– సీఎంకు జవహర్ లేఖ
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇ ఆత్మపరిశీలన చేసుకోవాలని మాజీ మంత్రి జవహర్ కోరారు. ఆ మేరకు ఆయన ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు.
ఒక సారాంశం ఇది..
గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు శ్రీ జగన్మోహన్రెడ్డి గారికి
అయ్యా!
విద్యతోనే మానవుడు తన స్థితిగతుల్ని, ప్రపంచ పరిస్థితుల్ని మార్చగలడు. దేశంలోని అన్ని రాష్ట్రాలు విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి.. విద్యారంగంలో నూతన విధానాలు అమలు చేస్తూ.. విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం పరిస్ధితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. టీడీపీ హయాంలో ఎడ్యుకేషన్ హబ్‌గా పేరొంది దేశంలో అగ్రస్ధానంలో ఉన్న మన రాష్ట్రం నేడు అధమ స్ధానంలో ఉంది. గతంలో దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్ధలు రాష్ట్రానికి రావటంతోపాటు, దేశ, విదేశాల్లోని విద్యార్ధులు సైతం మన రాష్ట్రంలో విద్యనభ్యసించేవారు. మీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో అడుగడుగునా విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. మీ అనాలోచిత, అవగాహనా రాహిత్య నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఉన్న విద్యాసంస్ధలు మూతపడి లక్షలాది మంది విద్యార్ధులు విద్యకు దూరమయ్యే ప్రమాదం నెలకొంది.
మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టి మాతృభాష బోధనను తుంగలో తొక్కే ప్రయత్నం చేసి రాష్ట్రంలోని విద్యార్థుల తల్లిదండ్రులను అయోమయానికి గురి చేశారు. నూతన విద్యా వ్యవస్థతో కొంతకాలం, ఆంగ్ల మాద్యమం పేరుతో కొంతకాలం ఎయిడెడ్ వ్యవస్థ నిర్వీర్యంతో కొంతకాలం గందరగోళం సృష్టించి ఉపాధ్యాయ రంగాన్ని పూర్తిగా అవహేళన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పుల పేరిట ఉన్నవాటిని తొలగించి విద్యా వ్యవస్థలో వైసీపీ సంస్కృతిని తీసుకొచ్చి ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురిచేయడం సరికాదు. రాష్ట్రంలో 300 కు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్ధులకు ఉపాధ్యాయులు భోధన సాగిస్తున్న విషయాన్ని మర్చిపోయి పాఠ్యాంశాలను కుదిస్తూ ముందుకు వెళ్లే విధానాన్ని అవలంబించటం హేయం. పాఠశాల అభివృద్ధి అంటే కమీషన్ల కోసం కేవలం నాడు-నేడు మాత్రమే కాదు. అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దే సామర్థ్యం, ప్రశాంత వాతావరణం, నిపుణులతో ప్రత్యేక తరగతులు కల్పించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటం. కార్పోరేట్ స్థాయి చదువులంటూ చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దుతా అని చెప్పి.. ఉన్న ఎయిడెడ్ పాఠశాలలను మూసేయడం ఎంతవరకు సమంజసం? అమ్మఒడి పేరుతో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఎగ్గొట్టారు.
దళితులకు అన్యాయం ….
దళిత బిడ్డల్ని కార్పోరేట్ పాఠశాలల్లో చదివేందుకు టీడీపీ ప్రభుత్వం రూపకల్పన చేసిన బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్ రద్దుతోపాటు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ఏర్పాటు చేసిన అంబేడ్కర్ ఓవర్సిస్ విద్యా నిధి పథకానికి తూట్లు పొడిచి దళితులకు తీవ్ర అన్యాయం చేశారు. ప్రధానంగా గురుకుల పాఠశాలలందు సీట్ల భర్తీలో జీవో నెం. 25ను పక్కాగా అమలు చేయకుండా ఎస్సీ విద్యార్థులతో పాటు ఎస్టీ, బీసీ విద్యార్థులను దారుణంగా మోసం చేసిన ఘనత మీ ప్రభుత్వానికే దక్కింది. సీపీఎస్ రద్దు, డీఎ పెంపుపై స్పందించకుండా వేలిముద్రల పేరుతో ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురి చేయడంపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటన్నింటిపైనా మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పటికైనా విద్యార్థులు, తల్లితండ్రుల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరుతూ…
కె.ఎస్. జవహర్
మాజీ మంత్రివర్యులు