Suryaa.co.in

Telangana

కేసీఆర్ పాస్ పోర్ట్ బ్రోకర్…

– కాంట్రాక్టర్లతో కేసీఆర్ కుమ్మక్కైండు. ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దొబ్బుతున్నడు
– ఒక్కో తలపై లక్షా 20 వేల రూపాయల అప్పు మోపిండు
– బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌

పాస్‌పోర్ట్‌ బ్రోకర్‌గా పనిచేసిన కేసీఆర్‌ హయాంలో పాలన ఏవిధంగా నీతివంతంగా ఉంటుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. ప్రాజెక్టుల్లో కమిషన్‌ తీసుకుంటున్న కేసీఆన్‌ కథ తేల్చేందుకే తాను పాదయాత్ర చేస్తున్నానన్నారు. మోదీ చెప్పినందుకే తాను మీ ముందుకు వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నానని సంజయ్‌ అన్నారు.

బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులతో బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. ఇప్పుడు ఎన్నికల్లేవు. గ్రామాల్లోకి వెళ్లి పేదల బాధలు తెలుసుకుని రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పడంతో ఏడాది నుండి తిరుగుతున్నం. బాధలు తెలుసుకునేందుకు.. పేదలను ఆదుకోవడానికే ఇక్కడికి వచ్చినం.

నిన్నటి నుండి తిరుగుతున్న. యాదాద్రి గుడి కడుతున్నరని అందరం సంతోషించినం. తీరా చూస్తే గుడి పేరుతో చుట్టుపక్కలనున్న భూములను అత్యంత తక్కువ రేటుకు కేసీఆర్, ఆయన మనుషులు కొన్నరు. ఇక గుడి విషయానికొస్తే.. దర్శనానికి వెళదామంటే మోకాళ్లలోతు నీళ్లున్నయ్… భక్తులకు ఇబ్బందులు. ఇగ ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయింది. వ్యాపారస్తులు ఉపాధి కోల్పోయిండ్రు. కానీ కేసీఆర్ దుర్మార్గుడు.. ప్రజలను పట్టించుకోడు. శంకర్ దాదా ఎంబీబీఎస్ లాగా డూప్ ఇంజనీర్ అవతారమెత్తి కమీషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును నిండా ముంచిండు.

ఎక్కడైనా ప్రాజెక్టులు కడితే రైతులు సంతోషపడాలే.. కానీ భూములిచ్చిన రైతులు సంతోషంగా లేరు.. కన్న ఊరును విడిచి పెడుతున్నా… వారిని ఆదుకోవడం లేదు…ఏ రైతును చూసినా బాధలే కన్పిస్తున్నరు.అయ్యా కేసీఆర్… తెలంగాణ వచ్చినంక రాష్ట్రంలో ఎక్కడ చూసినా తక్కువలో తక్కువ ఎకరం భూమి రూ.50 లక్షలు పలుకుతోందని అన్నవ్ కదా… మరి ఏమైంది? హైదరాబాద్ కు దగ్గర్లోనే ఉన్న బస్వాపూర్ ముంపు బాధితులకు ఆ మేరకు ఎందుకు పరిహారం ఇవ్వడం లేదు? ఇదేం న్యాయం?

నా సొంత నియోజకవర్గం హుస్నాబాద్ లోని గౌరవెళ్లి ప్రాజెక్టు ముంపు బాధితుల గోస చెప్పనక్కర్లేదు. భూములు, ఇండ్లు కోల్పోయి బాధపడుతుంటే పరిహారం అడిగిన పాపానికి లాఠీఛార్జ్ చేసి రక్తం కారేటట్లు కొట్టి జైళ్ల వేసిండ్రు. నేను ఆ బాధితులను తీసుకొచ్చి ఆశ్రయం కల్పించాల్సిన వచ్చింది.బస్వాపూర్ లోనూ అదే పరిస్థితి. కేసీఆర్… నువ్వు చేసిన పాపం ఊరుకే పోదు.. కచ్చితంగా రైతుల ఉసురు తగులుతుంది.
తాత ముత్తాతల నుండి సాగు చేసుకుంటున్న భూములను గుంజుకుని ప్రభుత్వ భూమి, పట్టాల్లేవనే సాకుతో పరిహారం ఇవ్వకుండా నడిరోడ్డుపై బస్వాపూర్ ముంపు బాధితులను వదిలేయడం ఎంత వరకు న్యాయం? కేసీఆర్… బస్వాపూర్ ప్రాజెక్టు నిర్మాణం పేరుతో కమీషన్లు దొబ్బినవ్ కదా… అందులోని కొంత సొమ్మును బాధితులను ఇచ్చి ఆదుకోవచ్చు కదా… రైతులు బాగుపడతరు కదా?

30 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును 1.2 లక్షల కోట్లకు పెంచి నిర్మించినవ్.. ఇయాళ ఆ ప్రాజెక్టును నిండా ముంచినవ్.. దానివల్ల మా ఊర్లు ఎప్పుడు మునుగుతయోననే భయం ప్రజలకు పట్టుకుంది. ప్రజలారా… మీరెవరూ భయపడకండి. మీకు అండగా మేమున్నం. పేదల కోసం బీజేపీ పోరాడుతోంది. బీజేపీ అంటేనే కేసీఆర్ కు వణుకుపుడుతోంది. కేసీఆర్, ఆయన కుటుంబం బాగుంటే చాలట… జనం ఎటుపోయినా ఆయనకు రంది లేదు.. చివరకు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదు. పేదలు బాగుంటే చూసి ఓర్వలేరు.

నరేంద్రమోదీ పేద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. నిలువ నీడలేని పేదలకు ఇండ్లు కట్టిస్తున్నడు. దేశవ్యాప్తంగా లక్షల కొద్ది ఇండ్లు కట్టిస్తున్నవ్. ఆ ఇండ్లను తెలంగాణలోనూ కట్టించి ఇయ్యాలని మొత్తుకుంటున్నవ్. మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధులను దారి మళ్లించిన కేసీఆర్… డబుల్ బెడ్రూం సాకుతో ఇప్పటి వరకు పేదలకు ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా ఇయ్యలేదు.

రేషన్ బియ్యం ఇచ్చేది కేంద్రమే… కానీ రేషన్ షాపుల్లో కేసీఆర్ ఫోటో పెట్టుకుని తానే బియ్యం ఇస్తున్నట్లు ఫోజు కొడుతున్నడు. పేదలకు అందించే రేషన్ బియ్యానికి సంబంధించి ఒక్కో కిలో బియ్యానికి కేంద్రం 29 రూపాయలు ఇస్తుంటే.. కేసీఆర్ ఒక్క రూపాయి మాత్రమే భరిస్తుండు? దీనిని బట్టి మీరే చెప్పండి… రేషన్ బియ్యం ఇస్తున్నదెవరో?

కరోనా వస్తే ఆదుకున్నది ఎవరు? ఉచితంగా వ్యాక్సిన్ అందించింది ఎవరు? ఫాంహౌజ్ కే పరిమితమైంది ఎవరు?కాంట్రాక్టర్లతో కేసీఆర్ కుమ్మక్కైండు. ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దొబ్బుతున్నడు.ఈరోజు గ్రామాల్లో అభివ్రుద్ది పనులకు నిధులిస్తోంది మోదీ ప్రభుత్వమే.బడి లేకున్నా.. గుడి లేకున్నా ఊర్లున్నయ్.. కానీ కేసీఆర్ షాపు(బెల్టు షాపు)ల్లేని ఊరే తెలంగాణలో లేదు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ’ప్రతి ఊర్లో బెల్టు షాపులు పెడతా… ఒక్క క్వార్టర్ కొంటే పల్లీల ప్యాకెట్ ఫ్రీ… ఫుల్ బాటిల్ కొంటే కిలో మటన్ ఫ్రీ.. రెండు బాటిళ్లు కొంటే చికెన్, మటన్ ఫ్రీ అంటడేమో…

ఈ భువనగిరి నియోజకవర్గానికి గత 8 ఏళ్లలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధులెన్నో తెలుసా… అక్షరాల 218 కోట్ల 32 లక్షల రూపాయలు. ఇగ కార్యక్రమల వారీగా చూస్తే…. ఉపాధి కింద రూ.80 కోట్ల 10 లక్షలు, మెటీరియల్ ఖర్చు కింద 54 కోట్ల 75 లక్షలు, మొక్కల పెంపకం కోసం 14 కోట్ల 31 లక్షలు, మరుగుదొడ్ల కోసం 4 కోట్ల 58 లక్షలు, 14వ ఆర్దిక సంఘం 43 కోట్ల 69 లక్షలు, 15వ ఆర్దిక సంఘం నిధుల కింద 15 కోట్ల 61 లక్షలు, ట్రై సైకిళ్ల కోసం 2 కోట్ల 83 లక్షల 2 వేలు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా లబ్ది పొందుతున్న కుటుంబాలు 27,574. ఈ కుటుంబాలకు ఇచ్చిన నిధులు 5 కోట్ల 15 లక్షలు. ప్రధానమంత్రి క్రిషి సంచాయ్ ద్వారా ఇచ్చిన 3 కోట్ల 43 లక్షలు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా 15 కోట్ల 51 లక్షలు ఇచ్చినం.

మోదీ ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణానికి, మొక్కల పెంపకానికి, పల్లె ప్రక్రుతి వనాలకు నిధులిస్తే… ఆ పనులు చేసిన వారికి మాత్రం బిల్లులు మంజూరు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం స్థానిక సర్పంచులను అరిగోస పెడుతున్నరు.సర్పంచులు, ఎంపీటీసీలంతా కేసీఆర్ పాలనలో విసిగిపోయిండ్రు. వాళ్లంతా ఒక్కటై కేసీఆర్ పాలనకు వాత పెట్టేందుకు ఎదురు చూస్తున్నరు.

మీ బాధలు వినేందుకే ఇక్కడికి వచ్చిన. మీ తరపున కొట్లాడుతున్నం. మేం ఎవరికీ భయపడం. కేసులు, జైళ్లు మాకు కొత్తకాదు… ఇప్పటికే 5 సార్లు జైలుకు పోయి వచ్చిన. అయినా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నం.ఆందోళన చేస్తున్న బీజేపోళ్లను పోలీసులతో లాఠీఛార్జ్ చేయిస్తున్నడు. పోనీ పోలీసులకైనా అలవెన్సులు, జీతాలిస్తున్నడా? అంటే.. అదీ లేదు.. చివరకు నక్సలైట్ల ప్రాంతాల్లో ఇచ్చే అలవెన్సులను కూడా కట్ చేయించిండు.. ఇగ ఉద్యోగులందరినీ రాచి రంపాన పెడుతున్నడు.

రాష్ట్రాన్ని అప్పులపాల్జేసిండు. 4 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఒక్కో తలపై లక్షా 20 వేల రూపాయల అప్పు మోపిండు.. కరెంట్ ఛార్జీలు పెంచిండు, ఆర్టీసీ ఛార్జీలు పెంచిండు.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నడు.కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులున్నయ్. బాగా సంపాదించుకున్నరు. ప్రజలు మాత్రం బికారులైనరు… అరిగోస పెడుతున్నరు.

మీ (ప్రజల) బాధలు తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చిన. మీకు భరోసా ఇచ్చేందుకు వచ్చిన. మీ సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాడతా… కేసీఆర్ ముక్కు పిండి మీకు న్యాయం జరిపించి తీరుతాం.. అప్పటిదదాకా పోరాడతాం. కేసీఆర్ పాస్ పోర్ట్ బ్రోకర్… గతంలో దుబాయ్ కి పంపిస్తానని డబ్బులు తీసుకుని ముంబయిలో వదిలేసి వచ్చిండు. అట్లాంటోడు మనకేం న్యాయం చేస్తడు?

దరువు ఎల్లన్న లాంటోడు… తెలంగాణ ఉద్యమంలో కాలుకి గజ్జెకట్టి ఊరూరా తిరిగి పాట పాడిండు. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ పాలనలో ఉస్మానియా విద్యార్థులు పడుతున్న బాధలను చూసి తట్టుకోలే మళ్లీ గజ్జె కట్టి కేసీఆర్ పై పాడుతుండు.. ఆ పాట పాడిన పాపానికే దరువు ఎల్లన్నపై కేసు పెట్టి జైలుకు పంపాలనుకున్నరు.

ప్రజలారా… కేసీఆర్ మాటలు నమ్మకండి.. ఎన్నికల్లో ఓటుకు ఐదారు వేలిచ్చి కొనుక్కుందామని చూస్తడు. ఇప్పటికే రెండుసార్లు మోసపోయినం. ఇగ నమ్మకండి. మీ బాధలు విన్నం… మీకు అండగా ఉంటాం.. న్యాయపరంగా అండగా ఉంటాం… ఎంతదాకైనా పోరాడదాం.. మీకు న్యాయం జరిగే వరకు కేసీఆర్ ను అడుగు ముందుకు వేయనీయబోం.

LEAVE A RESPONSE