ఖమ్మం: కొన్ని నెలలుగా మూసివేయబడిన ఖమ్మంలోని రైల్వే మధ్య గేట్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చొరవతో ఎట్టకేలకు తెరుచుకుంది.దీనిని మంగళవారం తెరవడంతో పాదాచారులు, వాహనాల రాకపోకలు తిరిగి మొదలయ్యాయి.దీంతో,గాంధీ చౌక్, కమాన్ బజార్ వ్యాపారస్తులు, స్థానికులు, ప్రయాణీకులు హర్షం ప్రకటించారు.ఖమ్మం రైల్వే స్టేషన్ లో మూడో ప్లాట్ ఫాం విస్తరణ పనులు కొనసాగుతుండడంతో ఈ గేట్ ను మూసివేశారు.
ఈ కారణంగా గత 4 నెలలుగా గాంధీ చౌక్, కమాన్ బజార్,వాటి పరిసరాలలో వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి.గేట్ మూసివేత వల్ల తమకు ఎదురవుతున్న కష్టాలు,నష్టాల గురించి వ్యాపారస్తులు, స్థానికులు ఎంపీ రవిచంద్రను కలిసి వివరించారు.ఆయన సానుకూలంగా స్పందించి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం,రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి వినతిపత్రం అందజేయడం తెలిసిందే.
మధ్య గేట్ తొలగించినట్టయితే, దే చోట బ్రిడ్జి లేదా అండర్ పాస్ వంటి ప్రత్యామ్నాయ మార్గాల సాధ్యాసాధ్యలను పరిశీలించాల్సిందిగా మంత్రిని ఎంపీ రవిచంద్ర కోరగా,ఆయన వెంటనే అధికారులకు తగు చర్యల కోసం ఆదేశాలిచ్చారు.బ్రిడ్జి లేదా అండర్ పాస్ నిర్మాణం పనులు మొదలయ్యే వరకు మూసివేయబడిన గేట్ ను తెరిపించాల్సిందిగా ఎంపీ వద్దిరాజు విజ్ఞప్తి పట్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశానుసారం మంగళవారం గేట్ తెరవడంతో రాకపోకల పునరుద్ధరణ జరిగింది.
దీంతో గాంధీ చౌక్, కమాన్ బజార్ పరిసర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు,స్థానికులు, ప్రయాణీకులు తమ సంతోషం వ్యక్తం చేస్తూ ఎంపీ వద్దిరాజుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.