– దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్: అంధకారపు అణచివేత పొరలను చీలుస్తూ ఉదయించిన ఆదివాసీ వీరుడు కొమురం భీమ్ అని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. నేడు కొమురం భీమ్ జయంతి సందర్భంగా సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో మంత్రి సురేఖ కొమురం భీమ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు.
ఆత్మగౌరవ పోరాటాలకు, అస్తిత్వ ఉద్యమాలకు కొమురం భీమ్ గొప్ప స్ఫూర్తినిచ్చాడని మంత్రి సురేఖ తెలిపారు. కొమురం భీం ఇచ్చిన జల్, జంగల్, జమీన్ నినాదమే తెలంగాణలోని సబ్బండ వర్గాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమించేలా ప్రేరణనిచ్చాయని మంత్రి అన్నారు.
కొమురం భీమ్ త్యాగాలకు గుర్తుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుకు పూర్వమే పెదవాగు నది పై కొమురం భీమ్ పేరుతో ప్రాజెక్టును చేపట్టి, ఆయన త్యాగాలను గుర్తించిందని మంత్రి సురేఖ గుర్తు చేశారు. కొమురం భీమ్ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ గొప్ప పోరాటం చేసి, నియంతృత్వాన్ని తుదముట్టించి, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. కొమురం భీమ్ ఆశయాల సాధనకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తున్నదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.