– తెలంగాణ అవతరణ దినోత్సవానికి కేసీఆర్ డుమ్మా
– కేసీఆర్‌కు ప్రత్యేక స్థానం కేటాయించిన రేవంత్ సర్కార్
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘అత్తా.. నవ్వు వచ్చినా రాకపోయినా మన కంపెనీలో నీ వాటా ఒక పావలా తీసి పక్కనపెడుతున్నాం. నీ కోసం సీటు ఉంచుతున్నాం. ఇప్పటికీ మేం తింటున్నప్పుడు ఒక కంచం, ఒక గది అలాగే ఉంచేశాం అత్తా. వీలైతే క్షమించు. లేకపోతే శిక్షించు. కానీ మేము ఉన్నామని గుర్తించు. చిన్నప్పుడు అమ్మ ఎందుకులేదో తెలీదు. నువ్వెందుకు రావో అర్ధం కాదు’’
– ఖాళీగా ఉన్న సోఫాపై.. ఒక డిస్‌ప్లే పేపర్ మీద ఉన్న ఫొటో చూస్తే, ‘అత్తారింటికి దారేది’ సినిమాలో, పవన్‌కల్యాణ్ రైల్వే స్టేషన్ డైలాగు గుర్తుకొస్తుంది కదా?
తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు అంగరంగ వైభవంగా నిర్వహించింది. కవి అందెశ్రీ రచించిన ‘జయహే జయహే తెలంగాణ’ పాటకు కొత్త సొబగులద్దింది. అవతరణ దినోత్సవానికి ప్రముఖులంతా హాజరయ్యారు. ఆ సందర్భంగా వారికోసం రేవంత్ సర్కారు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా రేవంత్.. తన రాజకీయ ప్రతర్థి అయినప్పటికీ, మాజీ సీఎం, శాసనసభలో విపక్షనేత కేసీఆర్‌కు ప్రత్యేక దూత ద్వారా ఆహ్వానం పంపింది. అవతరణ దినోత్సవానికి హాజరయ్యే కేసీఆర్‌కు, ఒక ప్రత్యేక సీటు కేటాయించింది. ఆమేరకు ఆయన పేరు-హోదా సూచిస్తూ ఒక కాగితం కూడా అంటించింది.
కానీ కేసీఆర్ తెలంగాణ అవతరణ దినోత్సవానికి డుమ్మాకొట్టారు. ‘మీ వ్యవహారశైలి అవమానకరంగా ఉంద’ంటూ, కేసీఆర్ ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. అయితే సోఫాపై కేసీఆర్‌కు స్థానం కేటాయించారు కాబట్టి.. రేవంత్‌రెడ్డికి అతిథుల ఆహ్వానంపై చిత్తశుద్ధి ఉన్నట్లే కనిపించింది. ఒకవేళ కేసీఆర్‌ను అవమానించే ఆలోచన ఉంటే, ఆయన పేరు రాసి సీటు కేటాయించరు కదా అన్నది కాంగ్రెస్ నేతల లాజిక్. తాను తప్ప మిగిలినవారెవరూ తెలంగాణను పాలించలేరు. తన స్థానంలో మరొకరు ఉంటే చూడలేకనే కేసీఆర్ తెలంగాణ అవతరణ దినోత్సవానికి ముఖం చాటేశారన్నది కాంగ్రెస్ నేతల వ్యాఖ్య.