– ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి
– మంత్రులతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ సంతోష్ కుమార్
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు కోటి మొక్కలు నాటే వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా చిల్కూర్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలో మంచిరేవులలో ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, భూగర్భ గనుల, సమాచార శాఖ మహేందర్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి ప్రారంభించి, మొక్కలు నాటారు. అనంతరం సఫారీ వాహనంలో పార్కు అంతా కలియ తిరిగారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా హరితహారంలో భాగంగా కోటి మొక్కలు నాటే వృక్షార్చన కార్యక్రమానికి సీయం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో పండగ వాతావరణంలో మొక్కలు నాటారన్నారు. హరితహారం కార్యక్రమంలో ఇప్పటి వరకు 283 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు.
అర్బన్ లంగ్ స్పేస్ లో భాగంగా పట్టణ, నగరవాసులకు మానసిక ఉల్లాసం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు అటవీ బ్లాక్ ల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను సరికొత్త థీమ్‌తో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులకు గాను ఇప్పటివరకు 73 పార్కులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇవాళ ప్రారంభించుకున్న ఫారెస్ట్ ట్రెక్ పార్క్ 74 వదని తెలిపారు.
గతంలో డంపింగ్ యార్డుగా మారిన ఈ ప్రాంతాన్ని అటవీ అభివృద్ధి సంస్థ అర్బన్ పారెస్ట్ పార్కుగా తీర్చిదిద్దడంతో ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచే పార్కుగా మారిందన్నారు. అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుతో విలువైన అటవీ సంపదను కాపాడటంతో పాటు ఈ ప్రాంత వాసులకు ఆహ్లాదంగా గడిపేందుకు అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఫారెస్ట్ ట్రెక్ పార్కుకు సందర్శకుల తాకిడి పెరిగిందని ప్రతీ రోజు 3 వేల మంది, వీకెండ్ లో 5 వేల మంది ఈ పార్కులో సేదతీరుతున్నారని వెల్లడించారు.
ఎంపీ సంతోష్ మాట్లాడుతూ…. చేస్తున్న పని మంచిదైతే దేవుని ఆశీస్సులు కూడా ఉంటాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఈ అద్బుతమైన కార్యక్రమంలో ప్రకృతి పులకించి చిరుజల్లులు పడుతుండటం శుభ సూచకమని వ్యాఖ్యానించారు.
సీయం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నదని, రాష్ట్రంలో 7.7 శాతం గ్రీన్ కవర్ పెరడగమే దీనికి నిదర్శమని తెలిపారు. దేశంలో మిగితా రాష్ట్రాల్లో పచ్చదనం తగ్గితే తెలంగాణ రాష్ట్రంలో అడవుల రక్షణ – సంరక్షణతో గ్రీన్ కవర్ పెరిగిందని వివరించారు.
కోటి వృక్షార్చన అద్భుతమైన కార్యక్రమని ఆయన పేర్కొన్నారు.హైదరాబాద్ వెస్టులో ఫారెస్ట్ ట్రెక్ పార్క్ సందర్శకులకు, ప్రకృతి ప్రేమికులకు మంచి సౌకర్యాలు అందిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ సభ్యులు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, సీఎస్ శాంతికుమారి, అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, తదితరులు పాల్గొన్నారు.
పార్క్ ప్రత్యేకతలు
ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ రంగారెడ్డి జిల్లా చిల్కూర్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలో మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను రూ. 7.38 కోట్ల వ్యయంతో 256 ఎకరాల వీస్తీర్ణంలో అభివృద్ధి చేసింది.
అర్బన్ లంగ్ స్పేస్ లో భాగంగా మానసిక ఉల్లాసం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు సరికొత్త థీమ్‌తో అభివృద్ధి చేసిన ఈ పార్క్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గండిపేట, కోకాపేట, మంచిరేవుల పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగర ఆకాశ హర్మాలను వీక్షించేలా ఏర్పాటు చేసిన వాచ్ టవర్ ఈ పార్క్ లో అదనపు ఆకర్షణగా నిలువనుంది. ఈ పార్కులో గజీబో, వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, రాక్ పెయింటింగ్, ఓపెన్ జిమ్, అంఫి థియేటర్, వాటర్ ఫాల్, తదితర సదుపాయాలు కల్పించారు.
విస్తీర్ణం: 256 ఎకరాలు
వ్యయం: రూ. 7.38 కొట్లు
పొడవు: 5.6 కి. మీ.
మొక్కలు: 50 వేల రకాలు
ట్రెక్కింగ్ ట్రాక్: 2 కి. మీ.
వాకింగ్ ట్రాక్: 4 కి. మీ.