Suryaa.co.in

Andhra Pradesh

కిక్ బాబు.. సర్వ్ ది పీపుల్

– 2024లో 175 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వస్తాం
– జులై 8, 9 తేదీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి
– నవరత్నాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు వేద మంత్రాలు
– ప్రజల అజెండాపైనే పార్టీ ప్లీనరీలో నిర్ణయాలు
– రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై 80-90 శాతం వైఎస్ఆర్సీపీ గుర్తుదే
– రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి

విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఏమన్నారంటే…
2017లో ఇదే ప్రాంతంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించింది. ఆ ప్లీనరీ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైయస్సార్‌ సీపీ 151 స్థానాలతో అఖండ విజయం సాధించి, అధికారాన్ని చేజిక్కించుకుంది. మళ్ళీ, అయిదేళ్ల తర్వాత 2022లో జులై 8,9 తేదీల్లో ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. మహానేత వైఎస్ఆర్ జయంతి జులై 8వ తేదీ కావడం, అదే రోజున పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. మళ్లీ అయిదేళ్ల తర్వాత, అంటే 2027లో కూడా అధికారంలో ఉండే మా పార్టీ, అప్పుడు కూడా ప్లీనరీ సమావేశాలు ఘనంగా నిర్వహించుకుంటాం. ఎంతో మనోధైర్యంతో ఈ విషయాన్ని చెబుతున్నాం. మాది ఒకటే సిద్ధాంతం. మా పార్టీ నాయకులంతా ఏకతాటిపై నడిచి విజయాలను సాధిస్తాం.

కిక్ బాబు..
‘కిక్‌ ది బాబు అవుట్‌.. గెట్‌ ద పవర్‌ అండ్‌ సర్వ్‌ ది పీపుల్‌’అనే నినాదంతో 2024లో జరిగే ఎన్నికలకు వెళతాం. 175 సీట్లకు 175 సీట్లు కైవసం చేసుకుంటామనే ధీమాతో ముందుకు వెళుతున్నాం.
జూలై 8,9 తేదీల్లో రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రదేశంలో జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ ప్లీనరీ సమావేశాలు నిన్నటితో పూర్తి చేసుకున్నాం. ఇవాళ, రేపు, ఎల్లుండి జిల్లా స్థాయి సమావేశాలు జరుగుతాయి. మా ప్లీనరీ సమావేశాలు మిగతా పార్టీల ప్లీనరీ సమావేశాలకు భిన్నంగా ఉంటుంది.

ప్లీనరీ సమావేశాలు అంటే… రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చినవారు, ఇలా ప్రతి ఒక్కరూ హాజరు అవుతారు. క్షేత్రస్థాయి నుంచి గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల వరకు ఈ ప్లీనరీకి లక్షల సంఖ్యలో హాజరు అవుతారు. మొదటి రోజు పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభ ఉపన్యాసంతో ప్రారంభం అవుతుంది. మళ్లీ 9వ తేదీ సాయంత్రం అధ్యక్షులు ముగింపు ఉపన్యాసం ఇస్తారు.

ఈ సమావేశంలో మా పార్టీ నాయకులు అంతా వివిధ అంశాలపై చర్చించి ముఖ్యమైన తీర్మానాలు చేయడం జరుగుతుంది. పార్టీ నియామవళిలో కొన్ని సవరణలు ప్రతిపాదించి, ఆ సవరణలను ప్లీనరీలో ఆమోదం కోరడం జరుగుతుంది. ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్న నాయకులందరికీ పేరుపేరునా పార్టీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్లీనరీ సమావేశాలను సమిష్టగా విజయవంతం చేస్తాం. రాబోయే ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొని మళ్లీ అధికారంలోకి వస్తాం.

సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఏమన్నారంటే…అయిదేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో వైయస్సార్‌ సీపీ ప్లీనరీ సమావేశాలు చరిత్రాత్మకంగా, విభిన్న రీతిలో జరిగాయి. ఆరోజు నవరత్నాల పేరుతో మా పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ అజెండాను, బ్లూప్రింట్‌ను విడుదల చేశారు. నవరత్నాలే.. మాకు వేదమంత్రాలయ్యాయి. వాటినే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే మేనిఫెస్టోలో పెట్టిన హామీలను వందకు 95శాతం పూర్తిగా అమలు చేసిన ఘనత, దేశ చరిత్రలో బహుశా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, జగన్‌ మోహన్‌ రెడ్డికే దక్కుతుంది. ఆచరణలో కూడా ఇంతటి నిబద్ధత కలిగిన నాయకుడితో ప్రయాణం చేస్తున్నందుకు పార్టీ శ్రేణులు నుంచి నాయకులు వరకూ అందరం ఎంతో గర్వపడుతున్నాం.

ప్రజల అజెండాతో ప్లీనరీ
అదే ప్రాంగణంలో మరోసారి ప్లీనరీ సమావేశాలు నిర్వహించడం సంతోషకరం. మరింత మెరుగైన రీతిలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు వారి భావి భవిష్యత్‌ చిత్రపటాన్ని ఇక్కడ ఆవిష్కరించే ప్రయత్నం ఈ ప్లీనరీ సమావేశాల్లో జరుగుతుంది. రాష్ట్ర భవిష్యత్‌, చరిత్ర ఇకముందు అంతా వైయస్సార్‌ సీపీతో కలిసి ముడిపడి ఉంది. ఇప్పుడు అధికారంతో పాటు, రానున్న ఎన్నికల్లోనూ విజయం సాధించి మరోసారి అధికారంలోకి రాబోతున్నాం. పేదలు, ప్రజల ఆకాంక్షలను మా పార్టీ నెరవేర్చబోతోంది. కోట్లాదిమంది ఈ పార్టీని, జగన్‌గారిని తమ హృదయాల్లో పెట్టుకున్నారు కాబట్టే ఈ ప్రయాణం, ప్రస్థానం నడుస్తూనే ఉంటుంది. ఇది కేవలం పార్టీ ప్లీనరీనే కాదు.. ప్రజల అజెండాను చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజల అవసరాల్ని ఇక్కడ నుంచి నిర్దేశించుకునే ప్లీనరీ కాబట్టే దీనికో ప్రత్యేకత ఉంది. ఆ మొత్తం ప్రత్యేకతను రేపు జరిగే ప్లీనరీలో చూస్తారు.

జగన్ సంతకంతో అహ్వానాలు..
అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైయస్సార్‌ సీపీ ఎలా విజయదుందుభి మోగించిందో అందరికీ తెలిసిందే. రాష్ట్రంలోని రాజకీయ ముఖ చిత్రంపై 80 నుంచి 90 శాతం పైగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తు ఉండిపోయింది. ఇంత ఘనత కలిగిన పార్టీ కాబట్టే రేపు జరిగే ప్లీనరీలో, క్రిందస్థాయి నుంచి వార్డు స్థాయిలో పోటీ చేసిన ప్రతి సభ్యుడిని మా అధ్యక్షులు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రత్యేకంగా తన సంతకంతో కూడిన లేఖ ద్వారా అందర్నీ వ్యక్తిగతంగా ఆహ్వానించడం కూడా చరిత్రాత్మకమే.

ఈ ప్లీనరీకి క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి.. ప్రతినిధులంతా హాజరవుతారు. రాష్ట్రానికి అంతటికీ మా పార్టీ ప్రాతినిధ్యం వహించే ప్లీనరీగా ప్రతిబింబిస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఆహ్వానం అందకపోతే స్థానిక నాయకులు చొరవ తీసుకుని ఆహ్వానాలు ఇవ్వడంతో పాటు కార్యకర్తలంతా ఈ ప్లీనరీకి హాజరు అయ్యేలా చూడాలి. అలాగే మీడియాకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ ప్లీనరీ సమావేశాలకు మీడియా సహాయ, సహకారం కూడా కావాలి.

పార్టీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు , ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఏమన్నారంటే…
ఈ ప్లీనరీ సమావేశాలు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రధానమైన వేడుక. వేడుకే కాదు ప్రజల బాధ్యత తీసుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయాలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అధికారం చేతికి వచ్చిన తర్వాత ఇది మా మొదటి ప్లీనరీ. పార్టీ తీసుకున్న నిర్ణయాలు, పార్టీ ఏ ఏ కార్యక్రమాలు అమలు చేస్తోంది, ఇంకా ఏం చేయాలనే వాటిపై చాలా క్షుణ్ణంగా, కూలంకషంగా చర్చించబోయే ప్లీనరీ.

ఈ ప్లీనరీలో పార్టీ తీర్మానాలను క్షుణ్ణంగా చర్చించబోతున్నాం. గతంలో జరగనటువంటివి, భవిష్యత్‌ నిర్ణయాలపై చర్చించనున్నాం. వీటిలో అనేకరకాల సూచనలు, సలహాలు వస్తాయి. ఈ సూచనలను భవిష్యత్‌లో పార్టీపరంగా అమలు చేయడానికి ఉపయోగపడేలా చేయబోతున్నాం. అన్నింటికంటే అతి ముఖ్యమైన అంశం పార్టీలో వివిధ వర్గాలకు, నాయకులకు ఉన్న అభిప్రాయాలు నిర్భయంగా చెప్పే అవకాశం ఉంటుంది.

అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇది చేశాం… పార్టీకి ఇది చేయాలని చెప్పేటువంటి అవకాశం ఈ ప్లీనరీలో ఉంటుంది. దాంతో రాబోయే రోజుల్లో కూడా పార్టీ పరంగా, నాయకత్వ పరంగా ఏం చేయాలనేది ఈ ప్లీనరీ సమావేశాలు అనువైన వేదికగా భావిస్తుంటాం. అన్ని రాజకీయ పార్టీలు ప్లీనరీలు జరుపుకుంటాయి, అయితే మా పార్టీ అందుకు భిన్నంగా, మా పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డిగారు పాదయాత్ర చేసినప్పటి నుంచి వచ్చిన సూచనలు, అవి మేనిఫెస్టోలో ఎలా కన్వర్ట్‌ అయ్యాయి, ఆ మేనిఫెస్టోను పార్టీ ఏవిధంగా బాధ్యతగా తీసుకుని ఏమేరకు, ఎంతశాతం అమలు చేసింది, అలాగే గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి అందించిన సంక్షేమ పథకాలు, రాబోయే రోజుల్లో అమలు చేసేవి, ఇలా గతంలో ఏ రాజకీయ పార్టీ చెప్పినటువంటి సాహసం చేయలేదు.

మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ..రాష్ట్రంలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి . ఒకవైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధితో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకోసం చేస్తున్న కార్యక్రమాలతోపాటు, పార్టీ పరంగా ఇస్తున్న పదవులు, కార్యకర్తల సంక్షేమం… వీటన్నింటిపై ప్లీనరీలో చర్చించడం జరుగుతుంది. రాష్ట్రాన్ని సంస్కరణల బాట పట్టించిన ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి.

మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. ప్లీనరీ సమావేశాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్లీనరీ నిర్వహించడం జరిగింది. అధికారంలోకి వచ్చాక గత మూడేళ్లుగా సంక్షేమ, అభివృద్ధి ఫలాలతో పరిపాలన సాగుతోంది. పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సందేశాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ముందుకు తీసుకువెళ్లడమే కాకుండా, ఆయన దిశా నిర్దేశంతో పార్టీని మరింత ముందుకు తీసుకు వెళతాం. 2024 ఎన్నికల్లో 175 సీట్లుకు 175 స్థానాలు వచ్చేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ప్లీనరీకి విజయమ్మ గారు హాజరవుతారని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా పార్టీ సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఈ విలేకర్ల సమావేశంలో తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, కిలారి రోశయ్య, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE