Suryaa.co.in

Editorial

కుప్ప(ం)కూలిన వైసీపీ

– కుప్పంలో వైసీపీ జెండా పీకేశారు!
– హోటల్ మారిన వైసీపీ ఆఫీస్
-టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు
– మరో వారంలో కుప్పంలో వైసీపీ దుకాణం బంద్
– పత్తాలేని వైసీపీ ఎమ్మెల్సీ భరత్
– కేసుల పంచాయితీలో పెద్దిరెడ్డి
– అధికారంలో ఉండగా రెచ్చిపోయిన పెద్దిరెడ్డి, భరత్
– బాబు సహా నేతలపై కేసుల పరంపర
– టీడీపీ నేతల వ్యాపారాలు స్వాధీనం
– ఇప్పుడు కుప్పంలో ఫ్యాను ఉక్కిరిబిక్కిరి
– భువనేశ్వరి పర్యటనతో కుప్పకూలిన వైసీపీ
( మార్తి సుబ్రహ్మణ్యం)

అధికారంలో ఉండగా వైనాట్ 175?.. వైనాట్ కుప్పం? నినాదంతో హోరెత్తించిన వైసీపీ, ఇప్పుడు కుప్పంలో కుప్పకూలిపోయింది. ఎంతగా అంటే.. చివరాఖరకు నియోజకవర్గ పార్టీ ఆఫీసు కూడా ఎత్తేసి, హోటల్ పెట్టుకునేంతలా! ఎన్నికల్లో ఓటమి తర్వాత, చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిన కుప్పం వైసీపీని పట్టించుకునే దిక్కులేకుండా పోయింది.

మొన్నటివరకూ టీడీపీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబునాయుడుపై తొడగొట్టి సవాళ్లు విసిరిన ఎమ్మెల్సీ భరత్ పత్తాలేరు. కుప్పంలో వైసీపీ శ్రేణులను చంద్రబాబుపై రెచ్చగొట్టి, ఇక బాబు జీవితంలో గెలవరంటూ ఎద్దేవా చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి.. ఇప్పుడు కేసుల్లో పీకల్లోతు మునిగిపోయారు. చివరకు ఆయన తన సొంత పుంగనూరులోనే అడుగుపెట్టలేని దయనీయం. తనకు సెక్యూరిటీ పెంచాలని కోర్టును ప్రాధేయపడుతున్న దుస్థితి.

దానితో కుప్పంలో ఫ్యానుకు చెమటలు పడుతున్న పరిస్థితి. చివరాఖరకు తత్వం తెలుసుకున్న వైసీపీ నేతలు, టీడీపీలో చేరుతున్న దృశ్యాలు మొదలయ్యాయి. అంటే మొత్తంగా కుప్పంలో వైసీపీ కుప్పకూలిందన్నమాట. అదికూడా భువనేశ్వరి పర్యటన తర్వాత!

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఆయన సతీమణి భువనేశ్వరి తాజా పర్యటన వైసీపీలో తుపాను రేపింది. ఇటీవల మూడురోజులు కుప్పంలో పర్యటించిన భువనేశ్వరి, పార్టీ నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీకి భవిష్యత్తులో ఎదురు ఉండవద్దని, కుప్పం అభివృద్ధి రాష్ట్రానికి రోల్‌మోడల్‌గా ఉండాలంటే.. పార్టీకి అడ్డంకులు ఉండవద్దని దిశానిర్దేశం చేశారు.
విచిత్రంగా ఆమె పర్యటన ముగిసిన కొద్దిరోజులకే, కుప్పంలో వైసీపీ కుప్పకూలిపోయింది. నియోజకవర్గంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూడా ఎత్తేశారు. ప్రస్తుతం వైసీపీ ఆఫీసు హోటల్‌గా ద ర్శనమిస్తోంది.

చంద్రబాబునాయుడు రాజకీయ జీవితం ఈ ఎన్నికలతో ముగుస్తుందని, నాటి ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ అయితే.. వై నాట్ కుప్పం అని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు విశ్రాంతి ఇవ్వాలని వ్యంగ్యాస్త్రః సంధించారు. కుప్పం ఇన్చార్జిగా ఉన్న ఎమ్మెల్సీ భరత్ రెచ్చిపోయారు. చివరకు చంద్రబాబునాయుడుపై కేసులు కూడా పెట్టి వేధించారు. కార్యకర్తలపై లెక్కలేనన్ని కేసులు పెట్టారు. టీడీపీ నేతల వ్యాపారాలు దెబ్బతీశారు. క్వారీలు స్వాధీనం చేసుకున్నారు. అయినా టీడీపీ శ్రేణులు చెక్కుచెదరలేదు. కేసులకు అదరలేదు. బెదరలేదు. బాబు వారికి ఆర్ధికంగా, న్యాయపరంగా అండగా నిలిచారు. సామాన్య కార్యకర్తలను ఆదుకున్నారు.

ఇప్పుడు అధికారం మారిన తర్వాత సీన్ మారింది. వైసీపీ కార్యకర్తలకు పిలిస్తే పలికే దిక్కు లేదు. ఎమ్మెల్సీ భరత్ ఫోన్లు తీయరు. ఎన్నికల ముందు తమను రెచ్చగొట్టి, భరోసా ఇచ్చిన పెద్దిరెడ్డికే ఇప్పుడు దిక్కులేని పరిస్థితి. ఆయనే కేసులు-కోర్టులతో సతమతమవుతున్నారు. దానితో వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు టీడీపీలోకి వరస కడుతున్నారు. బాబు సమక్షంలో ఐదుగురు కౌన్సిలర్లు, 4 మండలాల ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. ఈ జోరు చూస్తుంటే.. మరో వారంలో కుప్పంలో వైసీపీ జెండా పట్టుకునే ందుకు కూడా, ఎవరూ ధైర్యం చేయని విషాదం తప్పదంటున్నారు. ఏం చేస్తాం?.. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ!

LEAVE A RESPONSE