-రోజుకు కేవలం రూ.120 వేతనంతో పనిచేయించుకోవడం దుర్మార్గం
-18 వేల మంది వీవోఏలు కేసీఆర్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారు
: బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప
ప్రభుత్వ పథకాలను కిందిస్ధాయిలో అమలు చేయడంలో కీలక పాత్ర పోశించే ఐకేపీ వీఓఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా అమానవీయంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప ఆరోపించారు. వీవోఏలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్, కల్హేర్ మండల కేంద్రాల్లో సంగప్ప పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు. అనంతరం మెదక్ జిల్లా వీవోఏల సంఘం అధ్యక్షుడు సాయగౌడ్ నేతృత్వంలో ఈపలువులు సంగప్పతో భేటీ అయి తమ సమస్యను బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరారు.
ఈ సమస్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్తానని సంగప్ప వారికి హామీ ఇచ్చారు. అనంతరం సంగప్ప మీడియాతో మాట్లాడుతూ వీవోఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరి దుర్మార్గంగా ఉందని అన్నారు. 365 రోజులు, 24 గంటల పాటు అధికారులకు అందుబాటులో ఉంటూ పనిచేసే వీఓఏ లకు నెలకు కేవలం రూ.3900 మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారని, ఇంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉందా అని సంగప్ప ప్రశ్నించారు. ఉపాధి హామీ కూలీ, అడ్డా కూలీ కి వచ్చే దినసరి వేతనంలో కనీసం సగం కూడా వీఓఏ లకు రావట్లేదని, అయినా వారు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. వారిక దినసరి వేతనం కేవలం రూ.120 మాత్రమే అయినా, అన్ని కార్యక్రమాల అమలు కోసం వాళ్లు పనిచేస్తుంటే A,B,C,D గ్రేడులు పెట్టి ఈ ప్రభుత్వం వీవోఏలను తీవ్ర అవమానంచేస్తోందని సంగప్ప దుయ్యబట్టారు. వీవోఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని సంగప్ప డిమాండ్ చేశారు.
మంత్రులు, కేసీఆర్ కుటుంబ సభ్యుల జల్సాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెడుతుంటే, వీవోఏల కు కనీసం వేతనం ఇవ్వడానికి డబ్బులు లేవా అని సంగప్ప ప్రశ్నించారు. రెండు ఎన్నికల ముందు వీవోఏలతో తియ్యాగా మాట్లాడి వేతనం పెంచుతా అని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మరిచి పోయారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 వేల మంది వీవోఏలు కేసిఆర్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయం అని సంగప్ప చెప్పారు. ఈ కార్యక్రమంలో సిర్గాపూర్ ఎంపీ పీ పీరప్ప, పార్టీ సీనియర్ నేతలు సాయిరాం, గోపాల్ రెడ్డి, సంజూ పాటిల్, పట్నం మాణిక్, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.