– నే డు పీసీబీ టాస్క్‌ఫోర్స్ భేటీ
– రీఓపెన్ చేయమంటూ క్రెబ్స్ లేఖ
– కేకేఆర్ సంగతేమిటి?
– క్రెబ్స్ కేసు నిందితులను పోలీసులు వదిలేశారా?
– చివరకు క్రెబ్స్ ప్లాంట్ హెడ్‌పై కేసుతో సరిపెట్టిన పోలీసులు?
– క్రెబ్స్ ఘట్టంలో చివర కు బలిపశువు ప్లాంట్ హెడ్?
( సుబ్బు)
అసెంబ్లీ వేదికగా సంచలనం సృష్టించిన క్రెబ్స్ కెమికల్స్ కథ సుఖాంతమవుతోందా? అదే కేసులో నిందితురాలయిన కేకేఆర్ కేసుకూ పీసీబీ ముగింపు పలకబోతోందా?.. శనివారం పీసీబీ టాస్క్‌ఫోర్స్ భేటీ నేపథ్యంలో పీసీబీలో ఇదో హాట్ టాపిక్.
అయితే పొలాల్లో రసాయన వ్యర్థాలు పారబోసిన క్రెబ్స్-కేకేఆర్ కంపెనీలకు ఏమైనా పెనాల్టీ విధించారా? వాటిని మళ్లీ యధాతథ స్థితికి తెచ్చేందుకు పీసీబీ ఏం ప్రతిపాదనలు సూచించింది? అందుకు క్రెబ్స్ నుంచి వచ్చిన సమాధానమేమిటన్నది టాస్క్ఫోర్సు భేటీలో తేలనుంది.
అనకాపల్లి జిల్లా కసిమికోటలోని క్రెబ్స్ బయో కెమికల్స్ కంపెనీ తన వ్యర్థ రసాయనాలకు శుద్ధి చేయకుండా, కేకేఆర్ అనే కంపెనీకి ఇచ్చింది. అయితే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని కేకేఆర్ కంపెనీ అనకాపల్లికి వెళ్లి, ఆ వ్యర్థాలు తీసుకుని గన్నవరం సమీపంలోని జక్కంపూడి గ్రామంలోని పొలాల్లో విడిచిపెట్టడం వివాదానికి దారితీసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పీసీబీ చైర్మన్ పి.కృష్ణయ్య క్రెబ్స్‌పై కేసు నమోదు చేసి, దానిని మూయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ క్రమంలో ఇదే విషయంపై విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ క్రెబ్స్ కంపెనీతోపాటు, రాంకీ ఫార్మా ఉల్లంఘనలను ప్రస్తావిస్తూ.. ‘‘ఆసలు పీసీబీ పనిచేస్తుందా? లేదా? కృష్ణయ్య మాలాంటి ఎమ్మెల్యేలను చాలామందిని చూశామంటారు. పవన్ కల్యాణ్ మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటున్నారు. కాబట్టి పవన్ కల్యాణ్ గారు పీసీబీని పనిచేసేలా చూడాల’’ంటూ.. అసెంబ్లీలో పవన్‌నుద్దేశించి చేసిన వ్యాఖ్య వివాదానికి దారితీసింది.
దానికి స్పందించిన పవన్ కల్యాణ్.. చర్యలు తీసుకోవాలనుకుంటే ఒక్క రాంకీపైనే కాదు. అన్నింటిపైనా తీసుకోవాలి. అలా చేస్తే పరిశ్రమల పరిస్థితి ఏమిటన్నది చూడాలి. అందులో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి చూడాలి. కక్ష సాధింపు వైఖరి మా విధానం కాదని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో శనివారం జరగనున్న పీసీబీ టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశంలో.. క్రెబ్స్, కేకేఆర్ కంపెనీలు తమ కంపెనీలను మళ్లీ రీపెన్ చేయాలంటూ ఇచ్చిన అర్జీపై చర్చించి, వాటిని తిరిగి రీ ఓపెన్ చేయించేందుకు రంగం సిద్ధమయినట్లు చర్చ జరుగుతోంది.
అయితే మరి క్రెబ్స్-కేకేఆర్ కంపెనీలకు ఏమైనా పెనాల్టీ విధించారా? క్రెబ్స్ జారవిడిచిన గ్రామంలో నాశనమయిన పొలాలను శుద్ధి చేసేందుకు, పీసీబీ చేసిన ప్రతిపాదనలు క్రెబ్స్ ఆమోదించిందా? అన్నది చూడాలి.
క్రెబ్స్ డైరక్టర్లు సేఫ్!
కాగా క్రెబ్స్ కంపెనీ ఉల్లంఘనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పీసీబీ చైర్మన్ కృష్ణయ్య, సదరు కంపెనీపై కేసు పెట్టాలని విజయవాడ టూటౌన్ పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కంపెనీ డైరక్టర్లపై కేసు పెట్టి.. చివరకు ప్లాంట్ హెడ్ కృష్ణమోహన్ ఒక్కరి పేరుతోనే సరిపెట్టినట్లు తెలుస్తోంది. నాటి పోలీసు అధికారులు ఈ కేసులో చక్రం తిప్పినట్లు ఆరోపణలున్నాయి. ఆ మేరకు పెద్ద ఎత్తున చేతులుమారినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ సందర్భంలో ఒక ఎస్ఐ.. కంపెనీ తరఫున వచ్చిన వారిని బెదిరించి, వారు ఎక్కడున్నారో కూడా ట్రేస్ చేసి వేధించినట్లు చెబుతున్నారు.