-ఉద్ధరిస్తానని గద్దెనెక్కి ఉద్యోగులతో చలగాటం ఆడుతున్న జగన్ రెడ్డి
-తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
ఉద్యోగులను ఉద్దరిస్తానని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకపోగా హక్కులకోసం పోరాడుతున్న వారిపై లాఠీలు ఝుళిపించడం దుర్మార్గం. పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు రోడ్డెక్కి నిరసనలు, ఉద్యమాలు చేసే పరిస్థితిని తీసుకొచ్చారు. గతంలో 43% పిఆర్సి ఇస్తే తప్పుబట్టిన జగన్ రెడ్డి నేడు అసలు వేతనాలకు ఎసరు పెట్టాడు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రివర్స్ పాలన తప్ప పురోభివృద్ధి లేని రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ చరిత్రను జగన్ రెడ్డి దిగజార్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీతాలు తగ్గేలా, ఉద్యోగుల నుండి బకాయిలు వసూలు చేసేలా జీవోలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. బడిలో పిల్లలకు పాఠాలు చెబుతూ ఉపాధ్యాయులు, ప్రజలకు అవసరమైన సేవలు చేస్తూ ఉద్యోగులు బిజీగా ఉండాల్సింది పోయి మా పొట్ట కొట్టొద్దు అంటూ రోడ్డెక్కే పరిస్థితిని జగన్ రెడ్డి తీసుకు వచ్చారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాల్సింది పోయి అరెస్టులు చేయడం, నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటు.
కోవిడ్ సమయంలో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, హెల్త్ తోపాటు పలు శాఖల ఉద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందించారు. వారి ఆకాంక్షలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగిందని కాగ్ నివేదిక చెబుతుంటే నిధులు లేవని వేతనాల్లో కోతలు విధించి ఉద్యోగుల పొట్ట కొట్టటం దుర్మార్గం. నాలుగు గోడల మధ్య ఉండి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను ప్రభుత్వం రోడ్డుపైకి తెచ్చింది. ఆదాయం కోసం ఉపాధ్యాయులతో మద్యం అమ్మించారు. ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేశారు. నాడు నేడు పేరుతో కోవిడ్ సమయంలో పాఠశాలలు నిర్వహించి వందలాది మంది ఉపాధ్యాయుల మరణాలకు కారకులయ్యారు.
కల్లబొల్లి కబుర్లు, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం.. గత రెండున్నరేళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఉద్యోగులకు మొండిచేయి చూపింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తానని జగన్ అనేక సార్లు ప్రకటించారు. అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. వారి ఆశలకు జగన్ సమాధి కట్టారు.
హక్కుల కోసం, న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉద్యోగుల న్యాయ పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. హక్కులు సాధించుకునే వరకు అండగా నిలుస్తుంది. ఉద్యోగులందరూ ఏకతాటిపైకి రావాలి. భవిష్యత్ లో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే భాద్యత వహించాలి.