– రైతులకు అండగా సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వం
– నష్టపోయిన సీజన్ లోపే పరిహారాన్ని అందిస్తున్నాం
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
– జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ క్యాలెండర్ ఆవిష్కరణ
గుడివాడ, జనవరి 6: చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు వ్యవసాయం దండగ అని గాలికి వదిలేశాడని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తీవ్రంగా విమర్శించారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం కాకర్ల వీధిలో జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ లో ఏపీ ఫారం మిషనరీ అండ్ ఇంప్లిమెంట్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అండ్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లం రామ్మోహన్ ముద్రించిన 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ను మంత్రి
కొడాలి నాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ అధినేత అల్లం రామ్మోహన్ ప్రతి ఏటా నూతన సంవత్సర క్యాలెండర్ ను రూపొందించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వ్యవసాయ పరికరాల సబ్సిడీకి సంబంధించిన అనేక రకాల సమస్యలు ఉన్నాయన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రూ.550 కోట్ల మేర బకాయిలు ఉన్నాయన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.300 కోట్ల బకాయిలను చెల్లించడం జరిగిందన్నారు. మిగతా రూ. 250 కోట్ల బకాయిల విషయమై మంత్రి కన్నబాబుతో మాట్లాడానని, ఈ విషయం సీఎం జగన్మోహనరెడ్డి దృష్టిలో కూడా ఉందని తెలిపారు. వచ్చే మార్చిలోగా పెండింగ్ బకాయిలను చెల్లించడం జరుగుతుందన్నారు. రైతులకు సంబంధించి విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీలు, పంట నష్టపరిహారం, ధాన్యం చెల్లింపులకు సంబంధించి గత ప్రభుత్వం రూ.4 వేల 500 కోట్ల బకాయిలను చెల్లించలేదన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పంట నష్టపోయిన సీజన్ లోపే నష్టపరిహారాన్ని చెల్లించడం జరుగుతోందన్నారు. దాదాపు రూ.4 వేల కోట్ల బకాయిలను కూడా చెల్లించామన్నారు.
రైతుభరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలోనే ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అందజేస్తున్నామన్నారు. సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నామన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందన్నారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులు, పాపాలు ఉన్నాయన్నారు. చంద్రబాబు తన బినామీల ఆస్థులు పెరిగేలా అమరావతిని అడ్డం పెట్టుకున్నాడని, ఏటీఎంలా పోలవరం ప్రాజెక్ట్ను వాడుకున్నాడని దుయ్యబట్టారు.
గత ప్రభుత్వ వైఫల్యాలను సరిచేసుకుంటూ ఈ రోజు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోనప్పటికీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్మోహనరెడ్డి మంచి పాలన అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో చిన్న పరిశ్రమల బకాయిలను వెంటనే విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటానని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, మాజీ కౌన్సిలర్లు అల్లం సూర్యప్రభ, మాదాసు వెంకటలక్ష్మి, మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి, జ్యోతుల సత్యవేణి, మట్టా జాన్ విక్టర్, రేమల్లి పసి, వైసీపీ నేతలు అడబాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.