– తెలంగాణకు అమరవీరులే దేవుళ్ళు. అమరుల కుటుంబాలని పరామర్శించి అమరుల ఫొటోకు దండ వేసి నివాళి అర్పిస్తే వేయి గుళ్ళు తిరిగిన పుణ్యం వస్తుంది
– ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్
* వేలాది మంది యువకుల ఆత్మ త్యాగాల తర్వాత కానీ తెలంగాణ సాకారం కాలేదు. కానీ నేడు అధికార మదంతో దున్నపోతు మీద వాన కురిసినట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అమరవీరులు కుటుంబాలకు న్యాయం చేయకపోగా వారిని అవమానించే రీతిలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గం.
* అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసేదెప్పుడు ? అమరుల కుటుంబాల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి సోయి లేదా? అమరులని అవమానించడం కేసీఆర్ సర్కార్ కి తగదు. 1560 మంది అమరులైతే కేవలం 576 మందిని గుర్తించడం అన్యాయం.
*అమరుల కుటుంబాలకు పది లక్షల రూపాయిల సాయం, కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, సాగుకు యోగ్యమైన మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇల్లు వెంటనే కేటాయించాలి.
* అమరవీరులని గౌరవించడం, వారి కుటుంబాలకు సంక్షేమం కల్పించడం సామాజిక భాద్యత. దీనికి విస్మరించడం ఘోరమైన నేరం. అమరులకు గౌరవం, వారి కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది.
”’సీఏం కేసీఆర్ పుణ్యం కోసం గుడులు గోపురాలు తిరుగుతున్నారు. మంచిదే. కానీ కేసీఆర్ తిరగాల్సిన గుడులు.. అమరవీరుల ఇల్లు” అని వ్యాఖ్యానించారు ఏఐసిసి అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్. తెలంగాణ రాష్ట్ర సాధన లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలతో కలసి గన్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమవేశంలో తెలంగాణ ఉద్యమకారులు పాశం యాదగిరి, గాదె ఇన్నయ్యతో కలసి మాట్లాడారు దాసోజు. ”తెలంగాణ ఒక్కరి పోరాటం వలన వచ్చిన రాష్ట్రం కాదు. సబ్బండ వర్గాల ప్రజల పోరాటం, వేలాది మంది యువకుల ఆత్మ త్యాగాల తర్వాత కానీ తెలంగాణ సాకారం కాలేదు. కానీ నేడు అధికార మదంతో, ఆదిపత్య అహంకారంతో దున్నపోతు మీద వాన కురిసినట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అమరవీరులు కుటుంబాలకు న్యాయం చేయకపోగా వారిని అవమానించే రీతిలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గం ” అని మండిపడ్డారు దాసోజు.
”2014 టీఆర్ఎస్ మ్యానిఫెస్టో తయారు చేసిన కమిటీలో నేనూ ఓ సభ్యుడిని. ఆనాడు ఎంతో భావోద్వేగంతో అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలని అనేక అంశాలు పొందుపరిచాం. ”అమరుల కుటుంబాలకు పది లక్షల రూపాయిల సాయం. అమరుల కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. అంతర్జాతీయ స్థాయిలో అమరుల స్మృతి చిహ్న నిర్మాణం. వ్యవసాయం ఆదారపడ్డ కుటుంబాలకు సాగు యోగ్యమైన మూడు ఎకరాల భూమి. అమరుల కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇల్లు, అమరుల కుటుంబ సంక్షేమం. ప్రసిద్ది గాంచిన నిర్మాణ స్థాయిలో హైదరాబాద్ లో అత్యంత ఎత్తైన అమరుల స్మారక స్థూప నిర్మాణం.
అదే ప్రాంతంలో అమరుల స్మృతి వనం నిర్మాణం. నిరంతరం వెలిగే త్యాగ జ్యోతి ఏర్పాటు” ఈ అంశాలు మేనిఫెస్టో లో చేర్చారు. కానీ ఎనిమిదేళ్ళు గడుస్తున్నా అమరులకు న్యాయం జరగలేదు. మ్యానిఫెస్టో లో పొందుపరిచిన ఒక్క హామీకు నెరవేర్చలేదు. నేడు టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు అనుభవిస్తున్న అధికారం, దర్పం.. అమరవీరుల త్యాగఫలం. అమరుల రక్తపు మడుగులపై టీఆర్ఎస్ నాయకులు కూర్చి వేసుకొని కూర్చున్నారనే సంగతి మర్చిపోవద్దు” అని గుర్తు చేశారు దాసోజు.
”2013 డిసెంబర్ లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం దాదాపు 900 మంది అమరవీరుల జాబితాని చిరునామాలతో సహా ముద్రించింది. పాశం యాదగిరి నేతృత్వంలో 2014 తర్వాత చనిపోయిన వారి వివరాలు సేకరిస్తే 1381 మంది అమరులైనట్లు వెల్లడైయింది. కేసీఆర్ సాక్ష్యత్ అసెంబ్లీ వేదికపై 1560మంది అమరులయ్యారని చెప్పారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కేవలం 576 మందినే మాత్రమే అమరవీరులని గుర్తించింది.
దీనిపై ప్రశ్నిస్తే.. పోలీసులు కేసు నమోదు చేయలేదని, పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదని కుంటి సాకులు చెబుతున్నారు. మనసుంటే మార్గం వుంటుంది. నాడు ఏపీ సర్కార్ లో పోలీసులు వివక్షతో వ్యవహరించి ఉండవచ్చు.. కానీ ఎనిమిదేళ్ళుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? అమరవీరుల త్యాగాలతో అధికారం చెలాయిస్తున్న కేసీఆర్ సర్కార్ సోయి లేదా.. వాళ్ళకు ఎందుకు న్యాయం చేయడం లేదు..? 1969 ఉద్యమంలో కూడా దాదాపు 350కి పై మంది అమరులయ్యారు. అనేక మంది ప్రస్తుతం నిరాశ్రయులై జీవితం గడుపుతున్నారు. వారికి న్యాయం చేసే భాద్యత ప్రభుత్వంపై లేదా ” ప్రశ్నించారు దాసోజు.
”సీఏం కేసీఆర్ పుణ్యం కోసం గుడులు గోపురాలు తిరుగుతున్నారు. మంచిదే. కానీ కేసీఆర్ తిరగాల్సిన గుడులు అమరవీరుల ఇల్లు. తెలంగాణకు అమరవీరులే దేవుళ్ళు. వాళ్ళ త్యాగాల ఫలితమే తెలంగాణ. అలాంటి అమరుల కుటుంబాలని పరామర్శించి అమరులకు దండ వేసి నివాళి అర్పిస్తే గుడికి వెళ్ళిన
పుణ్యం వస్తుంది. అమరుల కుటుంబాలని ఆడుకునే నైతిక బాధ్యత ప్రభుత్వంపై వుంది. దయచేసి మానవత్వంతో వ్యవహరించి అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలి. ‘అమరుల కుటుంబాలకు పది లక్షల రూపాయిల సాయం, కుటుంబాలలో ఒకొక్కరి ప్రభుత్వ ఉద్యోగం, సాగు యోగ్యమైన మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇల్లు, అమరుల కుటుంబ సంక్షేమం చూసే విధంగా చర్యలు చేపట్టాలి” అని కోరారు దాసోజు.
”అమరవీరుల స్థూపం నిర్మాణంలో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యేలకు ఆఫీసులు, బంగ్లాలు ఫాం హౌస్ లు వస్తాయి. కానీ అమరవీరులకు స్తూపాలు ఎందుకు నిర్మితం కావడం లేదు. ప్రతి జిల్లా హెడ్ క్యార్టర్ లో అమరవీరుల స్థూపం కడతామని చెప్పారు. కానీ ఇప్పటివరకూ దాని జాడలేదు. అమరవీరులని గౌరవించడం, వారి కుటుంబాలకు సంక్షేమం కల్పించడం సామాజిక భాద్యత. దీనికి విస్మరించడం ఘోరమైన నేరం. అమరులకు గౌరవం, వారి కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది” అని ప్రకటించారు దాసోజు.