-జెపిఎస్ లకు శుభాకాంక్షలు
-సిఎం ఆదేశాల మేరకు వెంటనే ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్య కార్యదర్శిని ఆదేశించిన మంత్రి
-సిఎస్ శాంతి కుమారి, ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో భేటీ అయిన మంత్రి
-విధి విధానాలు, మార్గదర్శకాలపై చర్చించిన మంత్రి
-మాట తప్పని, మడమ తిప్పని సీఎం కెసిఆర్
-రెట్టించిన ఉత్సాహంతో జెపిఎస్ లు పని చేయాలి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
సిఎం కెసిఆర్ ఆదేశానుసారం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించే విషయం, మార్గదర్శకాల రూపకల్పనపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో భేటీ అయ్యారు. అనంతరం మంత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో చర్చించారు. సిఎం ఆదేశాల మేరకు నిబంధనలను అనుసరించి, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించే మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి సిఎం సూచించిన విధంగా జిల్లా, రాష్ట్ర కమిటీలు, అవి చేపట్టాల్సిన పనులపై మార్గదర్శకాలను రూపొందించే ప్రక్రియను ప్రారంభించాలని చెప్పారు.
సిఎం కెసిఆర్ మనసున్న మహరాజు అని, ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను పర్మినెంట్ చేయడానికి అంగీకరించడమేగాక, ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించిన సిఎం కెసిఆర్ కి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అలాగే జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలిపారు. జెపిఎస్ లు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తూ, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా వ్యవహరించాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.