరిశీలించిన కేసీఆర్ ఏనాడూ అంబేద్కర్ విగ్రహ పనులను పరిశీలించని విషయాన్ని ప్రజలు గుర్తించాలి.
అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించే అర్హత కేసీఆర్ కు లేదు. అంబేద్కర్ ను, దళితులను అడుగడుగునా అవమానించిన వ్యక్తి కేసీఆర్. ఇన్నేళ్లుగా అంబేద్కర్ జయంతి, వర్దంతులకు ఎందుకు హాజరు కాలేదో.. ఈరోజు ఆ వేదిక సాక్షిగా కేసీఆర్ జవాబివ్వాలి. దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. దళితుడిని ఎందుకు సీఎం చేయడం లేదో సమాధానం చెప్పాలి. దళితులకు మూడెకరాలు ఇవ్వకపోగా ఉన్న భూమిని లాక్కున్న సీఎం క్షమాపణ చెప్పాలి. దళిత బంధు దేశానికి దిక్సూచి అంటూ యాడ్స్ ను చూసి జనం నవ్వుకుంటున్నరు. ఎంత మందికి దళిత బంధు ఇచ్చారో, ఎవరెవరికి ఇచ్చారనే వివరాలపై దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చేయాలి. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పీవీ జయంతి నిర్వహించి ఓట్లు దండుకున్న కేసీఆర్ ఆ తరువాత ఏనాడూ పీవీ జయంతి, వర్ధంతులకు వెళ్లని విషయాన్ని ప్రజలు గమనించాలి.
ఈరోజు కూడా ఎన్నికలు రాబోతున్న అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఓట్లు దండుకోవాలనుకుంటున్నడు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ తో ఎక్కువ లబ్ది పొందుతున్న వాళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలే. ఆ నిధులు చెల్లించకపోవడంవల్ల వాళ్లకు కార్పొరేట్ విద్య, వైద్యం అందడం లేదు. ముఖ్యమంత్రి ఎన్ని జిమ్మిక్కులు చేసినా దళిత సమాజం కేసీఆర్ ను క్షమించదు. కేసీఆర్ కు నిజంగా దమ్ముంటే మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లేనిపక్షంలో తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తాం.
లిక్కర్ స్కాంలో బిడ్డ, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో కొడుకుపై ఆరోపణలొస్తుంటే దారి మళ్లించేందుకు కేసీఆర్ డ్రామాలాడుతున్నారు. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన వరంగల్ లోని కాకతీయ యూనివర్శిటీ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ‘‘నిరుద్యోగ మార్చ్’’ నిర్వహిస్తున్నాం. ఆ తరువాత అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ నిరుద్యోగ మార్చ్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ది చెబుదాం.