- 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలి
- నియోజకవర్గ అభివృద్ధికి అన్ని వేళలా అండగా ఉంటా
- భరత్‌ను గెలిపిస్తే.. మంత్రివర్గంలో స్థానం కల్పిస్తా
- కుప్పం నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో సీఎం వైయస్ జగన్
175కు 175 అసెంబ్లీ సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నియోజకవర్గం నుంచే మొదలుకావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కుప్పం నియోజకవర్గ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమావేశమయ్యారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సమావేశాన్ని ప్రారంభించిన సీఎం.. పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేసేలా దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాలను ప్రతి గడపకూ వివరించాలని, పార్టీని మరింతగా పటిష్టం చేయాలని సూచించారు. కుప్పం నియోజకవర్గ వైయస్‌ఆర్ సీపీ కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. కుప్పం తన సొంత నియోజకవర్గంతో సమానమన్నారు. కుప్పంలో భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో కన్నా ఈ మూడేళ్లలో కుప్పానికి వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వం అధిక మేలు చేసిందని గుర్తుచేశారు. కుప్పం మున్సిపాలిటీకి రూ.65 కోట్ల విలువైన పనులు మంజూరు చేశామన్నారు. కుప్పం నియోజకవర్గానికి అన్ని వేళలా అండగా ఉంటానన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 175కు 175 అసెంబ్లీ సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, పార్టీ కార్యకర్తల సమన్వయకర్త పుత్తా ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.