Suryaa.co.in

Telangana

కేసీఆర్ బీసీ ద్రోహి… పేదల బద్ద వ్యతిరేకి

-టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సర్వనాశనమవుతోంది
-సీతమ్మను నగ్నంగా చిత్రీకరించిన మునావర్ ను రప్పిస్తారా?
-తక్షణమే తెలంగాణ ప్రజలకు సీఎం క్షమాపణలు చెప్పాల్సిందే
-హిందువులారా… మునావర్ ప్రొగ్రాంను బహిష్కరించండి
-నారాయణ, చైతన్యసహా ఫీజుల కోసం వేధిస్తున్న కాలేజీలను వెంటనే మూసేయించాలి
-గౌడ కులస్తులకు చేసిందేమిటో కేసీఆర్ చెప్పాల్సిందే
-సర్వాయి పాపన్న స్పూర్తితో గొల్లకొండపై కాషాయ జెండా ఎగరేస్తాం
-తేనెపూసిన కత్తి… తడిగొంతుతో గొంతుకోసే రకం కేసీఆర్
-అధికారంలోకొస్తే పర్యాటక కేంద్రంగా ఖిలాషాపూర్ కోట
-పాఠ్యాంశాల్లో పాపన్న చరిత్రను పొందుపరుస్తాం
-ఖిలాషాపూర్ బహిరంగ సభలో బండి సంజయ్ వ్యాఖ్యలు
-సంజయ్ సమక్షంలో పలువురు నేతలు బీజేపీలో చేరిక

ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల ద్రోహిగా మారారని, పేదల బద్ద వ్యతిరేకిగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీతమ్మను నగ్నంగా చిత్రీకరించడంతోపాటు శ్రీరాముడ్ని కించపర్చిన మూర్ఖుడు మునావర్ ఫారుఖీని సిగ్గు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కు తీసుకురావడం సిగ్గు చేటన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా హిందువులకు ఏ సంకేతాలను పంపదల్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజమైన హిందువులెవరూ మునావర్ ఫారుఖీ కార్యక్రమానికి వెళ్లొద్దని… ఆ కార్యక్రమానికి వెళ్లే వారంతా డూప్ హిందువులేనన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తూ ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న నారాయణ, చైతన్యసహా కార్పొరేట్ కళాశాలలను తక్షణమే మూసివేయించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో ఒక్క కానిస్టేబుల్ ను కూడా నియమించలేని వ్యక్తి హోంమంత్రిగా, ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేని వ్యక్తి గ్రుహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారని, అయినప్పటికీ వాళ్లంతా మంత్రి పదవులు పట్టుకుని వేలాడుతున్నరని ఎద్దేవా చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న స్పూర్తితో కేసీఆర్ పాలనను బొందపెట్టడంతోపాటు గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేసి తీరుతామని పునరుద్ఘాటించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ నడిబొడ్డున అతిపెద్ద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతోపాటు ఖిలాషాపూర్ ను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని, వెనుకబడ్డ గీత వ్రుత్తుల వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 17వ రోజు జనగాం పట్టణ శివారు నుండి చీటకోడూరు మీదుగా ఖిలాషాపూర్ వరకు మొత్తం 15 కి.మీలు నడిచారు. అందులో భాగంగా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని ఖిలాషాపూర్ గ్రామంలోని సర్దార్ సర్వాయి పాపన్న ఖిల్లా వద్ద స్థానిక జిల్లా నేతలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నందీశ్వర్ గౌడ్, బూడిద భిక్షమయ్యగౌడ్, పాదయాత్ర సహ ప్రముఖ్ వీరేందర్ గౌడ్, జిల్లా అధ్యక్షులు దశమంత్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్, రాష్ట్ర నాయకులు గడీల శ్రీకాంత్ సహా పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగ పూర్తి వివరాలు….

పేరుకు ఆత్మగౌరవ భవనాలు… అందుకు ఒక రూపాయి కూడా ఇచ్చేది లేదు. మొఘలాయుల పాలిట మగాడు సర్దార్ సర్వాయి పాపన్న. ఖిలాషాపూర్ లో అడుగు పెట్టగానే… నాలో వైబ్రేషన్ మొదలైంది. తెలంగాణ చత్రపతి, దళపతి సర్దార్ సర్వాయి పాపన్న. బహుజన రాజ్యం రావాలని… బహుజన రాజ్యం కోసం పరితపించిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. ఇప్పటివరకు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చలేదు. సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేరుస్తాం.

ఖిలాషాపూర్ రోడ్లు కూడా లేని పరిస్థితి ఉంది. కోట్లు ఖర్చు పెట్టి, 8 నెలల్లో 100 రూముల గడీలను కేసీఆర్ కట్టుకున్నాడు. మొఘలాయిలను గడగడలాడించిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్న దే. ఇలాంటి మహనీయుని చరిత్రను తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో ఏర్పడ్డ తెలంగాణలో… పెద్దోడు రాజ్యమేలుతున్నాడు. కెసిఆర్ కులవృత్తులను నిర్వీర్యం చేస్తున్నాడు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కి, అంబేద్కర్ జయంతిలకు కేసీఆర్ రాడు.

కెసిఆర్ నంబర్ వన్ దొంగ. తడి బట్టతో గొంతుకోసే రకం కేసీఆర్. కెసిఆర్ కులవృత్తులను ప్రోత్సహించడం లేదు. గౌడ కులస్తుడు మంత్రిగా ఉన్న మీకు న్యాయం జరగడం లేదు. ఏ కులపు మంత్రి ఉన్నా… ఆ కులాలకు న్యాయం జరగదు. కెసిఆర్ కు బెల్టు షాపులపై ప్రేమ ఎక్కువ… అందులో పార్ట్నర్ షిప్ లు… కమిషన్లు అందుకుంటాడు. వైన్ షాపుల నుంచి కేసీఆర్ కుటుంబానికి వాటాలు అందుతాయి. తాటి చెట్ల వద్ద డ్రంకన్ డ్రైవ్ పెట్టిన సీఎం ఒక్క కేసీఆరే.

రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ ద్రోహి. పేదల బద్ద వ్యతిరేకి. అగ్రవర్ణ పేదలను కూడా ఆదుకోవడం లేదు. బ్రాహ్మణులు దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారు. మన దేవతల చిత్రాలను(రాముడు, సీతమ్మ) వ్యంగ్యంగా గీసిన మునావర్ ఫారూఖీ గానికి కేసీఆర్ పర్మిషన్ ఇచ్చిండు. మునావర్ ఫారూఖీ కార్యక్రమానికి కెసిఆర్ పర్మిషన్ ఇవ్వడానికి ఆంతర్యం ఏమిటో చెప్పాలి? మునావర్ ఫారూఖీ కార్యక్రమానికి నిజమైన హిందువు ఎవడు వెళ్లొద్దు. హిందూ సమాజానికి కెసిఆర్ క్షమాపణ చెప్పాలి. ఇవాళ రాజా సింగ్ ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. దేవుళ్ళను కించపరిచినా… హిందూ సమాజమే భరించాలి. బహుజనుల రాజ్యం కోసమే మేము పోరాటం చేస్తున్నాం.

పూర్తిగా కులవృత్తులు నిర్వీర్యం అయిన పరిస్థితి ఉంది. కులవృత్తులను ప్రోత్సహించడానికి కేసీఆర్ చేపట్టిన ప్రణాళికలు ఏంటి? మునుగోడులో రోజుకు ఒక ఫుల్ బాటిల్ ఇస్తాడు. మునుగోడు ఉప ఎన్నిక లోపు… ఇన్ని సంవత్సరాలలో కెసిఆర్ చేసింది ఏంటో సమాధానం చెప్పాలి. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కి కెసిఆర్ రాకపోవడం… గౌడ సమాజాన్ని కించ పరచడమే. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కి కేసీఆర్ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలి.

కేంద్ర కేబినెట్లో సామాజిక న్యాయం పాటించింది నరేంద్ర మోడీ మాత్రమే. ఒక్క బీజేపీ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ నడిబొడ్డున అతిపెద్ద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. ఖిలాషాపూర్ ను టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తాం. కులవృత్తులకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తాం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిరుపేదలకు ఇళ్లను నిర్మిస్తాం. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు కలిసి… గిరిజన మహిళను రాష్ట్రపతి కాకుండా ఓడకొట్టే ప్రయత్నం చేశారు.

తెలంగాణ వస్తే నారాయణ, చైతన్య కాలేజీలను రాష్ట్రం పొలిమేరల దాకా తరిమికొడతామన్న సీఎం, రాష్ట్రం నిండా ఆయా సంస్థలను కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ కాలేజీల నుండి పెద్ద ఎత్తున కమీషన్లు దండుకుంటూ, పార్టనర్ షిప్ తీసుకుంటున్నారు. అందుకే అడ్డూ అదుపు లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈరోజు రైతు కుటుంబానికి సంబంధించిన సాయి నారాయణ అనే విద్యార్థి ఫీజు కోసం వేధించడంతో పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయానికి యత్నించడం బాధాకరమన్నారు. బీజేపీ కనుక అధికారంలో ఉంటే ఫీజుల కోసం వేధించే కాలేజీలను మూసివేయించేవాళ్లం.

చైతన్య, నారాయణ కాలేజీల కోసం కరోనా సమయంలో… లాక్ డౌన్ లను సడలించడం వలన…. లక్షల్లో ఫీజులు వసూలు చేశారు. ఫీజులు కట్టలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 100 ల మంది విద్యార్థులు కార్పొరేట్ కాలేజీల వలన ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే… ఈ ఎనిమిదేళ్ల కాలంలో… కార్పొరేట్ కళాశాలల పై ఎన్ని కేసులు బుక్ చేశారో కేసీఆర్ సమాధానం చెప్పాలి. కేసీఆర్ గడీలను బద్దలు కొట్టడంలో మీరంతా భాగస్వామ్యం కావాలని కోరుతున్నా.

LEAVE A RESPONSE