సిటీ ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీసులు ఉండాల్సిందే

– అధికారులకు మంత్రుల ఆదేశం
– మాకు అవసరం లేదన్న మజ్లిస్ ఎమ్మెల్యేలు
– ‘సూర్య’వెబ్‌సైట్ కథనానికి స్పందన
( మార్తి సుబ్రహ్మణ్యం, హైదరాబాద్)
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం హైదరాబాద్ నగరంలోని ఎమ్మెల్యేలకు కూడా జిల్లాల మాదిరిగానే క్యాంపు ఆఫీసులు ఉండాల్సిందేనని మంత్రులు స్పష్టం చేశారు. నగరంలో కూడా ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీసులు ఉండాలన్నది కేసీఆర్ అభిమతమని చెప్పారు. అందుకు 500 గజాల స్థలాన్ని అన్వేషించే బాధ్యత కూడా అధికారులదేనని డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ ఆదేశించారు.
కాగా తెలంగాణ జిల్లాల మాదిరిగా రాజధాని నగరంలో ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీసు లేని వైనంపై ఇటీవల ‘సూర్య’వెబ్‌సైట్ లో( సిటీ ఎమ్మెల్యేల..పిటీ పిటీ ! )కథనం వెలువడిన విషయం తెలిసిందే. దానిపై స్పందించిన ప్రభుత్వం, అసెంబ్లీ కమిటీహాల్‌లో నగర ఎమ్మెల్యేలతో మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసింది.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, నగరంలో ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీసు అవసరమని స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో వాటిని గుర్తించి, అందులో 500 గజాలు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులకు కేటాయించాలని ఆదేశించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, సంబంధిత ఆర్డీఓలతో సమన్వయం చేసుకుని స్థానిక ఎమ్మెల్యేలతో కలసి స్థలాన్వేషణ చేయాలని ఆదేశించారు. రెవిన్యూ, హౌసింగ్, జీహెచ్‌ఎంసీ స్థలాలు గుర్తించాలని సూచించారు.
ఈ సందర్భంగా అధికారులు తమ వద్ద ఉన్న ఖాళీ స్థలాల వివరాలను వెల్లడించగా, కొందరు ఎమ్మెల్యేలు వాటిపై అభ్యంతరం వ్యక్తం చేయగా, మరికొందరు అవి కోర్టులో ఉన్నాయని మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. దానికి స్పందించిన మంత్రులు, కోర్టులో వివాదాలు లేనివే గుర్తించాలని ఆదేశించారు.
మా క్యాంపు ఆఫీసు చూడండి: పద్మారావు
డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు మాట్లాడుతూ బడ్జెట్ లేకపోయినా తన నియోజకవర్గ క్యాంపు ఆఫీసును కాంట్రాక్టరును ఒప్పించి నిర్మించామని వివరించారు. ఆ బిల్లు మంజూరు చేయాలని సూచించారు. అన్ని సౌకర్యాలతో గదులు ఏర్పాటుచేశామని, డివిజన్ల వారీగా గదులు ఏర్పాటుచేసి అభివృద్ధికి సంబంధించిన వివరాలు కంప్యూటరైజ్ చేస్తున్నామని వివరించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చి సందర్శిస్తే అది మిగిలిన నియోకవర్గాల క్యాంపు ఆఫీసులకు రోల్‌మోడల్‌గా ఉంటుందని సూచించారు. తన ఆఫీసుపైన సెట్విన్ ఆఫీసు ఏర్పాటుచేయాలనుకుంటున్నామని చెప్పగా, కేవలం క్యాంపు ఆఫీసులు మాత్రమే కేటాయించాలన్నది కేసీఆర్ ఉద్దేశమన్నారు. మళ్లీ తిరిగి సమావేశమయ్యేలోపు క్యాంపు ఆఫీసుల కోసం, స్థలం కేటాయించాలని మంత్రులు ఆదేశించారు. సిటీ ఎమ్మెల్యేల..పిటీ పిటీ !
మాకు అవసరం లేదు: మజ్లిస్ ఎమ్మెల్యేలు
కాగా, పాత బస్తీలో తమకు క్యాంపు కార్యాలయాలు అవసరం లేదని మజ్లిస్ ఎమ్మెల్యేలు మంత్రులు, అధికారులకు స్పష్టం చేశారు. మజ్లిస్ కార్యాలయమైన దారుసలాంలో కొన్ని దశాబ్దాల నుంచి మజ్లిస్ ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ప్రతిరోజు తప్పనిసరిగా హాజరయి, ప్రజల సమస్యలు అక్కడే పరిష్కరిస్తుంటారు. అందువల్ల తమకు ప్రత్యేకంగా క్యాంపు ఆఫీసు అవసరం లేదని మజ్లిస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేసినట్లు కనిపిస్తోంది.

Leave a Reply