Suryaa.co.in

Telangana

ఆంధ్రోళ్ల సొమ్ముతో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టారు

– బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇచ్చిన కోటి రూపాయాలతో ఆనాడు కేసీఆర్ టీఆరెస్ పార్టీ పెట్టారు
– బొజ్జల ఇచ్చిన డబ్బులతో టీఆర్ఎస్ ఫ్లేక్సీలు, సభ్యత్వ పుస్తకాలను ముద్రించారు
– చంద్రబాబు చెప్పులు మోసేందుకు కేసీఆర్ సిద్ధమైంది నిజం కాదా?
– 9 నెలలు అయినా చంద్రబాబు కేసీఆర్‌కి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు
– తుమ్మల, మండవ, బొజ్జల, వేమూరి రాధాకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇందుకు ప్రత్యక్ష సాక్షులు
– హరీష్ రావు వార్డ్ మెంబర్‌గా గెలవకముందే కాంగ్రెస్ ఆయన్ను మంత్రిని చేసింది
– స్పీకర్, మండలి చైర్మన్ల వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు
– పోచారం కొడుకులు కంకర నుంచి ఇసుక వ్యాపారం దాకా చేయని దందా లేదు
– కేసీఆర్ పుట్టిన చింతమడకలో ఇంటికి రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు
– విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి, అక్రమాలపై త్వరలోనే విద్యుత్ ఫైల్స్ విడుదల – రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు ఎందుకు ప్రకటించలేదు?
– ఆత్మగౌరవంతో ప్రజలకోసం కొట్లాడిన చరిత్ర నాది
– 24 గంటల ఉచిత విద్యుత్ పై సబ్ స్టేషన్ల దగ్గర చర్చకు సిద్ధం
– రాష్ట్రంలో వెలుగులు నింపినది నిజమైతే కేసీఆర్ గజ్వేల్ నుంచే పోటీ చేయాలి
– బీఆర్ఎస్ సిట్టింగ్ లకే సీట్లు ఇవ్వాలి
– 24 గంటల విద్యుత్ ఇచ్చిన సబ్ స్టేషన్ల పరిధిలో మేము ఓట్లు అడగం
– ఇవ్వని సబ్ స్టేషన్ల పరిధిలో బీఆర్ఎస్ ఓట్లు అడగొద్దు
– ఈ సవాల్ కు బీఆరెస్ సిద్ధమా?
– టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

“బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు తొమ్మిదేళ్లు అద్భుతంగా పాలిచాం. చెప్పిన వాటికంటే ఎక్కువ చేశామని వ్యాఖ్యానిస్తుంటారు. అదే నిజమైతే ఇప్పుడు 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వాలి. కేసీఆర్‌కి చీము నెత్తురు ఉంటే గజ్వేల్ నుంచి పోటీ చేయాలి. లేకుంటే కేసీఆర్ మాడ అని ఒప్పుకోవాలి” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులకు కౌంటరిచ్చారు. రేవంత్ రెడ్డి శనివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 80 శాతం ఎమ్మెల్యేలు ఓడిపోతారని సర్వే రిపోర్టులో తేలిందని రేవంత్ వ్యాఖ్యానించారు.

సీఎం కేసీఆర్ కూడా గజ్వేల్‌లో ఓడిపోతారని సర్వేల్లో తేలిందని రేవంత్ చెప్పుకొచ్చారు. అందుకే కేసీఆర్ పక్క నియోజకవర్గాలను వెతుక్కుంటున్నారని రేవంత్ తెలిపారు. బీఆర్ఎస్‌లో ఇప్పుడున్న సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తానని కేసీఆర్ ఎందుకు చెప్పడం లేదు..? అని రేవంత్ ప్రశ్నించారు.

ఉచిత విద్యుత్ పై బీఆర్ఎస్ నేతల అరుపుల్లో ఓటమి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రైతాంగానికి ఫ్రీ కరెంట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని అన్నారు. మంత్రి హరీశ్ రావు, శాసనమండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలపై రేవంత్ స్పందిస్తూ.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల వాదనలో పస లేదని అన్నారు.

దేశంలో ఏ పార్టీ ఆలోచన చేయక ముందే కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతులకు ఉచిత విద్యుత్ అందించిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ పై బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు చేస్తున్న రెఫరెండమ్ డిమాండ్ కు రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. “తెలంగాణ రాష్ట్రంలో 3500 సబ్ స్టేషన్లు ఉన్నాయి. మా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లాగ్‌ బుక్‌ లు చూపించి 24గంటల కరెంటు రావడం లేదని నిరూపించారు. ప్రతి సబ్ స్టేషన్ దగ్గర గ్రామ సభలు పెడదాం, రచ్చబండ నిర్వహిద్దాం. రైతులతో చర్చ పెడదాం. బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నట్లు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే ఆ సబ్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగదు.

24 గంటల కరెంట్ ఇవ్వని సబ్ స్టేషన్ పరిధిలో బీఆర్ఎస్ ఓట్లు అడగొద్దు. దీని మీరు సిద్ధమా. ఈ విషయంలో ఎక్కడికైనా రావడానికి సిద్ధం. మీరు సవాలుకు సిద్ధమైతే అలంపూర్లో సంపత్, వనపర్తిలో చిన్నారెడ్డి, కొడంగల్లో నేను, నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో మల్లు రవి వస్తారు ” అని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.

ఉచిత విద్యుత్ కు పేటెంట్ కాంగ్రెస్ కాదని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 1999లోనే వైఎస్ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నపుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ అంశాన్ని పెట్టామని గుర్తు చేశారు. 1999లో అధికారంలోకి రాలేదు కాబట్టి అప్పుడు కాంగ్రెస్ ఉచిత విద్యుత్ ఇవ్వలేకపోయాం. అప్పట్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ విద్యుత్ చార్జీలను పెంచింది. దీని మీద కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోరాడారు. ఆ ఉద్యమంలో 25 వేల మంది రైతుల మీద క్రిమినల్ కేసులు పెట్టారు. ఆ ఉద్యమం సందర్భంగానే చేపట్టిన ఛలో అసెంబ్లీ ఆందోళన సందర్భంగా జరిగిన బషీర్ బాగ్ కాల్పుల్లో ముగ్గురు రైతులు మరణించారు. చాలా మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు.

చంద్రబాబు హయాంలో కేసీఆర్ టీడీపీ హెచ్ఆర్డీ విభాగం ఛైర్మన్ గా ఉన్నారు. హెచ్ఆర్డీ పార్టీ పాలసీలను తయారు చేసే విభాగం. ఆ విభాగం రూపొందించే పాలసీలనే తర్వాత ప్రభుత్వంలో అమలు చేస్తారు. అప్పుడు పోచారం మంత్రిగా ఉన్నారు.. గుత్తా కీలక పదవిలో ఉన్నారు..వీళ్లంతా చంద్రబాబుతో కలిసి విద్యుత్ పాలసీని తయారు చేశారు. అప్పుడు అధికారాన్ని అనుభవిస్తున్న మీరు బషీర్ బాగ్ కాల్పులకు మీరు కారణం కాదా అని కాంగ్రెస్ తరపున ప్రశ్నిస్తున్నా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

28 ఆగస్టు, 2000 లో బషీర్ బాగ్ కాల్పులు జరిగాయి. ఆ సమయంలో కేసీఆర్ డిప్యూటీ స్పీకర్. 2001, ఏప్రిల్ 21న కేసీఆర్ టీడీపీకి రాజీనామా చేశారు. మంత్రి పదవి కోసం అనాడు కేసీఆర్ చంద్రబాబు చెప్పులు మోసేందుకు సిద్ధమైంది నిజం కాదా? 9 నెలలు అయినా చంద్రబాబు కేసీఆర్‌కి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. తుమ్మల, మండవ, బొజ్జల, వేమూరి రాధాకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇందుకు ప్రత్యక్ష సాక్షులు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

“బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇచ్చిన కోటి రూపాయాలతో ఆనాడు కేసీఆర్ టీఆరెస్ పార్టీ పెట్టారు. బొజ్జల ఇచ్చిన డబ్బులతో టీఆర్ఎస్ ఫ్లేక్సీలు, సభ్యత్వ పుస్తకాలను ముద్రించారు. ఆంధ్రోళ్ల సొమ్ముతో కేసీఆర్ టీఆరెస్ పార్టీ పెట్టారు. చరిత్రకు సాక్షులు ఇంకా చాలా మంది ఉన్నారు. నేను టీడీపీలో చేరింది 2007లో… బషీర్ బాగ్ కాల్పులు జరిగింది 2000లో. అనాటి కాల్పులకు నేను కారణం అవుతానని హరీష్ ఎలా మాట్లాడతారు?

ఇక హరీష్ రావు వార్డ్ మెంబర్‌గా గెలవకముందే కాంగ్రెస్ ఆయన్ను మంత్రిని చేసింది. తెలంగాణ కోసమే రాజీనామా చేశానని చెప్పుకున్న కేసీఆర్…2009లో మళ్లీ చంద్రబాబుతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు? మీరు పరాన్నజీవులు… ఒకవైపు టీడీపీ.. మరో వైపు కాంగ్రెస్ దాయాదాక్షిణ్యాలతో బతికారు. ఆ పార్టీలతో బతికి ఆ పార్టీలనే తిట్టే నీచ సంస్కృతి మీది ” అని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ 24 గంటల కరెంట్ ఇవ్వలేదు. మేము ఇచ్చిన 9 గంటల ఉచిత కరెంట్‌నే మీరు 2018 వరకు విడతల వారిగా ఇచ్చారు. బీఆర్ఎస్ 2018 మేనిఫెస్టోలో సింగరేణి బొగ్గు గనుల దగ్గర విద్యుత్ ప్లాంట్‌లు పెట్టాలని పెట్టారు. కానీ ఎలాంటి బొగ్గు గనులు లేని యాదాద్రి‌కి పవర్ ప్లాంట్ తరలించారు. అత్యంత అవినీతి పరులే కేసీఆర్ సలహాదారులుగా ఉన్నారు. నీ దగ్గర ఉన్న మంత్రులు ఏ పార్టీలో నుంచి వచ్చారు. తెలంగాణ మేధావులపై కేసులు పెట్టి వేధించిన చరిత్ర కేసీఆర్ ది. కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడు అని చెప్పడానికి హరీష్ కు సిగ్గుండాలి అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

“స్పీకర్, మండలి చైర్మన్ల వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. స్పీకర్, చైర్మన్ పదవుల్లో ఉన్న గుత్తా, పోచారం రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కానీ ప్రత్యక్ష రాజకీయల నాయకుల మాదిరిగా ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ బూట్లు నాకుతున్నారు. పోచారం కొడుకులు కంకర నుంచి ఇసుక వ్యాపారం దాకా చేయని దందా లేదు. కొడుకుల కోసమే పోచారం దిగజారి ప్రవరిస్తున్నారు. పంచాయతీకి కూడా పనికిరాని గుత్తా సుఖేందర్ రెడ్డిని రెండు సార్లు కాంగ్రెస్ ఎంపీ చేసింది.

మంత్రి పదవి మీద ఆశతో గుత్తా బీఆర్ఎస్ లో చేరిండు. ఇప్పుడు గుత్తా తన కొడుకు కోసం నల్లగొండ అసెంబ్లీ టికెట్ కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు. నల్లగొండలో గుత్తాను మా కోమటిరెడ్డి బండకేసి కొట్టిండు. పోచారం, గుత్తా ని రైతు కులం నుంచి బహిష్కరించాలి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి వారు రాజకీయాలు మాట్లాడుతున్నారు. వీరు పార్టీలకు ద్రోహం చేశారని, నమ్మిన నాయకులను మోసం చేశారని, ఇప్పుడు ప్రజలకు కూడా ద్రోహం చేస్తున్నారన్నారు. కొడుకుల కోసం ఇంతగా దిగజారుతారా? వారిని గవర్నర్ వెంటనే పదవుల నుంచి బర్తరఫ్ చేయాలి అని” రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

చత్తీస్ గఢ్ లో మిగులు విద్యుత్ ఉన్న అక్కడి 24 గంటల విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదనే బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు, రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. “కేసీఆర్ పుట్టిన చింతమడకలో ఇంటికి రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. మరీ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు ఎందుకు ప్రకటించలేదు. ఇదే విషయాన్ని కొండారెడ్డిపల్లికి ఎందుకు వర్తింపచేయలేదు. రాష్ట్రాలను బట్టి ప్రాధాన్యతలు మారుతుంటాయి” అని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు చురకలు అంటించారు. విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి, అక్రమాలపై త్వరలోనే విద్యుత్ ఫైల్స్ విడుదల చేస్తామన్నారు.

నేను 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం కొట్లాడుతున్న. టీడీపీలో చేరినప్పుడు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రతిపక్షంలోనే ఉన్నా. ఆత్మగౌరవంతో ప్రజలకోసం కొట్లాడిన చరిత్ర నాది అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE