– నీ చేష్టలతో తెలంగాణ ప్రజలు తలదించుకునే పరిస్థితి
– వైజాగ్ స్టీల్ బిడ్డింగ్ లో పాల్గొనకుండా పారిపోయిన కోతల రాయుడు కేసీఆర్
– బయ్యారం స్టీల్, నిజాం షుగర్స్, రేయాన్ ఫ్యాక్టరీ పునరుద్దరణపైనా మాట తప్పిన కేసీఆర్
– బీఆర్ఎస్ సర్కార్ మాటలన్నీ కోతలేనని తేలిపోయింది
– కాంగ్రెస్-బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే
– బీజేపీ పోరాటాలతో బీఆర్ఎస్ గుండెలు గుభేల్ మంటున్నాయ్
– ఈనెల 23న చేవెళ్ల బహిరంగ సభను సక్సెస్ తో సత్తా చాటుదాం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
– చేవెళ్ల బహిరంగ సభకు ‘‘విజయ సంకల్ప సభ’’గా నామకరణం చేసిన బండి సంజయ్
– జన సమీకరణ, సభ ఏర్పాట్లపై నేతలతో చర్చించిన బండి సంజయ్
‘‘ నిన్నటి దాకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొంటాం. వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటామని కోతలు కోసిన కేసీఆర్ ఇయాళ తోక ముడిచిండు. వైజాగ్ స్టీల్ బిడ్డింగ్ లో పాల్గొనలేదు. ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకే అర్ధం కావడం లేదు. చెప్పిన మాట ఒక్కటీ నిలబెట్టుకోని కోతల రాయుడు కేసీఆర్. పంజాబ్ పోయి ఇచ్చిన చెక్కులన్నీ బౌన్స్ చేసిండు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రేయాన్ ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్దరిస్తానని ఇచ్చిన హామీలన్నీ కోతలేనని తేలిపోయింది. సొంత రాష్టంలో ఇచ్చిన హామీలనే అమలు చేయనోడు వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటానంటే నమ్మేదెవరు? ప్రచారం కోసం కేసీఆర్ కోతలే తప్ప ఆయన చేసిందేమీ లేదు. కేసీఆర్ ను చూసి దేశమంతా నవ్వుకుంటోంది. ఇట్లాంటోడు సీఎంగా కొనసాగుతున్నందుకు తెలంగాణ ప్రజలు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.
ఈనెల 23న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్న నేపథ్యంలో చేవెళ్లలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లపై స్థానిక పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బండి సంజయ్ తోపాటు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ తోపాటు మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లుతోపాటు చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డితోపాటు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వివిధ జిల్లాల అధ్యక్షులు, కన్వీనర్లు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చేవెళ్ల బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణపై చర్చించారు. చేవెళ్ల సభ సందర్భంగా సంబంధిత పార్లమెంట్ నియోజకవర్గ పరిధి నుండే జన సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా జిల్లాల వారీగా జన సమీకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…..
చేవెళ్ల నియోజకవర్గంలోని నాయకులు దమ్మున్న నాయకులు, కార్యకర్తలు. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లను బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయం. తెలంగాణలో బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కేసీఆర్ సర్కార్ ను బొంద పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందరం కలిసి కొట్లాడి కేసీఆర్ గడీలు బద్దలు కొడదాం. రామరాజ్యాన్ని స్థాపిద్దాం. నిన్నటి దాకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొంటాం. వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటామని కోతలు కోసిన కేసీఆర్ ఇయాళ తోక ముడిచారు. వైజాగ్ స్టీల్ బిడ్డింగ్ లో పాల్గొనలేదు. కేసీఆర్ ను చూసి దేశ ప్రజలంతా నవ్వుకుంటున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతారో ఆయనకే అర్ధం కావడం లేదు. చెప్పిన మాట ఒక్కటీ నిలబెట్టుకోడు. పంజాబ్ పోయి ఇచ్చిన చెక్కులన్నీ బౌన్స్ చేసిండు.
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రేయాన్ ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్దరిస్తానని ఇచ్చిన హామీలన్ని అమలు చేయనోడు వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటానంటే నమ్మేదెవరు? ప్రచారం కోసం కేసీఆర్ కోతలే తప్ప ఆయన చేసిందేమీ లేదు. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ కేసులో ఐటీ శాఖ విఫలమైంది. నాలాలో పడి పసిపిల్లలు చనిపోయారు దానికి మున్సిపల్ శాఖ వైఫల్యమే. రాజీనామా చేయమంటే కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు రాజీనామా చేయకుండా ప్రజలను దారి మళ్లిస్తున్నరు. మరి ఈటల రాజేందర్ ఏం తప్పు చేశారని మంత్రి పదవి నుండి తొలగించారు. ప్రశ్నిస్తే తట్టుకోలేని వ్యక్తి కేసీఆర్. లిక్కర్ కేసు, పేపర్ లీకేజీ విషయంలో కేసీఆర్ బిడ్డ, కొడుకు పాత్ర బయటపడటంతో దారి మళ్లించేందుకు టెన్త్ పేపర్ లీకేజీ కుట్ర కేసు నాపై నమోదు చేసి నన్ను జైలుకు పంపారు. లిక్కర్, లీకు వీరులు కేసీఆర్ కుటుంబమే. దోచుకోవడంలో వాళ్లను మించినోళ్లు లేరు.
తెలంగాణ ప్రజలంతా పిచ్చోళ్లరనే భావనలో కేసీఆర్ ఉన్నరు. తాను ఏం చెప్పినా, చేసినా నమ్ముతారనే అహంకారంతో విర్రవీగుతున్నరు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, మజ్లిస్, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసేందుకు కేసీఆర్ సిద్ధమైండు. కాంగ్రెస్-బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నయని ఆ పార్టీ నేతలే బహిరంగ ప్రకటనలు చేశారు.. కేసీఆర్ ను ఎదిరించే పార్టీ బీజేపీ మాత్రమే. ప్రజాసమస్యలపై పోరాడుతున్న పార్టీ బీజేపీయే. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై నిరుద్యోగుల తరపున ఉద్యమిస్తున్నాం. వరంగల్ లో జరిగిన నిరుద్యోగ మార్చ్ కు వేలాది మంది తరలిరావడంతో బీఆర్ఎస్ నేతల గుండెలు గుభేలుమంటున్నాయి. ఈ నేపథ్యలో చేవెళ్లేలో బహిరంగ సభ నిర్వహిస్తన్నాం. దీనికి విజయ సంకల్ప సభ అని నామకరణం చేస్తున్నాం. విజయానికి సంకేతంగా చేవెళ్ల బహిరంగ సభను నిర్వహించి విజయవంతం చేద్దాం. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోనే పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి ఈ ప్రాంతంలో బీజేపీ సత్తాను చాటుదాం. అందులో భాగంగా చేవెళ్ల బహిరంగ సభపై మీడియా, సోషల్ మీడియా లో విస్త్రతంగా ప్రచారం నిర్వహించండి. ఊరూరా ఈ అంశంపై ప్రచారం చేయండి.