కొమరం భీముడో..
కొమరం భీముడో..
కొర్రాకు నెగడోలె
మండాలి కొడకో..
మండాలి కొడకో..!
ఔను..అలాగే మండిపోయాడు
కొమురం భీముడు..
తన భూమిని ఆక్రమించిన
పెత్తందారు ప్రాణం
పసిప్రాయంలోనే తీసిన
గడసరి..పోరాటమే మగసిరి!
జల్..జమీన్..జంగిల్
నీరు..భూమి..అడవి…
వీటిపై ఎవరికున్నది హక్కు
మనకు గాకని కాకెత్తిస్తూ
కొమురం పెట్టిన కేక
నాదమై..రణనినాదమై
ప్రతి గిరిజనుడు సైనికుడై…
తిరగబడితే నిజాము
అహంకారానికే
అది మలిజామై..
కొండకోనల్లో పొడిచింది
తొలి స్వేచ్చాపొద్దు..!
కర్కశత్వమే ఇంటి పేరై..
దౌర్జన్యమే మారు పేరైన
నిరంకుశ నవాబు నిజాముకు
కొమురం భీముడి పేరు చెబితేనే దడ..
ఏలుబడే గడబిడ..!
ఈ భీముడు..
పోరాటానికి గెరిల్లా..
నచ్చిందే లా..
లేనే లేదు డీలా..
గిరిజన సంక్షేమం కోసమే
చేసిందల్లా..!
పశువుల కాపర్లపై సుంకమా
ఇదేనా మీ గతం..
మీ అవగతం..
అని ప్రశ్నిస్తూ అందుకుంటే
తిరుగుబాటు గీతం..
అదే అదే ఒకనాటికి
ఒక దుర్వ్యవస్థకు చరమగీతం…!
రణమే సంస్కరణమై..
తిరస్కరణమై..
పల్లె..పట్టణం..
తండా..గూడెంలో
అదే ప్రేరణమై..
ఒకనాటికి అదే కొమురం భీముని మరణమై..!
పగపట్టిన పెత్తందారీ
పట్టింది కుట్ర దారి..
ఉప్పుతిన్న అనుచరులే
గూఢచారులై అందిస్తే ఉప్పు
ముంచుకొచ్చింది ముప్పు..
అర్ధరాత్రి జరిగిన దాడిలో
పగటి సూర్యుడు అస్తమించాడు..!
అప్పుడే పొడిచింది..
తూరుపున వేగుచుక్క..
గగనమే రుధిర వర్ణం దాల్చగా..
వెలుగు కిరణం తాకి
సాగరమే ఉప్పొంగగా..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286