Suryaa.co.in

Editorial

‘కమలం’లో ‘కుల’కలం!

– కమ్మ, రెడ్డి, రాజులకు అందలం
– కాపులకు మొండిచేయి
– టీడీపీ నుంచి వచ్చిన వారికి పెద్దపీట
– టీడీపీ మాజీలకు ప్రముఖ స్థానాలు
– టీడీపీతో పొత్తుకు ఇది సంకేతమా?
– కొత్త ముఖాలు నలుగురే
– ప్రధాన కార్యదర్శుల్లో కనిపించని కాపు, ఎస్సీలు
– కొత్త కమిటీ నిండా సోము బృందమే
– విష్ణువర్దన్‌రెడ్డిని వద్దన్న పురందేశ్వరి
– అయినా కిషన్‌రెడ్డి సిఫార్సుతో విష్ణుకు ఉపాధ్యక్ష పదవి
-మధుకర్‌ సిఫార్సుతో దయాకర్‌రెడ్డికి పదవి
– సీనియర్‌ నేత భానుప్రకాష్‌రెడ్డి అవుట్‌
– పాతవారిని మార్చాలన్న పురందేశ్వరి వినతిని పట్టించుకోని నాయకత్వం
– ప్రధాన కార్యదర్శులకు ఉపాధ్యక్ష పదవులు
– గవర్నర్‌ హరిబాబు సిఫార్సుతో నాగేంద్రకు కోశాధికారి పదవి
– సమర్ధులకు అధికార ప్రతినిధుల పదవులు
– జెపికి పదవి ఇవ్వకపోవడంపై గుంటూరు జిల్లా నేతల అసంతృప్తి
– రాజీనామాలతో పార్టీ ఆఫీసుకు వెళ్లిన కమలదళాలు
– మాజీ అధికారులకు నిరాశ
– కొత్త కమిటీలో కనిపించని సామాజికన్యాయం
– కొత్త సీసాలో పాత సారా అన్న వ్యాఖ్యలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ బీజేపీ కొత్త కమిటీలో ‘కుల’కలం రేగుతోంది. సామాజిక న్యాయానికి సమాధి చేశారన్న విమర్శలతోపాటు, కొత్త కమిటీ..కొత్త సీసాలో పాత సారాలా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.బడుగు బలహీన వర్గాలతోపాటు, మెజారిటీ సంఖ్య ఉన్న కాపులను విస్మరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పాతకమిటీలోని సీనియర్లను కొనసాగించకుండా, కొత్త వారితో మిటీ వేయాలన్న అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రయత్నం ఫలించలేదు. విష్ణువర్దన్‌రెడ్డి వంటి నేతలను తప్పించాలన్న ఆమె ప్రయత్నం నెరవేరలేదు. అయితే బలంగా గళం వినిపించే నేతలను, అధికార ప్రతినిధులుగా నియమించారు.

ఇక టీడీపీ నుంచి పార్టీలో చేరిన వారికి, పెద్ద పీట వేయడం విశేషం. దానితో టీడీపీ పొత్తు బంధానికి బీజేపీ తొలి అడుగు వేసినట్లేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కమిటీలో కమ్మ, రెడ్డి, రాజులకు పెద్దపీట వేసిన పురందేశ్వరి, కీలకమైన కాపు వర్గాన్ని విస్మరించటం విమర్శలకు దారితీసింది.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఎట్టకేలకు రాష్ట్ర కమిటీని ప్రకటించారు. అయితే నలుగురైదుగురు మినహా, మిగిలిన వారంతా గత అధ్యక్షుడు సోము వీర్రాజు కమిటీలో కొనసాగిన వారే కావడం విశేషం. ఫలితంగా ఇది సోము వీర్రాజు కమిటీగా ప్రచారం ప్రారంభమైంది.
గత కమిటీ వాసనలు ఉండకూడదని, శతవిధాలా ప్రయత్నించిన పురందేశ్వరి ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. అయితే గత కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా చేసిన వారందరినీ ఉపాధ్యక్షులుగా నియమించారు. సోము హయాంలో మౌనంగా ఉండి, ఎక్కడా జోక్యం చేసుకోని సంఘటనా మంత్రి మధుకర్‌జీ, తాజా కమిటీ నియామకాల్లో కీలకపాత్ర పోషించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రధానంగా టీడీపీ నుంచి వచ్చిన వారికి కొత్త కమిటీలో పెద్ద పీట వేయడం చర్చనీయాంశమయింది. గారపాటి తపన చౌదరిని ప్రధాన కార్యదర్శిగా, ఆదినారాయణరెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, చందు సాంబశివరావుకు ఉపాధ్యక్ష పదవులు లభించాయి.

మీడియా ఇన్చార్జిగా పాతూరి నాగభూషణం, అధికార ప్రతినిధులుగా లంకా దినకర్‌, యామినీ శర్మ, సుధీష్‌ రాంభొట్లను నియమించారు. వీరంతా గతంలో టీడీపీ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.

వీరిలో లంకా దినకర్‌, విల్సన్‌, యామినీ పార్టీ గొంతు బలంగా వినిపించేవారే. గతంలో వీరంతా సమర్ధవంతంగా ఆ పదవులు నిర్వహించిన వారే కావడం గమనార్హం. రాష్ట్ర కమిటీ కూర్పులో విఫలమైన పురందేశ్వరి.. అధికార ప్రతినిధుల ఎంపి లో మాత్రం, సరైన వ్యూహం అవలంబించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

తాజా కమిటీ కూర్పు పరిశీలిస్తే.. టీడీపీ నుంచి వచ్చిన నేలతలందరికీ ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇది టీడీపీ-బీజేపీ కొత్త బంధానికి, కొత్త కమిటీతో వేసిన రాజకీయ బంధంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ-బీజేపీ-జనసేన కలసి పోటీ చేస్తాయన్న ప్రచారానికి, తాజా బీజేపీ కమిటీ నియామకాలు బలం చేకూరుస్తున్నాయి. పైగా కమ్మ వర్గానికి ఎక్కువ పదవులు లభించడం కూడా చర్చనీయాంశమయింది. కీలకమైన పదవుల్లో కమ్మ వర్గానికి తొలిసారి పెద్ద పీట వేయడం, అది కూడా టీడీపీ నుంచి వచ్చిన వారికే ఆయా పదవులివ్వడం బట్టి.. ఆ వర్గాన్ని దరిచేర్చుకునే ఎత్తుగడ స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే ఇద్దరు కాపు అధ్యక్షులను నియమించిన బీజేపీ.. ఇప్పుడు కమ్మ వర్గానికి చెందిన నేతకు అధ్యక్ష పదవి ఇచ్చి, కాపులను విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. ప్రధాన కార్యదర్శుల్లో కనీసం ఒకటి, కాపులకు ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రధాన కార్యదర్శుల్లో ఒక్కరు కూడా ఎస్సీ లేకపోవడం విమర్శలకు దారితీసింది.

బీజేపీలో చేరిన మాజీ ఐఏఎస్‌ దాసరి శ్రీనివాసులు, ఐవైఆర్‌ కృష్ణారావు, రత్నప్రభ, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి లాంటి మాజీ అధికారులకు ఎలాంటి పదవులు దక్కలేదు.వారి సేవలు కూడా వినియోగించుకోవడం లేదు. పార్టీలో చురుకుగా లేని సుధీష్‌ రాంభొట్లకు మళ్లీ అధికార ప్రతినిధి ఇవ్వడంపై, పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

గతంలో సోము వీర్రాజు జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించిన వారికి, పురందేశ్వరి తన కమిటీలో స్థానం కల్పించలేదు. పైగా సోము కమిటీనే దాదాపు కొనసాగించడం బట్టి.. కొత్త కమిటీలో సోము వీర్రాజు పైచేయి సాధించారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

కాగా విష్ణువర్దన్‌రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డిని కమిటీలో తిరిగి తీసుకునేందుకు పురందేశ్వరి వ్యతిరేకించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సిఫార్సుతో, సంఘటనా మంత్రి మధుకర్‌జీ పట్టుబట్టి, తిరిగి విష్ణువర్దన్‌రెడ్డికి, ఆయన సిఫార్సుతో దయాకర్‌రెడ్డికి కమిటీలో చోటు కల్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అదేవిధంగా విష్ణువర్దన్‌రెడ్డి సన్నిహితుడైన దయాకర్‌రెడ్డి, కమిటీలోకి రావడానికి కూడా, మధుకర్‌ పాత్ర ఉందంటున్నారు. ఇక విశాఖకు చెందిన నాగేంద్రకు గవర్నర్‌ కంభంపాటి హరిబాబు సిఫార్సు చేసినట్లు సమాచారం. సోము వీర్రాజుకు అత్యంత సన్నిహితులైన విష్ణువర్దన్‌రెడ్డి, సూర్యనారాయణరాజు, బిట్ర,రేలంగి శ్రీదేవికి.. సంఘటనామంత్రి మధకర్‌జీ ఒత్తిడితో మళ్లీ కొత్త కమిటీలో పదవులు లభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సోము హయాంలో విష్ణువర్దన్‌రెడ్డి, తెరవెనుక చక్రం తిప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కో ఇన్చార్జి సునీల్‌దియోధర్‌-మధుకర్‌జీ-సోము వీర్రాజు-విష్ణువర్దన్‌రెడ్డి ఒక బృందంగా ఉన్న వ్యవహరించిన విషయం తెలిసిందే.

గత కమిటీలో సోము వీర్రాజు నిర్ణయాల్లో ఏమాత్రం జోక్యం చేసుకోని మధుకర్‌.. పురందేశ్వరి కమిటీలో మాత్రం జోక్యం చేసుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో కన్నా లక్ష్మీనారాయణ హయాంలో, స్వతంత్రంగా వ్యవహరించిన మధుకర్‌జీ.. అప్పట్లో ఆయన దూకుడుకు మోకాలడ్డారన్న విమర్శలు వినిపించేవి.

సోము అధ్యక్షుడైన తర్వాత, ఆయన వ్యవహారాల్లో మధుకర్‌ ఎక్కడా జోక్యం చేసుకోని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సోము పనితీరుపై ఎన్ని విమర్శలొచ్చినా పట్టించుకోలేదని సీనియర్లు చెబుతున్నారు.

మళ్లీ ఇప్పుడు పురందేశ్వరి అధ్యక్షురాలయ్యాక.. మధుకర్‌జీ జోక్యం చేసుకోవడాన్ని బట్టి.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు రాష్ట్ర అధ్యక్షులయినప్పటికీ, సంఘటనా మంత్రులు వారికి స్వేచ్ఛ ఇవ్వరన్న విషయం స్పష్టమవుతోందంటున్నారు. సంఘ్‌-బీజేపీలో పనిచేసిన వారికి-ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి విషయంలో సంఘ్‌ దృష్టి కోణం, వేర్వేరుగా ఉంటుందనడానికి ఇదో నిదర్శనమని ఓ సీనియర్‌ నేత విశ్లేషించారు.

తిరుపతికి చెందిన భానుప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర కోశాథికారిగా పనిచేసిన సత్యమూర్తికి కొత్త కమిటీలో స్థానం లభించలేదు. కేంద్ర కార్మికబోర్డు చైర్మన్‌ జయప్రకాష్‌కు ఎలాంటి పదవి ఇవ్వకపోవడంపై గుంటూరు జిల్లా నేతలు అసంతృప్తితో రాజీనామాల బాట పట్టడం ఆసక్తికరంగా మారింది.

అయితే కిషన్‌రెడ్డి సహా జాతీయ అగ్రనేతలతో, సన్నిహిత సంబంధాలున్న భానుప్రకాష్‌రెడ్డిని తప్పించడం సాహసోపేతమేనంటున్నారు. కానీ ఒక వారంరోజుల్లో ఆయనకు ఏదో ఒక పదవి రావడం ఖాయమంటున్నారు. ఆయనకున్న లాబీ అలాంటిదని గుర్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. కేశవకాంత్‌, బాలకృష్ణయాదవ్‌, మట్టా ప్రసాద్‌, నాగేంద్ర, మకుటం శివ, కందికట్ల రాజేశ్వరి, రెడ్డి పావని, సావిత్రి వంటి నేతలకు కొత్తగా కమిటీ లో స్థానం లభించింది. అయితే జిల్లా కమిటీల్లో అధ్యక్షులు, మోర్చాల్లో పనిచేసిన వారిని తొలుత రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమిస్తుండటం రివాజు. కానీ ఈ కమిటీలో అలాంటివారికి, ఏకంగా పెద్ద పదవులే లభించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

ప్రధానంగా కడప జిల్లాకు చెందిన, బాలకృష్ణ యాదవ్‌ ఎవరన్నది బీజేపీలో చర్చ జరుగుతోంది. ఆ పేరు తామెప్పుడూ వినలేదని, మరికొందరి పేర్లు కూడా తామెప్పుడూ వినలేదని, పార్టీలో సుదీర్ఘకాలం నుంచీ పనిచేస్తున్న నేతలు చెబుతున్నారు.

‘మా పార్టీలో ఉండేదే కొద్దిమందినాయకులు. కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చారు కాబట్టి కొద్దిగా సంఖ్య పెరిగింది. వారినే పైకి- కిందకు వేస్తుంటారు. కొత్తవాళ్లు ఎక్కడినుంచి వస్తారు’ అని ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు.

అయితే పురందేశ్వరి వేసిన కమిటీ.. ‘కొత్త సీసాలో పాతసారా’ చందంగా ఉందన్న అభిప్రాయమే, పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నలుగురైదుగురు మినహా అంతా పాతముఖాలే ఉన్నాయని, కొత్త దనం లే ని కమిటీ వేసి లాభమేమిటన్న ప్రశ్నలు, పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సోము వీర్రాజు స్థానంలో పురందేశ్వరి రావడం త ప్ప, కమిటీలో కొత్తదనం లేదన్న పెదవి విరపులే వినిపిస్తున్నాయి.

LEAVE A RESPONSE