Suryaa.co.in

Telangana

మీరు చేయాల్సింది మోకాళ్ల యాత్ర

– దొడ్డిదారిన మరోచోట పాదయాత్ర పేరిట డ్రామా చేస్తారా ?
– మూసీని మురికికూపంగా మార్చింది మీరు, తెలుగుదేశం ప్రభుత్వాలే
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి పాదయాత్ర పై బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్: సీఎం గారు.. పుండు ఓ చోటైతే.. మందు ఓ చోట..అన్నట్టుగా ఉంది మీ పాదయాత్ర తీరు. మీ మూసీ ప్రాజెక్టు బాధితులు ఉన్నదెక్కడ? మీరు పాదయాత్ర చేస్తున్నదెక్కడ ? వేల ఇళ్లు నిర్దాక్షిణ్యంగా కూల్చివేసే స్కెచ్ గీసి లక్షలాది మందిని నిరాశ్రయులను చేసే ప్లాన్ వేసి, దొడ్డిదారిన మరోచోట పాదయాత్ర పేరిట డ్రామా చేస్తారా ?

లక్షలాది మంది ఆక్రందనలకు కేరాఫ్ గా మారిన.. హైదరాబాద్ లోని మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేసే ధైర్యం, చిత్తశుద్ధి మీకుందా ? అసలు మూసీని మురికికూపంగా మార్చింది.. మీరు ఊరేగిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ప్రభుత్వాలే.

దశాబ్దాలపాటు దరిద్రమైన వ్యర్థాలు కలుస్తుంటే.. అరవై ఏళ్లు అటువైపు కళ్లుండీ చూడని కబోదులు మీరు. కనికరం లేకుండా కాల్చిచంపిన దోషులే..సంతాప సభకొచ్చి కన్నీరు కార్చినట్టుంది. మీరు నిస్సిగ్గుగా చేపట్టిన పాదయాత్ర తీరు.

మీరు చేయాల్సింది.. పాదయాత్ర కాదు.. ఆ రైతులను క్షమాపణలు కోరుతూ మోకాళ్ల యాత్ర. మూసీ లూటిఫికేషన్ ప్రాజెక్టు కన్సల్టెంట్లతో..
మూడు రోజులపాటు చర్చలకు టైం ఉంది కానీ.. గ్యారెంటీలపై సమీక్షకు గంట కూడా సమయం లేదా ?

మేనిఫెస్టోలోని మోసపూరిత హామీలను పక్కనపెట్టి మూసీ ప్రాజెక్టును నెత్తిన పెట్టుకున్నారంటేనే కమీషన్లు తప్ప.. కామన్ మ్యాన్ గురించి మీకు ఏ మాత్రం పట్టిలేదని తేలిపోయింది. మీరు పాదయాత్ర చేసినా.. పొర్లు దండాలు పెట్టినా.. మూసీ పేరిట చేస్తున్న లక్షన్నర కోట్ల పాపం మిమ్మల్ని శాపమై వెంటాడటం ఖాయం.

LEAVE A RESPONSE