– కృష్ణలంకలో పర్యటించిన మంత్రి కొలుసు పార్థసారథి
విజయవాడ: మాకేం కాదు.. ప్రస్తుతం మమ్మల్ని బాగా చూసుకునే ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారు.. అంటూ మేము ఎక్కడికి వెళ్లినా ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.. ఆ విశ్వాసమే, ఆ నమ్మకమే సహాయక చర్యలను మరింత ముమ్మరంగా చేపట్టేందుకు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తోంది అని గృహ నిర్మాణం; సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
మంత్రి సోమవారం విజయవాడ, కృష్ణలంకలోని 21వార్డు ఆర్చ్ వీధి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ చర్యలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి సహాయం అందించాలనే కృత నిశ్చయంతో ఉందని.. ఈ రోజు నుంచి నష్ట అంచనాలను రూపొందించేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు.
ఈ నివేదిక ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చూస్తుందని.. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ఇళ్లకు, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు వాటిల్లిన నష్టాలను ప్రత్యేక యాప్ లో నమోదు చేసి, సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. మీరు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు కృషిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలు కూడా ప్రభుత్వ సూచనలను తూచా తప్పకుండా పాటించాలని.. అంటురోగాలు వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం అప్రమత్తం చేస్తున్నందున ఆ సూచనలను పాటించాలని కోరారు.
ఓ గొప్ప యజ్ఞంలా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయని వదంతులను నమ్మవద్దని ఈ సందర్భంగా మంత్రి కోరారు. ప్రతి చిన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటోందని.. ఎన్ని విధాలుగా సహాయపడాలో అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.