– నిత్యం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించే సీఎస్ సుప్రీం కోర్టు ఆదేశాలను సాకుగా చూపడం సిగ్గు చేటు
– శాంతి భద్రతల పేరుతో గణేష్ నిమజ్జనాన్ని అడ్డుకోవాలన్నదే కేసీఆర్ కుట్ర
– రంజాన్ ఇతర పండుగలకు లేని ఆంక్షలు హిందూ పండుగలకు ఎందుకు?
– టీచర్స్ డే రోజు ఉపాధ్యాయుల అరెస్ట్ దారుణం
– తక్షణమే కేసీఆర్ ఉపాధ్యాయ లోకానికి క్షమాపణ చెప్పాలి
– సీఎంను తొలగిస్తేనే హోంగార్డులు సహా ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
వినాయక నిమజ్జనాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు స్రుష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి నిమజ్జనానికి ఆటంకాలు స్రుష్టించడం సిగ్గు చేటన్నారు. వెంటనే ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని, లేనిపక్షంలో ప్రగతి భవన్ వేదికగా గణేష్ నిమజ్జనం నిర్వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
వినాయక నిమజ్జనానికి ఎదురవుతున్న ఆటంకాలు, ఉపాధ్యాయ దినోత్సవం రోజున టీచర్ల అరెస్ట్, హోంగార్డుల సమస్యలపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు విలేకరులు అడిగిన ప్రశ్నలకు బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ సీఎం కేసీఆర్ తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రతి ఏటా వినాయక నిమజ్జన ఉత్సవాలు టెన్షన్ వాతావరణంలో జరుపుకునే దుస్థితి టీఆర్ఎస్ పాలనలో ఏర్పడింది. పర్యావరణం ఆటంకాలు, కెమికల్ వాడొద్దనే పేరుతో వినాయక నిమజ్జన ఉత్సవాలు జరగకుండా ఆటంకం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది.
వినాయక ఉత్సవాలు జరుపుకునేందుకు ఏటా రెవిన్యూ, పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటీ శాఖల అనుమతులు తీసుకోవాల్సిందే. అన్ని అనుమతులు తీసుకున్న తరువాత కూడా ప్రభుత్వం గణేష్ నిమజ్జనానికి ఆటంకాలు స్రుష్టిస్తోంది. ఏటా గణేష్ మండపాల సంఖ్యను తగ్గించేందుకు కుట్ర చేస్తోంది. హిందువుల పండుగలంటేనే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశంగా మారుస్తున్నారు.
వినాయక ఉత్సవాలు ప్రారంభమై మూడు రోజులు దాటినా ఇప్పటి వరకు నిమజ్జనం కోసం కనీస చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇదేమని ప్రశ్నిస్తే… కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమారే నిత్యం కోర్టు ఉత్తర్వులను ధిక్కరించే వ్యక్తి. ఆయన సుప్రీంకోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి అడ్డుకోవాలనుకోవడం సిగ్గు చేటు.
కోవిడ్ తీవ్రంగా ప్రబలిన సమయంలోనూ పాతబస్తీలో రంజాన్ సందర్భంగా ర్యాలీలు చేశారు. కోవిడ్ సమయంలో బాదం, పిస్తాలు పంచినా మేమేనాడు అడ్డుకోలేదు. కానీ గాంధీ ఆసుపత్రిలో కరోనాతో అల్లాడుతున్న వారిని మాత్రం కనీసం పట్టించుకోలేదు. గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నదే మా అభిమతం. భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయినా ప్రభుత్వం నిబంధనల పేరుతో అడ్డుకోవాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. వినాయక నిమజ్జనానికి ప్రగతి భవన్ ను వేదికగా మారుస్తాం. ప్రజల సౌలభ్యం మేరకు ఏర్పాట్లు చేయాలే తప్ప ప్రభుత్వానికి ఇష్టమైన చోట నిమజ్జన ఏర్పాట్లు చేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు.
కేసీఆర్ భయపడితే భయపడేది హిందూ సమాజం కాదు. శాంతిభద్రతల సమస్య స్రుష్టించి ఒక వర్గం ఓట్లు సంపాదించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నడు. కేసీఆర్ కు చేతగాకపోతే తప్పుకోవాలి. ట్యాంక్ బండ్ వద్ద ఏ విధంగా నిమజ్జనం చేసుకోవాలో మాకు తెలుసు. గణేష్ ఉత్సవాల సమయంలో లౌడ్ స్పీకర్లు వాడొద్దని చెబుతున్న ప్రభుత్వానికి దమ్ముంటే… ఎవరు లౌడ్ స్పీకర్లు ఎక్కువగా ఉపయోగటిస్తున్నారనే అంశంపై చర్చించేందుకు సిద్ధం కావాలి.
ఉపాధ్యాయ దినోత్సవం రోజున కేసీఆర్ ప్రభుత్వం 13 జిల్లాల ఉపాధ్యాయులను అరెస్టు చేయడం దారుణం. 317 జీవో విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను టీచర్స్ డే రోజైనా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్తే ప్రయోజనం ఉంటుందేమోనని భావించి వందలాది మంది టీచర్లను అరెస్ట్ చేయడం సిగ్గు చేటు.
టీచర్లను గౌరవించాలనే సంస్కారం సీఎంకు లేదు. ఇప్పటికైనా అరెస్ట్ చేసిన ఉపాధ్యాయులను తక్షణమే విడుదల చేయాలి. టీచర్లకు బేషరతుగా సీఎం కమాపణలు చెప్పాలి.
హోంగార్డులకు అండగా ఉంటా :
బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో తొలగించబడ్డ హోంగార్డులు భారీ సంఖ్యలో వచ్చి హైకోర్టు తమకు అనుకూలంగా ఆదేశాలిచ్చినా కేసీఆర్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని పేర్కొంటూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ ను సీఎం పదవి నుండి తొలగిస్తేనే హోంగార్డులతోపాటు ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. హోంగార్డుల సమస్యల పరిష్కారానికి క్రుషి చేస్తానని… తొలగించబడ్డ హోంగార్డులను మళ్లీ విధుల్లోకి తీసుకునే అంశాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.