-ఒకరిపై మరో ఇద్దరిని రెచ్చగొట్టే రాజకీయ వ్యూహం
-వికేంద్రీకరణ సభలు, మంత్రుల పరుష పదజాలాలు, ఫ్లెక్సీల ఏర్పాటు వ్యూహంలో భాగం
-రాజధాని రైతులు శాంతియుతంగానే అరసవల్లి చేరాలి
-అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య
తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రులను లక్ష తిట్లు తిట్టి, తద్వారా తెలంగాణ ప్రజల్లో విభజన భావోద్వేగాలు రేపిన కేసిఆర్ ఫార్ములాను వైసిపి నాయకులు తు.చ. తప్పక పాటిస్తున్నారని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకరిపై మరో ఇద్దరిని రెచ్చగొట్టే ప్రభుత్వ రాజకీయ వ్యూహంగా అభివర్ణించారు.అరసవల్లి పాదయాత్రకు భయపడి వికేంద్రీకరణ సభలు, మంత్రుల రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్లెక్సీలు కట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పారు.
అమరావతి నిర్మాణం జరిగితే మిగిలిన రెండు ప్రాంతాల ప్రజలకు మనుగడ ఉండదని, లక్షల కోట్లు అమరావతిలో పెట్టాల్సి వస్తుందనే పూర్తి అబద్దాలను ప్రజల్లో ప్రచారం చేయటం రాజధాని పై, ఒక ప్రాంతంపై సిఎంకు ఉన్న కక్షకు నిదర్శనంగా పేర్కొన్నారు. దసరా పండుగ రోజు కూడా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు పెడతాను అంటే నమ్మి మోసపోవటానికి ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. మరో కొద్ది రోజుల్లో పాదయాత్ర పై అలజడి, అల్లర్లు ప్రభుత్వ మే సృష్టించి, న్యాయస్థానంలో పాదయత్ర అనుమతి రద్దు పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు, ఈ మేరకు తన వద్ద పూర్తి సమాచారం ఉన్నట్లు తెలిపారు.
పాదయాత్రను ఒక పార్టీ రాజకీయ యాత్రగా ప్రజలకు చెప్పే ప్రయత్నం విస్తృతంగా చేస్తుందని అన్నారు.రాజధాని ఉద్యమాన్ని ఆది నుంచి శాంతియుతంగా, గాంధేయ మార్గంలో నిర్వహిస్తున్న రాజధాని మహిళలు అరసవల్లి వరకు పాదయాత్రను శాంతియుతంగా కొనసాగించాలని, రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని హితవు పలికారు. ప్రతిరోజు పాదయాత్రను సమీక్షించుకొని, తగు జాగ్రత్తలు, సూచనలు ఇవ్వాలని పరిరక్షణ సమితి నాయకులకు బాలకోటయ్య సూచించారు.