– మిషన్లతో ఇసుక తోడేస్తున్న ఉల్లం‘ఘనులు’
– రామచంద్రాపురం ఇసుక ర్యాంపుల్లో ‘అమలాపురం అక్రమార్కులు’
– వైసీపీ నేతలకూ వాటాలట
– ఓ మంత్రి గారి బంధువులదే ఇసుక రాజ్యం
– మిషన్లు, లారీలు సీజ్ చేస్తున్న అధికారులు
– అయినా ఆగని ఆ మంత్రి బంధువుల ఇసుక దందా
– సీఎం, కలెక్టర్, స్పందనలో ఫిర్యాదుల వె ల్లువ
– ఫిర్యాదు వాపసు తీసుకోమంటూ మైనింగ్ అధికారుల ఒత్తిళ్లు?
– ససేమిరా అంటున్న ఫిర్యాదుదారులు
– అమలాపురం నుంచి వచ్చి ఇక్కడ ఇసుక దందా ఏమిటంటున్న కూటమి నేతలు
– పార్టీ పరువు పోతుందంటున్న తమ్ముళ్లు
– బాబు ఆదేశాలు బేఖాతర్
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఇసుక వ్యాపారాల జోలికి వెళ్లవదన్న సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలను..మంత్రివర్గ సహచరులే బేఖారు చేస్తున్న ధిక్కార పరిస్థితి. పచ్చటి
కోనసీమలోని రామచంద్రాపురం నియోజకవర్గంలో మిషన్లతో రాత్రింబవళ్లు ఇసుక తవ్వుతున్న ‘అమలాపురం బంధువుల’ అక్రమార్కుల కథ ఇది. ముచ్చటగా మూడు ఇసుక ర్యాంపులను కొల్లగొడుతున్న అక్రమార్కులు కూటమి కొంపముంచుతున్నారన్న ఆవేదన గోదారిలో కలుస్తున్న విషాదం.
అది కోనసీమ జిల్లా కే.గంగవరం మండలం మసకపల్లి గ్రామం. సర్వే నెంబర్ 8లో ఏటిగట్టువద్ద గోండ్రుమట్టిని అక్రమంగా తవ్వుతుండగా స్వయంగా అధికారులే రంగంలోకి దిగి మూడు లారీలను పట్టుకున్నారు. ఓ మంత్రి గారి అమలాపురం బంధువులే ఈ దందాకు… కర్త-కర్మ-క్రియ అన్నది టీడీపీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం.
అమలాపురం నియోజకవర్గానికి చెందిన ఈ బంధుగణం గోండ్రుమట్టి దందాలో బిజీగా ఉందట. రామచంద్రాపురంలోని మూడు ఇసుక ర్యాంపుల్లోనూ ఈ బంధుగణమే రేయింబవళ్లూ ఇసుక తోడేస్తున్నట్లు స్వయంగా కూటమి వర్గాల్లోనే బాహాటంగా చర్చ జరుగుతుండటం విశేషం. ఇప్పటికే తన శాఖను బావగారికి అప్పనంగా అప్పగించేసిన ఓ మంత్రిగారు.. ఇప్పుడు ఈ గోండ్రుమట్టి, మూడు ఇసుక ర్యాంపుల దందా ను అమలాపురంలోని తన బంధుగణానికి అప్పగించినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దానితో ఇప్పుడు ఎవరా మంత్రి? ఏమా కథ అన్న చర్చ కూటమి వర్గాల్లో మొదలయింది.
ఇప్పటికే సదరు అనధికార బావగారు, ఆ శాఖలో అన ధికార మంత్రిగా చక్రం తిప్పుతున్నారన్న ఫిర్యాదులు, సీఎంఓ వరకూ వెళ్లిన విషయం తెలిసిందే. సదరు బావగారు రోజూ పేషీలో బైఠాయించి, పీఎస్ సహకారంతో ఆ శాఖను చక్కబెడుతున్నారన్న చర్చ సచివాలయంలో బాహాటంగానే జరుగుతోంది.
ఆ శాఖలో ఇటీవల జరిగిన బదిలీల వ్యవహారంలో బావగారే చక్రం తిప్పారని, సస్పెండయిన వారికి.. ఏసీబీ విచారణలో ఉన్న అధికారులకు విశాఖ, కాకినాడ, ఏలూరు వంటి ఆదాయ మార్గాలున్న ప్రాంతాల్లో పోస్టింగులు ఇప్పించారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో సదరు మంత్రి గారు.. చివరకు సీఎంఓ కార్యదర్శి, పార్టీ కీలనేత సూచనలను కూడా బావగారి కోసం, బేఖాతరు చేయటం చర్చనీయాంశమయిన విషయం తెలిసిందే.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కే.గంగవరం మండలం కోట, మసకపల్లి గ్రామ సరిహద్దులోని రామఘట్టం వద్ద ఉన్న శ్మశానవాటిక సమీపంలో.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా.. ఒక మంత్రిగారికి చెందిన అమలాపురం బంధువులు, ఇసుక తవ్వకాలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మాన్సాస్ ట్రస్టుకు చెందిన ఈ భూముల్లోని ఇసుకను, అనుమతులు తీసుకునే తవ్వకాలు చేస్తున్నట్లు కొద్దికాలం వరకూ ప్రచారం జరిగింది. అయితే తాము ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని ట్రస్టు నిర్వహకులు స్పష్టం చేయడంతో అసలు కథ బయటపడింది.
17-7-2017 నుంచి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా.. ప్రభుత్వంలో ఉన్న ఓ మంత్రి దన్నుతో, యధేచ్చగా ఇసుక తవ్వకాలు చేస్తున్నట్లు రామచంద్రాపురం నియోజకర్గం ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసిన వైవిఎస్ రామరాజు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్‌తోపాటు స్పందనలో కూడా ఫిర్యాదు చేశారు. ఆ మేరకు గూగుల్ మ్యాపులను కూడా తన ఫిర్యాదుకు ఆధారంగా సమర్పించడం ప్రస్తావనార్హం. గూగుల్ మ్యాపుల్లో ఇసుక తవ్వకాల వ్యవహారం బయటపడటంతో, ఇసుకాసురలపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.
దానితో మంత్రి బంధువుల పక్షాన రంగంలోకి దిగిన మైనింగ్ అధికారులు..ఫిర్యాదు చేసిన రామరాజు వద్దకు వచ్చి.. అక్కడ మిషన్లు లేవు. లారీలు కూడా లేనందున మీ ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చే సిన క్రమంలో, సదరు ఫిర్యాదుదారు వాటికి తలొగ్గలేదు. ఆర్డీఓ స్వయంగా లారీలు సీజ్ చేసినట్లు చెబుతుంటే, అక్రమాలు లేవని ఎలా చెబుతారంటూ రామరాజు నిలదీసినట్లు సమాచారం.
రామచంద్రాపురం నియోజకవర్గంలోని కోటిపల్లి కోట, కాజులూరు మండలం పెదలంక గ్రామం, కే.గంగవరం మండలం కోట, మసకపల్లి గ్రామ సరిహద్దులోని రామఘట్టం ఇసుక ర్యాంపులతో సదరు మంత్రిగారి బంధువులు ఇసుక దందా చేస్తు, కోట్లకు పడగలెత్తుతున్నారని కూటమి నేతలే బాహాటంగా చెబుతున్నారు.
ఇసుక రీచ్‌లలో మిషన్లు వాడవద్దన్న కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ.. ఈ ఇసుక ర్యాంపుల్లో రాత్రింబవళ్లు మిషన్లతోనే ఇసుక తవ్వకాలు చేస్తున్నారన్న
ఆరోపణలపై, అధికారులు కంటితుడుపు చర్యలు తీసుకుంటున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారులు తనిఖీలకు వస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమవుతున్న ఇసుకాసురులు, మిషన్లను తుప్పల్లో దాచిపెడుతున్నారని చెబుతున్నారు. పెదలంక వద్ద ఉన్న ఇసుక ర్యాంపుల కు సంబంధించి, నావల నుంచి ఇసుక తరలిస్తున్నారంటున్నారు.
అధికారులు అనేక సార్లు మిషన్లు సీజ్ చేసినప్పటికీ, మళ్లీ మరికొన్ని మిషన్లను తెచ్చి ఇసుక తవ్వుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కుల్ల గ్రామంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన ఓ వైసీపీ నేత, కే.గంగవరం మండల వైసీపీ నేతకు ఈ దందాలో వాటాలున్నాయని కూటమి నేతలు
బాహాటంగానే ప్రచారం చేస్తుండటం విశేషం. కాగా కొద్దిరోజుల క్రితం టీడీపీ నేతలు ప్రెస్‌మీట్ పెట్టి నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఇసుక దందాలు
చేస్తున్నారని ఆరోపించారు. అయితే దానికి సమాధానంగా.. ‘మేం ఇసుక దందాలు చేస్తుంటే మీ ప్రభుత్వం పట్టుకోకుండా గుడ్డిగుర్రానికి పళ్లు తోముతోందా’ అని రామచంద్రాపురం వైసీపీ వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో తమ పార్టీ పరువు పోయిందని త మ్ముళ్లు తలపట్టుకోవాల్సి వచ్చింది.
ఇసుక దందాలో వైసీపీ నాయకులతో కలసి వ్యాపారం చేస్తున్న వైనంపై విచారణ జరపాలని, స్థానిక కూటమి నేతలు టీడీపీ నాయకత్వానికి ఫిర్యాదు చేయడం ప్రస్తావనార్హం.
