Suryaa.co.in

Andhra Pradesh

పులివెందుల జిల్లాగా ఏర్పాటు చేసి భీమ్ రావు పేరు పెట్టాలి

* ప్రభుత్వ పథకాలకు జగనన్న స్థానంలో అంబేద్కర్ పేరు పెట్టాలి
* ఎస్సీలు జనసేన వైపు ఉన్నారన్న అక్కసుతోనే అమలాపురం అల్లర్ల కుట్ర
*:మీడియా సమావేశంలో జనసేన తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్

ఎస్సీ సోదరులు జనసేన వైపు ఉన్నారన్న అక్కసుతోనే అమలాపురం సాక్షిగా వైసీపీ ప్రభుత్వం కోనసీమ అల్లర్లకు తెర తీసిందని జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. ఈ కుట్ర వెనక ఎవరు ఉన్నారో జనానికి అసలు నిజం తెలిసిపోయిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీల మీద జరుగుతున్న మర్డర్లు, మానభంగాలు, హత్యాచారాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు వైసీపీ ప్రభుత్వం పన్నిన కుట్ర కోనసీమ అల్లర్లన్నారు. డైవర్షన్ చేసే సీఎంగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును వాడుకున్నారని ఆరోపించారు. అమలాపురం ఘటనలో నిజానిజాలు తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో పార్టీ ఎస్సీ నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. “అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు అగ్రవర్ణాల ప్రజలు సంతోషించారు.

కులాలను రెచ్చగొట్టి తద్వారా లబ్ది పొందేందుకు వైసీపీ ప్రభుత్వం కోనసీమ డ్రామాను తెర మీదకు తెచ్చింది. ఓటమి భయంతో వైసీపీ నేతలు తమ ఇళ్ళ మీద తామే దాడి చేయించుకుని సానుభూతి పొందాలని చూస్తున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలకు పేర్లు పెట్టినప్పుడు ప్రజల నుంచి ఎన్నో డిమాండ్లు వచ్చాయి. కోనసీమ ప్రాంతానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ జిల్లాల పునర్విభజన ప్రకటన సమయంలో వస్తే ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం జగన్నాటకం ఆడుతూ జనాన్ని రెచ్చగొట్టింది.

• దాడులకు కారకులెవరో రాష్ట్రం మొత్తం తెలుసు
ఈ దాడులకు పాల్పడింది, పురిగొల్పింది ఎవరో రాష్ట్రం మొత్తం తెలుసు. సోషల్ మీడియాలో వస్తున్న ఫోటోలు, మంత్రి విశ్వరూప్ ప్రకటనలే అందుకు నిదర్శనం. స్వయంగా మంత్రే తమ కౌన్సిలర్ ప్రమేయం ఉందని ఒప్పుకున్నారు. ఈ తరహా దాడులు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రశాంతి కిషోర్ ల డైరెక్షన్ లో జరుగుతున్నాయన్నారు. ఇప్పుడు దాన్ని జనసేన పార్టీ మీదకు నెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లర్లు చేసిన నిజమైన నింధితులు ఎవరో తేల్చాలన్న చిత్తశుద్ది ఉంటే ఘటనపై ఆంధ్రప్రదేశ్ పోలీసులతో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలి.

* వై.ఎస్.ఆర్. బదులు అంబేద్కర్ పేరు పెట్టాలి
మహనీయుడు బాబాసాహెబ్ మీద ముఖ్యమంత్రికి నిజంగా ప్రేమ ఉంటే వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటో తీసేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫోటో పట్టుకుని ఎన్నికలకు వెళ్లే దమ్ము మీకుందా? మీ పథకాలకు ఆయన పేరు పెట్టే సత్తా మీకుందా? ఉంటే ఆ పని చేయండి తర్వాత కులాల చిచ్చు గురించి మాట్లాడవచ్చు. కడప జిల్లాకు వై ఎస్ ఆర్ పేరు పెట్టారు. ఆ స్థానంలో అంబేద్కర్ పేరు పెట్టండి. కాని పక్షంలో 27వ జిల్లాగా పులివెందుల చేసి… భీమ్ రావు జిల్లా అని ప్రకటించండి.

సెలబ్రెటీ హోదాలో ఉన్న మా నాయకుడితో దిగిన ఫోటోను అడ్డు పెట్టుకుని మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు జనసేన పార్టీపై బుదర చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్యాకేజీ మంత్రి రోజాకు ఇదే చివరి పదవి.. ఎన్నికల తర్వాత ఇంటికి పరిమితం కాక తప్పదు.
ఫ్యాన్ గుర్తుకు ప్రజలు ఓట్లు వేస్తే.. కరెంటు కోతలతో ఆ ఫ్యాన్ గాలి కూడా ప్రజలకు అందడం లేదు. నిత్యం సమస్యలతో ప్రజలు ధర్నాలు, నిరసనలు చేస్తానంటే హౌస్ అరెస్టులు నిత్యకృత్యంగా మారాయ”ని చెప్పారు.ఈ మీడియా సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు జె.రాజారెడ్డి, పార్టీ దళిత నాయకులు కుమార్, చైతన్య,  పరమేష్, రమేష్, హరినాయక్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE