– శాసన సభా పక్ష నేతగా అతిశీ
ఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. కాబోయే ముఖ్యమంత్రి అతిశీ, ఇతర కేబినెట్ మంత్రులతో కలిసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆయన తన రాజీనామా పత్రాన్ని అందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నూతన శాసన సభా పక్ష నేతగా అతిశీ ఎంపికైనట్లు తెలిపారు. మరో వారం రోజుల్లో ఢిల్లీ నూతన సీఎంగా అతిశీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నిజాయితీ నిరూపించుకోవాలనే ఉద్దేశంతోనే: గోపాల్ రాయ్
ఢిల్లీ ప్రయోజనాల దృష్ట్యా జైల్లో ఉన్నప్పుడు రాజీనామా చేయవద్దని కేజ్రీవాల్ భావించారని, అందుకే ఆయన బయటకు వచ్చాక రాజీనామా చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. జైలు నుంచి బయటకు వచ్చాక ఢిల్లీ ప్రజల ముందు తన నిజాయితీ నిరూపించుకోవాలనే ఉద్దేశంతో రాజీనామా చేసినట్లు తెలిపారు. కేజ్రీవాల్ ప్రజాకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారన్నారు. ప్రజలు మరోసారి సీఎంగా ఎన్నుకునే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగబోరన్నారు.