Suryaa.co.in

Telangana

కిషన్ రెడ్డీ.. నువ్వు మూసీలో పడుకున్నా.. మునిగి ఆత్మహత్య చేసుకున్నా.. ప్రక్షాళన చేసి తీరుతాం

– నిధులు తెస్తారా? గుజరాత్ కు వలస వెళతారా?
– మోదీ నుంచి లక్షన్నర కోట్లు తెస్తే పరేడ్ గ్రౌండ్ లో మీకు సన్మానం చేస్తా
– మోదీని తీసుకొచ్చి మూసీని చూపించు
– హైదరాబాద్ మరో ఢిల్లీ కావాలనా?
– మోడీ గుజరాత్ కి గిఫ్ట్ సిటీ తీసుకుపోయిండు
– నువ్వు తెలంగాణకు ఏం గిఫ్ట్ తెచ్చినవ్?
– కిషన్ రెడ్డీ…పేదలపై మొసలి కన్నీరు కార్చొద్దు
– 141 ప్రాంతాల్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్
– రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది
– మోదీ కంటే మంచి పేరు వస్తుందనే కిషన్ రెడ్డి మా కాళ్లల్లో కట్టెలు
“హైదరాబాద్ రైజింగ్” సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: విశ్వనగరంగా హైదరాబాద్ తీర్చిదిద్ది, న్యూయార్క్ లాంటి నగరాలతో సమానంగా నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రజలు ఏకోన్ముఖమై రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకుని ఇవ్వాళ్టికి ఏడాది.

వచ్చే ఏడాదికి భవిష్యత్ ప్రణాళికలు మనం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ అంటే రాష్ట్రానికే కాదు..ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉంది. హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ. నగరంలో తాగు నీటి సమస్యను పరిష్కరించాలని కృష్ణా జలాలనే కాదు. గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ది.

కాంగ్రెస్ ముందుచూపుతో వ్యవహరించడం వల్లే హైదరాబాద్ నగరంలో తాగు నీటి సమస్య పరిష్కారమైంది. హైదరాబాద్ కు మెట్రోను తీసుకొచ్చేందుకు ఆనాడు కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ కృషి వల్లే హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వచ్చాయి. రూ.35 వేల కోట్లతో 360 కి.మీ తెలంగాణ మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నాం.

రీజనల్ రింగ్ రోడ్డు నుంచి రేడియల్ రోడ్లు నిర్మించి నగరాన్ని మరింత అభివృద్ధి చేయనున్నాం.. ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ లో కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 40 నుంచి 50వేల ఎకరాల్లో ప్రపంచంలోని అంతర్జాతీయ నగరాలకు ధీటుగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం. బీఆరెస్ పదేళ్ల పాలనలో ట్యాంక్ బండ్ ను మురికి కూపంగా మార్చారు.

ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తానని ప్రజలను మోసం చేశారు. పదేళ్లలో నగరానికి కావల్సిన శాశ్వత అభివృద్ధిని గత ప్రభుత్వం విస్మరించింది. ఢిల్లీ నగరం పూర్తిగా కాలుష్యమయమైంది. ముంబైలో వరదలు వస్తే నివసించలేని పరిస్థితి. చెన్నైలోనూ వరదలు వస్తే గందరగోళ పరిస్థితి.

బెంగుళూరులో గంటలకొద్దీ ట్రాఫిక్ లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక కలకత్తాలో ఉన్నన్ని సమస్యలు ఎక్కడా లేవు. దేశంలో ఏ నగరాన్ని చూసినా సమస్యలమయమే. ఆ నగరాల నుంచి మనం నేర్చుకోవాలి. హైదరాబాద్ నగరం అలా మారకుండా జాగ్రత్త పడాలి.

అందుకే హైదరాబాద్ నగరంలో మూసీ పునరుజ్జీవనం జరగాలి. నగరంలో వరదల నియంత్రణకు రోడ్లపై వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మిస్తున్నాం. నగరంలోని 141 ప్రాంతాల్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించాలని అధికారులకు ఆదేశించాం. ఎంత మంది ఎంత విష ప్రచారం చేసినా, రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం చేసినా మేం వెనక్కి తగ్గేది లేదు.

ఏప్రిల్ 1 , 2023 నుంచి నవంబర్ 30, 2023 వరకు మీరు గమనించండి. మేం అధికారంలోకి వచ్చిన తరువాత ఏప్రిల్ 1, 2024 నుంచి నవంబర్ 30, 2024 వరకు మా పాలనకు తేడా చూడండి. మా పాలనలో 29 శాతం ఎక్కువ అభివృద్ధి జరిగింది. రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది తగ్గలేదు. ఇది మా నిబద్ధతకి నిదర్శనం.హైడ్రా చెరువుల ఆక్రమణ దారుల గుండెల్లో గుబులు పుట్టించింది.

మూసీ వద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. మోదీ కంటే మంచి పేరు వస్తుందనే కిషన్ రెడ్డి మా కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారు. నువ్వు మూసీలో పడుకున్నా.. మూసీలో మునిగి ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మీకు చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి మూసీ ప్రక్షాళనకు రూ.25 వేల కోట్లు నిధులు తీసుకురా.

కిషన్ రెడ్డీ…పేదలపై మొసలి కన్నీరు కార్చొద్దు.. చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి రూ.10వేల కోట్లు తీసుకురా భూమి నేను చూపిస్తా. పేదలకు మంచి అపార్ట్ మెంట్స్ కట్టిద్దాం.మంచి భవిష్యత్ ఇద్దాం. మోడీ గుజరాత్ కి గిఫ్ట్ సిటీ తీసుకుపోయిండు. నువ్వు తెలంగాణకు ఏం గిఫ్ట్ తెచ్చినవ్? రెండో సారి కేంద్రమంత్రి అయిన నువ్వు రాష్ట్రానికి ఏం నిధులు తీసుకొచ్చినవ్? సమాధానం చెప్పాలి.

నగరంలో మెట్రో విస్తరణకు రూ.35వేల కోట్లు అవసరం ఉంది.. మీరు ఎన్ని నిధులు తెస్తారో చెప్పండి. గుజరాత్ మెట్రోకు, చెన్నైకి మెట్రో కు నిధులు ఇచ్చారు.. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఎందుకు ఇవ్వరు..? హైదరాబాద్ కు తాగు నీటికి కోసం గోదావరి జలాల తరలించడానికి రూ.7వేల కోట్లు కావాలి. కేంద్రం నుంచి నువ్వు ఎంత తెస్తావ్?

రీజనల్ రింగ్ రోడ్డుకు, రేడియల్ రోడ్లకు రూ.50 వేల కోట్లు కావాలి… కేంద్రం నుంచి నువ్వు ఎన్ని నిధులు తెస్తావ్? నితిన్ గడ్కరీ దగ్గర మన ప్రతిపాదనలు పెండింగ్ లో ఉన్నాయి.. మీరు ఎన్ని నిధులు ఇప్పిస్తారో జవాబు చెప్పాలి. మోడీ గుజరాత్ కు తీసుకెళుతుంటే గుడ్లు అప్పగించి చూస్తారా?

మూసీలో పడుకోవడం కాదు…మోదీని తీసుకొచ్చి మూసీని చూపించు… పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందొ. మూసీ అభివృద్ధి ఎందుకు అడ్డుకుంటున్నారు? హైదరాబాద్ మరో ఢిల్లీ కావాలనా? మనం ఈ మురికి కూపంలో మగ్గాల్సిందేనా? తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి. లక్షన్నర కోట్లతో హైదరాబాద్ నగరం అద్భుతమైన నగరంగా మారుతుంది.

ప్రపంచం పెట్టుబడులకు హైదరాబాద్ వేదిక కావాలంటే ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరగాలంటే కేంద్రం సహకరించాలి. కిషన్ రెడ్డీ.. మీరు నిధులు తెస్తారా? గుజరాత్ కు వలస వెళతారా?తేల్చుకోండి. మూసీ ప్రక్షాళనకు మీ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పండి. హైదరాబాద్ లో మెట్రో విస్తగరణకు నిధులు ఎన్ని తెస్తారో చెప్పండి. హైదరాబాద్ నగరంలో ఫ్లై ఓవర్స్ నిర్మాణానికి మీరు తెచ్చే నిధులు ఎన్ని? కేంద్ర మంత్రిగా మీ ప్రతిపాదనలు ఏంటో ప్రజలకు చెప్పు.

మేం ఏం చేసినా అడ్డుకుంటా మంటున్నారు. ఆరు నెలలు నేను ఊరుకుంటా. నువ్ ఏం చేస్తావో చెప్పు. మాకు ఎలాంటి భేషజాలు లేవు… నగర అభివృద్ధికి మోదీ నుంచి లక్షన్నర కోట్లు తెస్తే పరేడ్ గ్రౌండ్ లో మీకు సన్మానం చేస్తా.

బీఆరెస్ , బీజేపీకి నేను ఈ వేదికగా పిలుపునిస్తున్నా. మీ పాలసీ డాక్యుమెంట్ తీసుకురండి. తండ్రీ, కొడుకులుపాలసీ డాక్యుమెంట్ తెలంగాణ సమాజానికి చూపండి. సహేతుకమైతే నూటికి నూరు శాతం మీ ప్రతిపాదనతో ముందుకెళ్తాం. ఇద్దరు గూడుపుఠానితో అడ్డుకోవాలని చూస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సారధ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం. బీఆరెస్, బీజేపీ వాళ్ల డాక్యుమెంట్ ఇవ్వాలి. మేధావులు కూడా మీ సూచనలు ఇవ్వండి.

ఏడాది పూర్తయిన సందర్బంగా మన భవిష్యత్ ప్రణాళిక మనమే సిద్ధం చేసుకుందాం. గోదావరి జలాలు మూసీలో పారాలి. అప్పుడే నగరంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది. ఏది చేసినా అడ్డుకుంటామంటే కుదరదు. తప్పులు.. అప్పులు తప్ప గత ప్రభుత్వం చేసిందేం లేదు. మాపై కోపంతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను శిక్షించొద్దు.. నగర అభివృద్ధిని అడ్డుకోవద్దు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే బాధ్యత మేం తీసుకుంటాం.

LEAVE A RESPONSE