Suryaa.co.in

Editorial

‘పల్నాడు పగ’ వెనుక ఖాకీ కుట్ర?

– ఈసీ వైఫల్యమే ‘పల్నాటి పగ’కు కారణమా?
– ఒక పోలీసు ఉన్నతాధికారి హస్తం?
– ఆయన రెండురోజులు నర్సరావుపేటలో మకాం వేశారా?
– తాజా ఎపిసోడ్‌లో బలిపశువు బిందుమాధవ్
– ఒత్తిళ్లకు లొంగనందుకే ఆయనపై వేటు పడిందా?
– గతంలో టెలీకాన్ఫరెన్సులలో మాధవ్‌ను హెచ్చరించిన ఓ పోలీసుపెద్ద?
– కలెక్టర్ పల్నాడు ఎస్పీకి సహకరించలేదన్న ఆరోపణలు
– సమస్యాత్మక స్టేషన్లను గత ఎస్పీ గుర్తించలేదా?
– 2వేల మంది సిబ్బంది కావాలని ఈసీని కోరిన బిందుమాధవ్?
– ఆ మేరకు ఈసీకి ప్రెజంటేషన్ ఇచ్చిన వైనం
– కానీ ఇచ్చింది నాలుగువందల మంది లోపేనట
– అయినా బిందుమాధవ్‌పై చర్యలా?
– గత డీజీపీ సమస్యాత్మక స్టేషన్లపై దృష్టి సారించలేదా?
– కొత్త డీజీపీ కూడా దానిపై సమీక్షించలేదా?
-మాచర్లలోనే ఉన్న ఐజీపై చర్యలు ఉండవా?
– ఆ అరడజను ఉన్నతాధికారులు డీఎస్పీలను బె దిరించారా?
– సీఎస్, డీజీపీ వైఫల్యం కిందివారిపై నెట్టేస్తారా?
– డీజీపీ పనితీరుపై ఎన్డీయే కూటమి అసంతృప్తి
– పోలీసు-ఎన్డీయే కూటమి వర్గాల్లో చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘ పల్నాడులో ఏం జరిగిందో మీరు మాకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచం మొత్తం చూసింది. ప్రత్యేకంగా ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు. తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నాం’’
-పల్నాడులో తగినంతమంది పోలీసు సిబ్బందిని నియమించని కారణంతోనే, అల్లర్లు జరిగాయన్న ప్రముఖ న్యాయవాది పదిరి రవితేజతో న్యాయమూర్తి వ్యాఖ్య.

దేశంలోనే సంచలనం సృష్టించిన పల్నాటి హింస వెనుక పోలీసుల హస్తం ఉందా? అధికార పార్టీతో అంటకాగుతున్న కొందరు పోలీసులే ఆ అల్లర్లకు పరోక్షంగా కారణమయ్యారా? పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీకి సహకరించలేదా? ఈ మొత్తం ఎపిసోడ్‌లో పల్నాడు ఎస్పీ బలిపశువయ్యారా? రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో లేని కొందరు హార్డ్‌కోర్ జగన్ అనుకూల పోలీసు ఉన్నతాధికారులు, కిందిస్థాయి పోలీసు అధికారులపై ఫోన్ల ద్వారా ఒత్తిళ్లు తెచ్చారా? పల్నాడు ఎస్పీపై వేటు వెనుక పాత పోలీసుపెద్దాయన పాత్ర ఉందా? తాజా డీజీపీ పనితీరుపై కూటమి ఆగ్రహంతో ఉందా? పల్నాడు హింసలో కీలకపాత్ర పోషించిన ఆ ఐపిఎస్ అధికారిపై కూటమి ఈసీకి ఫిర్యాదు చేయబోతోందా? ఇదీ ఇప్పుడు పోలీసు-రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్.

పోలింగ్ అనంతరం పల్నాడు జిల్లాలో జరిగిన హింస, ప్రతిపక్షాలపై దాడుల వెనుక పోలీసు అధికారుల పాత్ర ఉన్నట్లు పోలీసువర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అక్కడ పనిచేసిన ఒక వైసీపీ వీరభక్త పోలీసు అధికారి, పోలింగుకు రెండురోజుల ముందు-పోలింగ్ తర్వాత ఒకరోజు నర్సరావుపేటలోనే మకాం వేసి, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆమేరకు ఆయన గతంలో తన వద్ద పనిచేసిన డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులకు నిరంతరం ఆదేశాలిచ్చారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఆ మేరకు ఆయనపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు ఎన్డీయే కూటమి సిద్ధమవుతోంది.

కోడ్ తర్వాత పల్నాడు ఎస్పీగా వచ్చిన బిందుమాధవ్‌కు ముక్కుసూటిగా పేరుంది. ఎవరి ఒత్తిళ్లకూ లొంగని అధికారిగా పేరున్న బిందుమాధవ్.. వైసీపీ ఎమ్మెల్యేల ఒత్తిళ్లను బేఖాతరు చేసి, పోలింగ్ నిర్వహణపై పూర్తి స్థాయి దృష్టి సారించారు. ఆ క్రమంలో వైసీపీ అగ్రనేతలతోపాటు.. ఉన్నతాధికారుల సిఫార్సులను కూడా పక్కన పెట్టారంటున్నారు. అయితే ఆయన జిల్లాలో అంతకుముందు వైసీపీ ఎమ్మెల్యేలు ఏరికోరి నియమించుకున్న సీఐ, ఎస్‌ఐల పనితీరుపై పెద్దగా దృష్టి సారించని ఫలితంగా, వారంతా పోలింగ్‌కు ముందు-తర్వాత వైసీపీ నేతలకు సహకరించారని చెబుతున్నారు. దానికి ఎస్పీ బిందుమాధవ్ మూల్యం చెల్లించుకోవలసివచ్చిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలో ఒత్తిళ్లకు లొంగకుండా వ్యవహరించే ఎస్పీ బిందుమాధవ్ బలిపశువయ్యారని విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా ఒక పోలీసు పెద్దాయన బిందుమాధవ్‌ను, ఎస్పీల టెలీకాన్ఫరెన్సులోనే నీ సంగతి చూస్తానని హెచ్చరించినట్లు పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ కోపాన్ని ఇప్పుడు సస్పెన్షన్ రూపంలో, తమకు అనుకూలమైన అధికారుల ద్వారా తీర్చుకున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈసీ ఇచ్చిన ఆదేశాలను అడ్డుపెట్టుకుని, దానిని సాకుగా చూపి బిందుమాధవ్‌పై వేటు పడేలా, వ్యూహాత్మకంగా కథ నడిపినట్లు పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజాయితీగా పనిచేసిన ఎస్పీని సస్పెండ్ చేయడం ఏమిటని పోలీసు అధికారులు ప్రశ్నిస్తున్నారు.

‘‘బిందుమాధవ్‌ను సస్పెండ్ చేయాలని నేరుగా ఈసీ ఏమీ ఆదే శించలేదు. కానీ తమ మాట వినని బిందుమాధవ్‌ను చర్యల జాబితాలో పెట్టి ఆ సాకుతో తెలివిగా కొట్టేశారు. ఇలాగైతే ఎవరైనా ఎందుకు ఆత్మస్థైర్యంతో పనిచేస్తారు’’ అని ఓ పోలీసు అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఈసీ తాజా చర్యల్లో ఎస్పీలు- కలెక్టర్‌పై చర్యలు తీసుకున్నప్పటికీ, ఒక్క బిందుమాధవ్‌పై చర్య విషయంలోనే పోలీసు ఉన్నతాధికారుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

కాగా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన ఎస్పీ గరికపాటి బిందుమాధవ్ భార్య కమ్మ సామాజికవర్గానికి సంబంధించిన వారు కావడంతో.. ఎస్పీ కావాలనే వైసీపీని పోలింగ్ సమయంలో ఇబ్బంది పెట్టారంటూ, వైసీపీ ఎంపీ అభ్యర్ధి అనిల్‌కుమార్ యాదవ్ ఆయన సతీమణిని కూడా విమర్శించడంపై పోలీసు వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘ ఆయన సరిగా పనిచేయకపోతే ఇంటికి పోతే కమ్మటి భోజనం పెట్టదు’ అని వ్యాఖ్యానించడం తెలిసిందే.

‘ఐపిఎస్-ఐఏఎస్-ఐఆర్‌ఎస్-ఐఎఫ్‌ఎస్ అధికారుల్లో కొన్ని వందల మంది కులాంతర వివాహాలు చేసుకున్నారు. మేమే కాదు. రాజకీ య ప్రముఖులు కూడా కులాంతర-మతాంతర వివాహాలు చేసుకుంటున్నారు. మాపై ఆరోపణలు చేస్తున్న ఒక సలహాదారు కూడా కులాంతర వివాహమే చేసుకున్నారు కదా? అయినా కులాంతర వివాహాలకూ, విధినిర్వహణకూ సంబంధం ఏమిటి? అనిల్‌కుమార్ యాదవ్ మా అధికారిపై ఆరోపణలు చేసిన రెండవ రోజునే పల్నాడు ఎస్పీపై చర్యలు తీసుకున్నారంటే ఇదంతా ఎంత వ్యూహాత్మకంగా నడిపిస్తున్నారో స్పష్టమవుతోంద’ని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

ఇదిలాఉండగా.. ఈసీ వేటు పడిన వారు, అంతకుముందే ముందుజాగ్రత్తతో బదిలీ అయిన అరడజను పోలీసు ఉన్నతాధికారులు, ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ, వారంతా ఎన్నికల సమయంలో, తమ ప్రభుభక్తి ప్రదర్శించారన్న విమర్శలు పోలీసువర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒక అరడజను మంది పోలీసు ఉన్నతాధికారులు.. తమ పూర్వ పరిచయాలు వినియోగించుకుని, కిందిస్ధాయి పోలీసులకు ఫోన్లు చేసి హెచ్చరించారన్న ప్రచారం, పోలీసువర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.

కాగా ఉన్నతాధికారుల వైఫల్యాన్ని, కిందిస్ధాయి అధికారులపై రుద్దడమేమిటన్న ప్రశ్నలు పోలీసు-రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నిజానికి ఈసీ ఆదేశాలతో వచ్చిన కొత్త డీజీపీ.. అదే ఈసీ అనుమతితో సమయం తక్కువగా ఉన్నందున, శాఖను కొంతమేరకయినా ప్రక్షాళన చేస్తే ఈ సమస్య వచ్చేది కాదంటున్నారు. పల్నాడు, అనంత పురం, హిందూపురం, చిత్తూరు, తిరుపతి వంటి సమస్యాత్మక జిల్లాలపై దృష్టి సారించి అక్కడ అదనపు బలగాలను సిఫార్సు చేయాల్సి ఉందని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు విధ్వంసం జరిగిన పల్నాడు జిల్లాలో, తగినంత మంది సిబ్బంది లేకపోవడమే ఈ హింసకు ఒక ప్రధాన కారణమంటున్నారు. అటు జిల్లా కలెక్టరు కూడా ఎస్పీకి సహకరించలేదన్న వార్తలు అధికారవర్గాల నుంచి వినిపించాయి.

ప్రస్తుతం ఎన్నికల విధులకు దూరంగా ఉన్న సదరు పోలీసు ఉన్నతాధికారులకు హార్డ్‌కోర్ జగన్ అనుకూలురన్న ముద్ర ఉంది. దానితో ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులకు ఫోన్లు చేసి ‘‘మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తోంది. అనవసరంగా రిస్కు తీసుకోవద్దు. జాగ్రత్తగా పనిచేయండ’’ని, పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి సదరు పోలీసు ఉన్నతాధికారులపై, ఎన్డీఏ కూటమి గతంలోనే ఈసీకి ఫిర్యాదు చేయడం విశేషం.

కాగా జిల్లాలలో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, అల్లర్లు జరిగే ప్రమాదం ఉన్న పోలింగ్ స్టేషన్లను గుర్తించి వాటిని ఈసీకి పంపించడం జిల్లా ఎస్పీల విధి. కానీ పల్నాడు జిల్లా గత ఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఆ పనిచే యలేదన్న వ్యాఖ్యలు పోలీసువర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈసీ ఆదేశాలతో ఎస్పీగా వచ్చిన బిందుమాధవ్ సమస్యాత్మక స్టేషన్లు గుర్తించి, తమకు 3 వేల మంది సిబ్బంది కావాలని ఈసీకి నివేదించారట. కానీ వచ్చిన సిబ్బంది నాలుగువందల లోపేనని తెలుస్తోంది. వారిలో ఒక డజను మంది పోలీసులు ఐజీ శ్రీకాంత్ వెంట ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ నెల 8న తమకు 25 కంపెనీల పోలీసులు కావాలని ఎస్పీ బిందుమాధవ్ లేఖ రాయగా, 19 కంపెనీలను పంపించారు. తర్వాత 12వ తేదీన కూడా అదనపు బలగాలను అభ్యర్ధించారు. ఇదిలాఉండగా, పోలింగ్ ముగిసిన తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కేంద్ర బలగాలు, రాత్రికి మరో రాష్ట్రానికి వెళ్లిపోయాయి. అయితే వారిని అక్కడే కొనసాగించడం గానీ, లేదా వారి స్థానంలో ప్రత్యామ్నాయం ఏర్పాటుచేయడంలో గానీ ఈసీ విఫలమయిన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. పోలింగ్ తర్వాతనే హింస మొదలయింది కాబట్టి!

ఇక పోలింగ్ ముగిసిన తర్వాత బందోబస్తుకు వచ్చిన పోలీసు సిబ్బంది సాయంత్రానికే వెళ్లిపోవడం ప్రారంభించారు. దానితో సిబ్బంది సమస్య మరింత పెరిగేందుకు కారణమయిందంటున్నారు. ప్రధానంగా కొన్నిచోట్ల మూడు-నాలుగు పోలింగ్‌బూత్‌లకు ఒక గార్డు మాత్రమే కాపలా ఉన్నారంటే, ఎన్నికల్లో పోలీసు సిబ్బంది నియామకంపై గత పోలీసు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యహరించారో అర్ధమవుతోందని ఎన్డీయే కూటమి నేతలు విమర్శిస్తున్నారు.

నిజానికి గత డీజీపీ కూడా సమస్యాత్మక పోలీసుస్టేషన్లపై, దృష్టి సారించలేదన్న చర్చ పోలీసుశాఖలో నడుస్తోంది. రాష్ట్రంలో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించి, అక్కడ ఎంతమంది అదనపు సిబ్బంది కావాలన్న దానిపై జిల్లా ఎస్పీ సూచనలతో డీజీపీ ఈసీకి లేఖ రాస్తుంటారు. ఆదేశాలతో ఆయన స్థానంలో డీజీపీగా వచ్చిన అధికారయినా వాటిపై సమీక్ష నిర్వహించి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని పోలీసు-రాజకీయ వర్గాలు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నాయి.

ఐజీ శ్రీకాంత్‌పై చర్యలేవీ?
కాగా నాలుగు జిల్లాలకు ఇన్చార్జిగా ఉన్న ఐజీ శ్రీకాంత్.. ఎన్నికల రోజున మాచర్లలోనే ఉన్న విషయాన్ని పోలీసు వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఆ ప్రకారంగా అక్కడే విధులు నిర్వహిస్తున్న, ఐజీ స్థాయి అధికారిపై చర్యలు తీసుకోకుండా.. సమస్యాత్మక గ్రామాలు-పోలింగ్ స్టేషన్ల జాబితా ఇచ్చిన ఎస్పీ బిందుమాధవ్‌పై చర్య తీసుకోవడంపై పోలీసు శాఖలో విస్మయం వ్యక్తమవుతోంది. ‘సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల జాబితా ఇవ్వని పాత ఎస్పీని, పోలింగ్ రోజు అక్కడే ఉండి శాంతిభద్రతలు సమీక్షించిన ఐజీని వదిలిపెట్టి, ఈసీకి అన్ని వివరాలు సమర్పించిన ఎస్పీని బలిచేయటం సమంజసం కాదని’ ఒక మాజీ ఐపిఎస్ అధికారి వ్యాఖ్యానించారు. ఇది పోలీసుల్లో ఆత్మస్థైరాన్ని దెబ్బతీస్తుందన్నారు.

ఇదిలాఉండగా ఈసీ ఆదేశాలతో.. డీజీపీ పదవి దక్కించుకున్న హరీష్‌గుప్తా పనితీరుపై, ఎన్డీయే కూటమి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు, వారి మాటలబట్టి స్పష్టమవుతోంది. డీజీపీ సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదని, సీఎస్ సూచనల ప్రకారమే పనిచేస్తున్నారని ఎన్డీఏ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త డీజీపీ వచ్చిన తర్వాత పరిస్థితులు మారతాయని ఆశించామని,అయితే పేరుకు డీజీపీ మారినా పరిస్థితుల్లో ఏమార్పు కనిపించడం లేదని బీజేపీ నేతలు సైతం పెదవి విరుస్తుండటం గమనార్హం.

పల్నాడు ఎస్పీ బిందుమాధవ్ బదిలీ-సస్పెన్షనే దానికి ఉదాహరణ అని విశ్లేషిస్తున్నారు. ‘బిందుమాధవ్‌కు ఓ పోలీసుపెద్దాయనకు పడదు. ఆయన టెలీకాన్ఫరెన్సులలో నేరుగా ఆ ఎస్పీని హెచ్చరించేవారు. ఇప్పుడు ఆయనపై వేటు పడిందంటే కోడ్ ఉన్నా ఎవరి హవా నడుస్తుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేద’ని బీజేపీ అగ్రనేత ఒకరు విశ్లేషించారు.

సిట్ అధికారులపైనా కూటమి సందేహాలు?
ఇదిలాఉండగా.. పోలింగ్ అనంతర హింసపై ఏర్పాటుచేసిన సిట్‌లో నియమించిన అధికారులపై ఎన్డీయే కూటమి నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 13 మందిలో 9 మంది ఏసీబీ నుంచి, సీఐడీ నుంచి ఒకరు, ఇంటలిజన్స్ నుంచి ఒకరిని నియమించారు. ఈసీ ఆదేశాలతో డీజీపీ నుంచి తొలగించబడిన రాజేంద్రనాధ్‌రెడ్డి ప్రస్తుతం ఏసీబీ అధిపతిగా ఉండటం.. సిట్‌లో ఆయన శాఖ నుంచి ఎక్కువ మందిని నియమించడమే, ఎన్డీయే కూటమి అనుమానాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

‘పోలీసు శాఖలో అనేక విభాగాలున్నాయి. ఎన్నికల విధుల్లో లేని అధికారులు చాలామంది ఉన్నారు. ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ఎన్నికల సమయంలో ఖాళీగానే ఉంటారు. వారిని కాకుండా కేవలం ఏసీబీ అధికారులనే సిట్‌లో వేయటం, అందులో ఒకరు ఇంటలిజన్స్ నుంచి ఒకరు, సీఐడి నుంచి ఒకరిని నియమించడటం ఏమిటి? అసలు ఏ ప్రాతిపదికన 9 మందిని ఏసీబీ నుంచి సిట్‌లో డీజీపీ నియమించారు’’ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ రామ్‌కుమార్ వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE