Suryaa.co.in

Telangana

భంగపడ్డ తెలంగాణను బాగు చేసిన మహనీయుడు కేసీఆర్

-సీఎం కెసిఆర్ ని, BRS పార్టీని మరోసారి ఆశీర్వదించాలి
-పసిడి పంటలకు నిలయంగా పాలకుర్తి నియోజక వర్గం
-చేతగాని ప్రతిపక్ష పార్టీలు నీతులు చెప్పడం సిగ్గు చేటు
-చిల్లర రాజకీయాలు చేసేవారిని ప్రజలు గమనిస్తున్నారు
-సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పుతారు
– వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని పెరకవేడు , మహబుబ్ నగర్ గ్రామాలు కలిపి పెరకవేడు లో, అలాగే, కాట్రపల్లి, సన్నురు గ్రామాలు కలిపి వెంకటేశ్వరపల్లి లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

భంగపడ్డ తెలంగాణ ను బాగు చేసిన మహనీయుడు మన సీఎం కేసీఆర్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని పెరకవేడు , మహబుబ్ నగర్ గ్రామాలు కలిపి పెరకవేడు లో, అలాగే, కాట్రపల్లి, సన్నురు గ్రామాలు కలిపి వెంకటేశ్వరపల్లి లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ….
కార్యకర్తలే బలం.. ప్రజలే నా బలగమని.. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందాయని తెలిపారు. మన రాష్ట్రం మరింత అభివృద్ది చెందాలంటే సీఎం కెసిఆర్ గారిని, BRS పార్టీని మరోసారి ఆశీర్వదించాలి అన్నారు. గత 15 ఏళ్లలో పసిడి పంటలకు నిలయంగా పాలకుర్తి నియోజక వర్గం మారిందన్నారు. మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీల కుట్రలను, చిల్లర చేష్టలను తిప్పికొట్టాలన్నారు.రాష్ట్రంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు నీరు పుష్కలంగా లభించి వ్యవసాయ బాగా పంటలు పండుతుండడంతో సీఎం కేసీఆర్‌ పాలనలో రైతులు రాజుగా మారుతున్నారన్నారు.

తెలంగాణ ఏర్పాటైతే కరెంటు ఉండదని, దీపాలు పెట్టుకోవాల్సి వస్తుందని హేళన చేసిన పార్టీల నోరు మూయించేలా 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాకముందు ఏ గ్రామానికి వెళ్లినా కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు దర్శనమిచ్చేవని, పంటలు ఎండిపోయేవన్నారు. ఇప్పుడు తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. రోహిణి కార్తె వస్తే పంట పెట్టుబడి లేక రైతు గుండె దడదడలాడేదని, ఎట్ల నాటేసుకుంటమో… ఏదైనా బంగారం కుదవ పెట్టుకునేటోళ్లు, షావుకార్ల చుట్టూ తిరిగేటోళ్లని గుర్తుచేశారు.

ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ బాగా ఆలోచించి పెట్టుబడి కోసం రైతుబంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. రైతు చనిపోతే రూ. 5 లక్షలు వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లో పడుతున్నాయన్నారు. పంట దళారుల పాలు కాకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు. మిషన్‌ కాకతీయతో చెరువు, కుంటలను అపురూపంగా తీర్చిదిద్దుకున్నామన్నారు.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలతో అన్ని వర్గాల ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.1,00,116 ఇస్తున్నామన్నారు. 24 గంటల కరెంటు ఇస్తుండడంతో ఓర్వ లేని కేంద్రం ఉచిత కరెంటును నిలిపివేస్తే రాష్ర్టానికి రూ.30 వేల కోట్లు ఇస్తానని చెప్పినా వినకుండా సీఎంకేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం ఉచిత కరెంటు ఇస్తూ కేంద్రం నిర్ణయాన్ని తిరస్కరించినట్లు తెలిపారు.

కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణపై అడుగడుగునా వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు సీఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, అడ్డగోలుగా మాట్లాడుతున్నాయని ధ్వజమెత్తారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, కార్యకర్తల కష్టాలు తెలుసుకుందామనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. దేశంలోని పలు రాష్ర్టాల్లో బీఆర్‌ఎస్‌కు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఏవిధంగా పాల్గొని రాష్ర్టాన్ని సాధించుకున్నామో అదే తరహాలో బీఆర్‌ఎస్‌ పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపు నిచ్చారు.

కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యమ కాలంలోనే ప్రజలు, రైతుల కష్టాలు తెలుసని, వాటిని తీర్చేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేస్తున్నదని విమర్శించారు. మోదీ తెలంగాణపై క్షక్షగట్టి ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. దేశ వ్యాప్త మార్పు కోసం బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందని వివరించారు.

దేశంలో ఒక్క తెలంగాణ మినహా అన్ని రాష్ర్టాల్లో ఆకలి చావులు ఉన్నాయని, మోదీ ప్రధాని అయ్యాక ఇవి మరింత పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయడం లేదని మండిపడ్డారు. గుజరాత్‌లో రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌, ఆసరా పింఛన్లు, రైతులకు ఉచిత కరంట్‌ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు.

అభివృద్ధి విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు, ఉచిత కరెంట్‌, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ తదితర సంక్షేమ పథకాలు అమలు చేసి ఏ రాష్ర్టానికి అందనంత ఎత్తులో తెలంగాణ వెలుగొందుతున్నదని తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించాకే రాష్ట్రంలో ప్రగతి ప్రారంభమైందని, సీఎం కేసీఆర్‌ దార్శనికత, పట్టుదలతో ఇది సాధ్యమైందని చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో గ్రామంలో రూ. కోటి మేర నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు.

ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు మాట్లాడుతూ, రైతుబంధు, 24 గంటల కరెంట్‌, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ తదితర పథకాలు కొనసాగి మరింత అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని మూడోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE