– కేటీఆర్-జగన్ హమ్‌సబ్ ఏక్‌హై
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆయన తన పక్క రాష్ట్రంలోని ప్రజల దుస్థితిని వెక్కిరిస్తూ మాట్లాడారు. అక్కడ కరెంటు ఉండదని, రోడ్లు బేకారని బయటపెట్టారు. తాను చెప్పేది అబద్ధమైతే ఓసారి ఆంధ్రాకు వెళ్లిరండని సలహా ఇచ్చారు. తన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించారు.ఆయన పేరు కేటీఆర్. తెలంగాణ మంత్రి!
దానితో పక్క రాష్ట్ర సీఎం దగ్గర పనిచేసే మంత్రులంతా కేటీఆర్ మాటలకు అగ్గిరాముళ్లయ్యారు. మా జగనన్న రాజ్యంలో అభివృద్ధి పంచకల్యాణి గుర్రం కూడా ఈర్ష్యపడేంత స్పీడుగా పరుగులుతీస్తోందని, సత్తిబాబు లాంటి మంత్రులు ఎదురుదాడి చేశారు. మీ రాష్ట్రంలోనే కరెంటు ఉండదని, మీరు అనుభవిస్తున్న సోకంతా, అప్పటి మా సొమ్మేనని కౌంటరిచ్చారు. మీకంత పబ్లిసిటీ సోకుంటే మీ గొప్పలు మీరు చెప్పుకోండి తప్ప, మా రాష్ట్రం గురించి వెటకారాలాడితే సహించేది లేదని కన్నెర్ర చేశారు. కరోనా టైములో ట్రీట్‌మెంట్ కోసం, హైదరాబాద్ నుంచి తమ రాష్ట్రానికి వచ్చారన్న కొత్త విషయాన్ని బయటపెట్టారు. నిజానికి ఈ రహస్యాన్ని ఇప్పటివరకూ అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ లాంటి పేరుగొప్ప నిఘా ఏజెన్సీలు కూడా కనిపెట్టలేకపోయాయి.ఎదురుదాడి చేసిన ఆ బ్యాచ్ లీడరు పేరు జగన్. ఏపీ సీఎం!
ఇదంతా కొద్దిరోజుల క్రితం క్రెడాయ్ వేదికపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల అనంతరం జరిగిన రచ్చ. ప్రింటు మీడియాలో కథనాలకు, ఎలక్ట్రానిక్ మీడియాలో రచ్చ లాంటి చర్చలకూ దారి తీసిన సబ్జెక్టు ఇది. చివరాఖరకు తారకరాముడే నోరు తెరిచి.. అబ్బే తాను ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించలేదని, జగనన్న తనకు సోదరసమానుడని, ఆంధ్రా కూడా అభివృద్ధిలో పంచకల్యాణి గుర్రంలా పరుగులు తీయాలని వివరణ ఇచ్చి, ఆ రచ్చకు తెరదించారు.
సీన్ కట్ చేస్తే…
ఇప్పుడు దావోస్‌లో సూటూబూట్లతో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో సోదర సమానులయిన ఆ ఇద్దరూ కలిశారు. ముచ్చట్లాడుకున్నారు. సరే.. ఎలాగూ కొద్దిరోజులు అక్కడే ఉంటారు కాబట్టి, కేటీఆర్-జగనన్న మధ్య ఇంకా అనేక లోతైన చర్చలు జరగవచ్చు. మామూలుగా అయితే దేశం కాని దేశంలో ఇద్దరు తెలుగువాళ్లు కలిస్తే, ఆవకాయ నుంచి సకినాల వరకూ.. పిల్లల చదువుల నుంచి పెళ్లి సంబంధాల వరకూ చర్చలు జరుగుతుంటాయి. ఆ ఇద్దరు ఆ బాధ్యతలను సతీమణులకు అప్పగించారు కాబట్టి, ఆ బాదర బందీ కూడా ఉండదు. ఇక మాట్లాడుకోవడానికి ఏముంటాయ్?
ఇద్దరూ వచ్చింది ఒకే పనిమీద కాబట్టి, ‘సరే ఈసారికి ఆ కంపెనీని హైదరాబాద్‌కు తీసుకువెళ్లు. నేను అడ్డురానులే కేటీఆరన్న’ అని జగనన్న చెప్పలేరు. కేటీఆర్ కూడా ‘ ఓకే బ్రో. నీ రాష్ట్రం పరిస్థితి చూస్తే గుండెతరుక్కుపోతోంది. అప్పుల కోసం నువ్వు పడుతున్న కష్టాలు చూస్తుంటే నాలాంటోడికే కన్నీరొస్తోంది. నువ్వు వచ్చిన తర్వాత మా రాష్ట్ర ఆదాయం మస్తు పెరిగింది. మీ రియల్టర్లంతా మాతాన కొస్తున్నారు. మా నల్లగొండ వైన్‌షాపులల్ల అంతా మీ ఆంధ్రోళ్లే. అందువల్ల ఈసారికి ఆ కంపెనీని నువ్వే ఆంధ్రాకు తీసుకువెళ్లు బ్రో’ అనిని చెప్పలేరు. పోయిందే పోటీకి కాబట్టి, ఎవరూ ‘త్యాగ’రాజులు కాలేరు. మరి ఇంకేం మాట్లాడుకుంటారు?
బహుశా తన రాష్ట్రానికి చెందిన బీసీ నేత ఆర్ కృష్ణయ్యకి రాజ్యసభ ఇచ్చి, తాను చేయలేని పనిని జగనన్న చేసినందుకు, కేటీఆర్ ఏపీ సీఎం జగనన్నకు కృతజ్ఞత చెప్పి ఉంటారు. అందుకు ప్రతిగా.. తన కరోనా ‘రెమిడిసివర్ రెడ్డిగారి’కి రాజ్యసభ ఇచ్చినందుకు, జగనన్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ధ్యాంక్స్ చెప్పి ఉంటారు. ఇచ్చి పుచ్చుకోవడమంటే అదే కదా? గత ఎన్నికల నుంచి ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. అందులో కొత్తదనమేదీ లేదు. ఈ మధ్యలో ఇద్దరి మధ్య పేలే మాటలన్నీ ఆటవిడుపులాంటిదన్నమాట. ప్చ్.. అదో తుత్తి!
అది అర్ధం చేసుకోకుండా టీఆర్‌ఎస్- వైసీపీ క్విడ్ ప్రో కో రాజకీయాలు చేస్తున్నాయంటూ, పడనివారు నోరు పారేసుకుంటే ఎలా? మరి ఆంధ్రా ప్రాజెక్టులు ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని ఆంధ్రా సర్కారు కోర్టుల్లో కేసులెందుకేసుకుంటున్నాయన్నదే కదా మీ సందేహం?! దేనికదే. ఎక్కడికక్కడే ఎంకటలక్ష్మి అన్న సామెత వినలేదా? ఇదీ అంతే!
మొత్తానికి ఏదైతేనేం.. తెలుగుయువకిరణాలిద్దరూ దావోస్‌లో కలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్న వారిద్దరినీ అలా వదిలేయండి. ఇలా కోడిగుడ్డుపై ఈకలు పీకకుండా.. కొత్త కంపెనీలతోపాటు, కొత్త అప్పుల కోసం మేధోమథనం చేస్తున్న వారిని దయచేసి డిస్ట్రబ్ చేయకండి ప్లీజ్.