అద్దంకి: ప్రియుడి పెరోల్ కేసులో సంచలనం సృష్టించిన నిడిగుంట అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో హైదరాబాద్ వైపు వెళ్తుండగా, ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కోవూరు పోలీస్ స్టేషన్లో నమోదైన చీటింగ్ కేసులో అరుణను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పడుగుపాడులోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు విషయంలో యజమానిని లక్ష రూపాయల మేర మోసం చేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది. అరెస్ట్ అనంతరం ఆమెను కోవూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇద్దరు ఎస్పీలు, జైలు సూపరింటెండెంట్ వ్యతిరేకించినా, ఉన్నతస్థాయి ఒత్తిళ్లతో గూడూరుకు చెందిన జీవిత ఖైదీ శ్రీకాంత్‌కు పెరోల్ ఇప్పించడంలో అరుణ కీలక పాత్ర పోషించారని కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం పెరోల్‌ను రద్దు చేసింది.
అరెస్ట్‌కు ముందు అరుణ విడుదల చేసిన ఓ వీడియోలో పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను కావాలనే లక్ష్యంగా చేసుకున్నారని, ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు.