– కమలంలో కిరణ్ కల్లోలం
– అంగరంగవైభవంగా కిషన్‌రెడ్డి ప్రమాణస్వీకారం
– సభకు హాజరైన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
– దానితో మధ్యలోనే లేచి వెళ్లిపోయిన విజయశాంతి
– తెలంగాణ వ్యతిరేకితో సభ పంచుకోనంటూ ట్వీట్
– బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు అస్త్రాలిచ్చిన రాములమ్మ
– కిరణ్‌ను పార్టీలోకి తెచ్చిన కిషన్‌రెడ్డి
– కిరణ్‌తో కాంగ్రెస్ రెడ్లను బీజేపీలోకి తెచ్చే వ్యూహం
– తెలంగాణలో సేవల వినియోగంపై అప్పుడే పార్టీలో వ్యతిరేకత
– ఆంధ్రాకే ఆయనను పరిమితం చేయాలని సూచన
– లేకపోతే పార్టీపై ఆంధ్రాముద్ర పడుతుందని ఆందోళన
– బీఆర్‌ఎస్‌కు అస్త్రం అందించినట్లవుతుందన్న అభ్యంతరాలు
– చంద్రబాబు మాదిరిగా కిరణ్‌ను అడ్డుపెట్టుకుని బీఆర్‌ఎస్ ప్రచారం చేస్తుందని ఆందోళన
– ఇప్పుడు అది రాములమ్మ ఆగ్రహంతో వాస్తవమైన వైనం
– విజయశాంతి ప్రశ్నకు జవాబివ్వాలన్న పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీర్‌రెడ్డి
– కిరణ్‌తో ఎన్నికల ప్రచారం చేయించాలని సవాల్ విసిరిన రఘువీర్
– దమ్ముంటే ఆయనతో తెలంగాణలోనే పోటీ చేయించాలని సవాల్
– కిషన్‌రెడ్డి.. కిం కర్తవ్యం!
( మార్తి సుబ్రహ్మణ్యం)
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి… ఉమ్మడి రాష్ట్రానికి ఆయనే చివరి ముఖ్యమంత్రి. తెలంగాణ ఏర్పాటును బహిరంగంగా వ్యతిరేకించిన సమైక్యవాది. తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన పాలకుడు. పాతబస్తీలో మజ్లిస్‌ను ఢీకొట్టిన సాహసి. ఐదుపైసల నిధులివ్వను. నీకు దిక్కున్నచోట చెప్పుకోమని సభలోనే హరీష్‌రావునుద్దేశించి చెప్పిన పాలకుడు. తెలంగాణ ఏర్పాటుచేయాలన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా నిర్ణయాన్ని వ్యతిరేకించి, జై సమైక్యాంధ్ర పేరుతో పార్టీ స్థాపించిన పదహారణాల సైమైక్యవాది.
తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని జోస్యం చెప్పిన మాజీ సీఎం. ఇప్పుడాయన బీజేపీలోజాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రమాణస్వీకార సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌పై విమర్శలు కురిపించారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ అక్కడున్న ఫైర్ బ్రాండ్ విజయశాంతికి, ఆయన అక్కడ ఉండటం నచ్చలేదు. కూర్చున్నంతసేపూ ముళ్లమీద కూర్చున్నట్లే కనిపించారు. ఇంతలో ఉన్నట్లుండి బయటకు వెళ్లిపోయారు. వెంటనే ఓ బాంబు లాంటి ట్వీట్ సంధించారు. అదిప్పుడు తెలంగాణ బీజేపీకి యమపాశంగా మారి, కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌కు అస్త్రంగా మారింది. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడదే హాట్‌టాపిక్.
తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న మాజీ సీఎం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డితో.. తెలంగాణలో కమలానికి కష్టకాలం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీలోకి తీసుకువచ్చేందుకు కృషి చేశారు. కిర ణ్ ద్వారా తెలంగాణ కాంగ్రెస్‌లోని రెడ్డి నేతలను బీజేపీలోకి తీసుకురావాలన్నది కిషన్ వ్యూహంగా కనిపించింది.
కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు, తెలంగాణ కాంగ్రెస్ రెడ్డి నేతలు ఆయన వెనుకే నిలిచారు. అందులో జగ్గారెడ్డి లాంటి వాళ్లు కూడా ఉన్నారు. ఆ వ్యూహంతోనే కిరణ్‌కు కాషాయ కండువా కప్పి, ఆయనకు జాతీయ కార్యవర్గ సభ్యుడి పదవి కూడా ఇచ్చారు. నిజానికి కిరణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది ఏపీలోని చిత్తూరు జిల్లా. అయినప్పటికీ, ఆయన పుట్టి పెరిగిందీ, చదువుకున్నదీ అంతా హైదరాబాదే. దానితో ఆయన చిన్నప్పటి నుంచీ హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు.
జాతీయ కార్యవర్గ సభ్యుడి హోదాలో.. కిషన్‌రెడ్డి సభకు హాజరైన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ సభ కు హాజరవడం, జాతీయ కార్యవర్గ సభ్యురాలైన విజయశాంతికి రుచించలేదు. కొద్దిసేపు వేదికపై కూర్చున్న విజయశాంతి హటాత్తుగా లేచి వెళ్లిపోవడంతో, అక్కడున్న వారంతా ఖంగుతిన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాములమ్మ చేసిన ట్వీట్‌తో, కమలదళాలు నిజంగానే ఖంగుతినాల్సి వచ్చింది.
‘‘నాడు తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన వారు స్టేజీపై ఉన్నారు. తెలంగాణను ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రయత్నించిన వారూ అక్కడ ఉన్నారు. తెలంగాణ వ్యతిరేకులు అక్కడ ఉండటతో అసౌకర్యంగా ఫీలయ్యా. అక్కడ చివరి వరకూ ఉండటం అసాధ్యం. అందుకే కార్యక్రమం ముగియకముందే వెళ్లిపోవలసివచ్చింది’’ అంటూ ఘాటైన ట్వీట్ చేసి, కమలదళాన్ని ఆత్మరక్షణలో నెట్టేశారు. ఇదంతా పరోక్షంగా కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి చేసినదేనని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
విజయశాంతి తాజా ట్వీట్ బీజేపీని ఆత్మరక్షణలో పడేయగా, కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌కు అది అస్త్రంగా పరిణమించింది. తెలంగాణ బీజేపీలో తెలంగాణ వ్యతిరేకులను నింపేశారన్న నినాదాన్ని, విజయశాంతి స్వయంగా వారికి అందించినట్లయింది. చాలాకాలం నుంచీ తన సేవలను వినియోగించుకోవడం లేదంటూ.. నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న విజయశాంతి, సరైన సమయంలో కొట్టిన దెబ్బకు, కమలం కుమిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
నిజంగానే ఆమె వ్యాఖ్యలతో బీజేపీ రాజకీయంగా ఆత్మరక్షణలో పడింది. అటు విజయశాంతి వ్యాఖ్యను ఖండించలేక, ఇటు కిరణ్‌కుమార్‌రెడ్డిని సమర్ధించలేని ఇరకాటం. అసలే పార్టీలో చేరికలు నిలిచిపోయి, బీజేపీ-బీఆర్‌ఎస్ ఒకటేనన్న ప్రచారం క్షేత్రస్థాయికి వెళ్లిన ఇబ్బందికర పరిస్థితి. అది చాలదన్నట్లు.. తాజాగా విజయశాంతి చేసిన ట్వీట్‌తో, ఇక బీజేపీని తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేకుండా పోవడం, కమలదళానికి కలవరం కలిగిస్తోంది.
అయితే..కిరణ్‌కుమార్‌రెడ్డి సేవలను తెలంగాణకు కాకుండా, ఆంధ్రాకు పరిమితం చేస్తే బాగుంటుందన్న వాదన, అప్పట్లోనే పార్టీ వర్గాల్లో వినిపించింది. తెలంగాణను అడ్డుకున్న కిరణ్‌ను, తెలంగాణలో వాడుకుంటే ప్రజలు పార్టీని వ్యతిరేకించే ప్రమాదం ఉందని, పలువురు సీనియర్లు అప్పుడే వాదించారు. నాటి అధ్యక్షుడు బండి సంజయ్ సహా.. పలువురు సీనియర్లు కూడా కిరణ్‌ను ఏపి వరకూ పరిమితం చేయాలని సూచించినట్లు , పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది.
గత ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ పొత్తులో చంద్రబాబు ప్రచారాన్ని, బీఆర్‌ఎస్ సద్వినియోగం చేసుకున్న అనుభవాన్ని, బీజేపీ సీనియర్లు అప్పుడే గుర్తు చేశారు. ‘‘తెలంగాణలో ఆంధ్రావాళ్లకు ఏం పని? తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబుతో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుంది? సీట్లకోసం పొత్తు పెట్టుకుంటారా? ఛీ మీ బతుకుచెడ’’అంటూ పోలింగ్ చివరి రోజుల్లో కేసీఆర్ సంధించిన సెంటిమెంట్ అస్త్రం సక్సెస్ అయిన వైనాన్ని బీజేపీ నేతలు అప్పుడే విశ్లేషించారు. ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డిని కూడా తెలంగాణలో తిప్పితే, బీజేపీకి సైతం అలాంటి చేదు ఫలితాలే ఎదురవుతాయని, చాలామంది బీజేపీ సీనియర్లు హెచ్చరించారు.
తాజా విజయశాంతి ట్వీట్‌ను పీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరి రఘువీర్‌రెడ్డి అందిపుచ్చుకుని, దానిని బీజేపీపైకి సంధించడం ఆసక్తికరంగా మారింది. ’తెలంగాణను వ్యతిరేకించిన కిరణ్‌కుమార్‌రెడ్డితో ఎన్నికల ప్రచారం చేయించే ధైర్యం బీజేపీకి ఉందా? ఆయనను తెలంగాణలో బీజేపీ అభ్యర్ధిగా నిలబెట్టే ధైర్యం ఉందా? విజయశాంతి ట్వీట్‌కు కిషన్‌రెడ్డి ఏం సమాధానం చెబుతారు? విజయశాంతి ట్వీట్ ప్రకారం, బీజేపీ తెలంగాణ వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టమవుతుంది’ అని వ్యాఖ్యానించారు.