పాలసముద్రాన్ని చిలికితే
దేవదానవులు..
ఉద్భవించిన అమృతం సురలపాలు..
గరళమేమో శివయ్య వంతు
అమృతాన్ని మించిన అద్భుతమై…
మనోహరమై పుట్టిన లక్ష్మి
మహావిష్ణువు సొంతమై
వైకుంఠమే ప్రశాంతమై
తానే జగతిన ఆసాంతమై..
లక్ష్మీం క్షీర సముద్ర
రాజతనయాం..
సరసిజాం వందే
ముకుంద ప్రియాం..
నువ్వే లేకుంటే ఇప్పుడు
మానవాళి మొత్తం అయోమయం..
నీపై మితిమీరిన వ్యామోహంతో
విలువలే మాయం..!
అందమైన బొమ్మగా నువ్వుండలేదే..
నాణెమై.. నాణ్యమై..
నోటుగా..నోటి మాటగా..
ప్రామిసరీ నోటుగా..
ఓటుకు నోటుగా..
మా’నవ’జీవితానికి
నువ్వే ప్రమాణమై..,
నీతోడిదే ప్రయాణమై..!
ధనం మూలం ఇదం జగత్
అదే కదా నీ మహత్..
ఇతర దేవుళ్ళ పటాలు
పూజగదుల్లోనే..
ఇంట..బయట..
దుకాణంలో..ప్రయాణంలో…
నీ పటమే..
కాసుల వేటలో
ప్రతి అనుభవమూ
ఒక పాఠమే!
ఎరుపు బట్టలలో కాదు
నోట్ల కట్టలలో
నిన్ను చూసే కాలం..
అందుకే ఇది కలికాలం..
నువ్వు లేనోడి బ్రతుకు
వేళాకోళం..ఈ భూమ్మీద
ప్రతివోడి తాపత్రయం
నువ్వు కావాలని..అవ్వాలని
ద్విగులం..బహుళం..
ఆ ప్రయత్నంలోనే
అందరూ గందరగోళం..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286