Suryaa.co.in

Editorial

సిగ్గు పడదాం..రండి!

– పట్టాలపై ‘అగ్ని’పథ్‌ ఎవరి పాపం?
– నిఘా నిద్దరోతోందా?
– ఖండించడానికీ నోరు రాని పార్టీలు
– ఖైరతాబాద్‌ చౌరస్తా విధ్వంస వైఫల్యం ఎవరిది?
– సిగ్గుమాలినతనంపై చర్యలుంటాయా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాల్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
‘గాయం’ సినిమాలో దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాట, రెండురోజుమూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన రెండు ఘటనలు గుర్తుతెచ్చాయి. నిజమే. జనాలకు సిగ్గులేదు. వారిని నడిపించే నాయకమ్మన్యులకూ ఎగ్గులేదనిపించింది.చౌరస్తా. నడినెత్తిన సూర్యుడు తాండవిస్తున్నాడు. ఉన్నట్లుండి కాంగ్రెస్‌ నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లే ప్రయత్నంలో, చౌరస్తాలో ధర్నాకు దిగారు. మరికొందరు బస్సులెక్కారు. ఈలోగా ఒక కాంగ్రెస్‌ భక్త కార్యకర్త, ఎవరి ద్విచక్రవాహనానికో నిప్పు పెట్టాడు. మరికొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు అత్యంత క్రమశిక్షణతో, బస్సు అద్దాలు పగలకొట్టే మహత్కార్యంలో బిజీ అయ్యారు. ఈ వీరోచిత ఘట్టాలతో ట్యాంక్‌బండ్‌ నుంచి పంజగుట్టవరకూ ట్రాఫిక్‌ స్తంభించింది.

ఆ ట్రాఫిక్‌లో జనం గంటల పాటు సామూహికంగా చిక్కుకున్నారు. అందులో రోగులు, వృద్ధులు, వికలాంగులు, అంబులెన్సులు చిక్కుకుపోయాయి. కొన్ని గంటల పాటు జరిగిన ఈ సహన హననం, ఎప్పటికోగానీ క్లియర్‌ కాలేదు. అది కూడా రేవంత్‌రెడ్డి, రేణుకాచౌదరి అండ్‌ అదర్స్‌ రంగప్రవేశం చేసిన తర్వాత! ఈ హింసధ్వనికి బలయిన వారంతా, తమను ఇబ్బందిపెట్టిన కాంగ్రెస్‌ను మనసారా దీవించే ఉంటారనుకోండి. అది వేరే విషయం!

చలో రాజభవన్‌కు కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన విషయం పోలీసులకు తెలుసు. మరి అలాంటప్పుడు పోలీసులు ఎప్పటిమాదిరిగానే అగ్రనేతలను ఎందుకు హౌస్‌ అరెస్టు చేయలేదు? అసలు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కను ఉత్తిపుణ్యానికి ఎన్ని డజన్ల సార్లు గృహనిర్బంధం చేయలేదు? మరిప్పుడు ఆ పని ఎందుకు చేయలేకపోయారు? ఆమేరకు వారికి అడ్డుపడిందెరు? అసలు.. ఖైరతాబాద్‌ చౌరస్తా వద్ద జరగబోయే ఉన్మాద పరిస్థితిని నిఘా వర్గాలు ముందుగా ఎందుకు ఊహించకపోయాయి? అదే కదా వారి ఉద్యోగం? అందుకోసమే కదా జీతాలు ఇస్తున్నది? ఇదంతా నిఘా వైఫల్యానికి నిలువెత్తు వైఫల్యమే కదా?

అసలు ఇటీవలి కాలంలో హైదరాబాద్‌ నగరంలో, శరపరంపరగా జరుగుతున్న అరాచక ఘటనల్లో పోలీసులది ప్రేక్షకపాత్రనే కదా అన్నది బుద్ధిజీవుల విమర్శ. ఇంతకూ వీరి ఆందోళన ఎందుకంటే.. కాంగ్రెస్‌ యువరాజు, నీతి- నిజాయతీకి నిలువుటద్దమైన రాహుల్‌గాంధీని ఈడీ విచారించినందుకట! అందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రజలు వేసిన శిక్ష ఇది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు తన రాజకీయ ప్రత్యర్ధులపై ఈడీ,సీబీఐని ఉసిగొల్పితే అది దేశ ఆర్ధిక ప్రయోజనాల కోసం. ఇప్పుడు అదే పని బీజేపీ సర్కారు చేస్తుంటే దానిని ఖండిస్తూ, ధర్నాలతో జనాలను ఇలా గంటలపాటు ‘రోడ్డు’ పాలు చేయడం!

సీన్‌ కట్‌చేస్తే..
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ‘కాబోయిన’ సైనికులు పదిగంటలపాటు నిర్నిరోధంగా సాగించిన దేశభక్త రౌద్రఘట్టం దేశాన్ని తలెత్తుకుని చేసేదే. పదిగంటల పాటు నాన్‌స్టాప్‌గా సైనిక శిక్షణ తీసుకున్న చిరంజీవులు, ‘అగ్నిపథ్‌’కు పెట్టిన అగ్గిమంటలు చూసి దేశభక్తుల నరాలు నిక్కబొడుచుకుని, చాతీ ఉప్పొంగింది. కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ స్కీముతో తమ భవిష్యత్తు కాలిపోతుంది కాబట్టి.. ఆ స్కీమును రద్దు చేయాలంటూ సైనిక శిక్షణ తీసుకున్న దేశభక్తులంతా కలసి, ఎక్కడెక్కడివారో వాట్సాప్‌లో ముచ్చటించుకుని కులాసాగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు ఎవరి పద్ధతుల్లో వారు తరలివచ్చి, బోగీలు కాల్చే శ్రమదానం పనిలోదిగారు. దానికి ఆపరేషన్‌ అగ్ని అని ముద్దు పేరొకటి. ఇదంతా ఏదో సినిమాలో చూసినట్లున్నా, అచ్చంగా దేశభక్తులు అలాగే కానిచ్చారు.

వందల మంది పట్టాల మధ్య నిలబడి, పోలీసులపై రాళ్లు వేసే పద్ధతి.. బహుశా కశ్మీర్‌, యుపీ, బీహార్‌ నుంచి మన దేశభక్త చిరంజీవులు అరువు తెచ్చుకున్నట్లున్నారు. కేంద్రం తమ మాట వినాలన్న హెచ్చరిక సంకేతం ఇచ్చేందుకు, సైనిక శిక్షణ తీసుకున్న దేశభక్తులు రైలు బోగీలకు అగ్గిపెట్టారు. దీనికోసం కూడా వారంతా సైనిక శిక్షణ మాదిరిగా ఎక్కడైనా శిక్షణ తీసుకున్నారేమో తెలియదు! ఇంకో విచిత్రమేమిటంటే.. దేశ సరిహద్దుల్లో కావలి కాయాల్సిన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఈ చిరంజీవులు, రైల్వేస్టేషన్‌లోని షాపులను లూటీ చేయడం, చివరాఖరకు చేపలు-గుడ్లను కూడా ఎత్తుకెళ్లడం చూస్తే.. అసలు ఆందోళనలో పాల్గొన దెవరు? ఈ లూటీల లాంటి సిగ్గుమాలిన పనులేంటి? ఇలాంటి వారిని సైన్యంలో తీసుకుంటారా? అన్న సందేహం మెడపై తల ఉన్న ఎవరికయినా రాక తప్పదు.

రైల్వేకి అగ్గి పెట్టిన ఈ అరాచక ఘటనలో.. సైనికుడు కావాలనుకున్న ఓ యువకుడు, పోలీసు తూటాలకు తలవాల్చటం బాధాకరం. మరి ఆ యువకుడి మరణానికి ప్రత్యక్ష కారకులు పోలీసులయితే, పరోక్ష కారకులు ఎవరు? వారి ఆనుపానులు తెలుసుకోకుండా, వారి ప్లానేమిటో కనిపెట్టకుండా, అంతా కట్టకట్టుకుని సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చేంతవరకూ బెల్లంకొట్టిన రాయిలా ఉండిపోయిన నిఘా విభాగానిదా? పోనీ రాత్రంతా రైల్వేస్టేషనల్‌లో నిద్రించిన వైనమయినా నిఘా వీరులు కనిపెట్టారా అంటే అదీ లేదు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లోపల జరిగిన అనాగరిక, పైశాచిక ఘటనతో తెలంగాణ పోలీసులకు సాంకేతికంగా సంబంధం లేకపోవచ్చు. కానీ వారంతా గుంపులుగా అక్కడికి చేరతారన్న వాసన ముందస్తుగా పసిగట్టి, బందోబస్తు చేయాల్సింది పోలీసులే కదా? అదీకాకపోతే.. దేశభక్త ఆందోళనకారులకు శిక్షణ ఇచ్చి, వారిని హింసకు పురిగొల్పిన సైనిక అకాడెమీలదా? అన్నది బుద్ధిజీవుల ప్రశ్న.

మొన్న ఖైరతాబాద్‌.. నిన్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళన మొత్తం కేంద్రానికి సంబంధించినవే. రాహుల్‌గాంధీని ఈడీ వేధిస్తోందంటూ కాంగ్రెస్‌ నిర్వహించిన ధర్నాను, మునుపటి మాదిరిగానే ముందుస్తుగా నీరుకార్చడం పోలీసులకు పెద్ద పనికాదు. కానీ ఆ పని ఎందుకుచేయలేదన్నది ఒక అనుమానం. కాంగ్రెస్‌ ఆందోళన ఎలాగూ కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగానే కాబట్టి.. తనకూ రాజకీయ శత్రువయిన బీజేపీని సరైన సమయంలో భ్రష్టుపట్టించేందుదుకే, రాష్ట్ర ప్రభుత్వం ఖైరతాబాద్‌లో కాంగ్రెస్‌ను అలా వదిలేసిందా? అన్నది ఇప్పుడు రాజకీయవర్గాల్లో మొదలైన చర్చ.
ఎప్పుడూ రేవంత్‌రెడ్డిని హౌస్‌ అరెస్టు చేసే పోలీసులు, మొన్న ఎందుకు ఆ పని చేయలేదన్నది కమల దళపతి బండి సంజయ్‌ వ్యక్తం చేసిన మరో అనుమానం.

ఇక రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళన కూడా బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగానే కాబట్టి, ‘అంతా మనమంచికే’ అనే ముందుచూపుతో రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించిందా? స్టేషన్‌లో జరగనున్న అరాచకాన్ని పోలీసులు ఎందుకు కనిపెట్టలేదు? నిఘా నిద్రపోతోందా అన్నది సంజయ్‌ సంధించిన మరో ప్రశ్న. ఈ అగ్నికీలల వెనుక టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌- మజ్లిస్‌ హస్తం ఉందన్నది భాజపా మరో అగ్రనేత విజయశాంతి మరో ఆరోపణ. అయితే ఈ యవ్వారంలో తమ పార్టీకి చెందిన చిరంజీవుల హస్తం లేనేలేదని ఎన్‌ఎస్‌యుఐ, కాంగ్రెస్‌ నేతల వాదన.

బాగుంది. కానీ.. సమాజం సిగ్గుపడేలా జరిగిన ఈ ఘటనను ఒక్క పార్టీ కూడా ఖండిస్తే ఒట్టు. టీఆర్‌ఎస్‌- కాంగ్రెస్‌ పార్టీ నేతలు, జరిగిన సంఘటన దురదృష్టకరమని సెలవిచ్చారే తప్ప… సైనిక శిక్షణ పొందిన అభ్యర్ధుల అరాచకాన్ని ఏ ఒక్కరూ ఖండించలేదు. దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేయలేదు. చివరాఖరకు దేశభక్తిపై పేటెంట్‌ హక్కులు ఉన్న బీజేపీ సైతం.. అది సైనిక శిక్షణ పొందిన యువకులు చేసిన పనికాదని, కాంగ్రెస్‌-టీఆర్‌ఎస్‌-మజ్లిస్‌ ముష్కరుల పనేనంటూ సర్టిఫికెట్‌ ఇచ్చిన దిక్కుమాలిన కితాబు. ఈవిధంగా మనలోని వెధవాయిత్వాన్ని బయటపెట్టుకునే, ఈ సిగ్గుమాలినతనం చూసి సిగ్గుపడాల్సిందే!

LEAVE A RESPONSE