– మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి: సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా విజన్ ఆంధ్రా – 2047 లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. పేదవాడికి మెరుగైన జీవనం కల్పించాలని తపన పడే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆంధ్రాకు మంత్రి నారా లోకేష్ ఒక బ్రాండ్ అంబాసిడర్.
ఈ రాష్ట్రానికి వారసత్వంగా అప్పులు, భూకబ్జాలు, డ్రగ్స్ మాఫియా వచ్చాయి. కాని అందరికీ వారసత్వంగా వచ్చే భూమిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అలాంటి భూమి కబ్జాకు గురి అయ్యిందంటే ఆ బాధ వర్ణనాతీతం. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎన్నో భూకబ్జాలు జరిగాయని కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. భూఅక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టించేలా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేశామని తెలిపారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే..
ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దుపై అసెంబ్లీలో ఆమోదం లభించింది.. త్వరలోనే చట్టం కాబోతోంది. ల్యాండ్ గ్రాబింగ్ కు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష వంటి కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నాం. రాబోయే రోజుల్లో పేదవాడికి తన భూమిపై హక్కులు కల్పించేలా చేస్తాం.
గత ప్రభుత్వంలో 9.26 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ పేరుతో చేశారు.. అందులో 4.21 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి అంటే 45 శాతం భూములు కబ్జా చేశారని తేలింది. వీరందరికీ నూతన చట్టంతో గుణపాఠం చెప్పబోతున్నాం. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల పేరుతో మరో స్కాం చేశారు.. ప్లాట్లను తీసుకున్నవారు అమ్ముకోవచ్చని చెప్పారు. అలా చేసిన వారందరిపై చర్యలు తీసుకుంటాం. 45 వేల ఎకరాలను వారి అనుయాయులకే అసైన్డ్ చేశారు.
గ్రీవెన్స్ లో రెవెన్యూ శాఖలోనే అత్యధిక ఫిర్యాదులు వచ్చాయి. భూ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ఈనెల 6వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. వస్తున్న ఫిర్యాదులపై అక్కడికక్కడే పరిష్కరించే చర్యలు చేపడుతున్నాం. అక్రమాలకు పాల్పడిన అధికారులపైనా చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు 31,324 గ్రీవెన్స్ వస్తే వాటిలో 400 సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాం. మిగతా వాటిని వెంటనే ఎందుకు పరిష్కరించలేకపోయామనే దానిపై పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రీసర్వేపై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించాల్సిన అవసరం ఉంది.
గత ప్రభుత్వంలో సర్వే రాళ్లు, భూహక్కు పత్రాలపై కూడా వాళ్ల బొమ్మలు వేయించుకున్నారు.. ఇప్పుడు రూ.12 కోట్లు వెచ్చించి వాటిని తొలగిస్తున్నాం. గ్రీవెన్స్ లో వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించాకే రాజముద్ర, క్యూఆర్ కోడ్, ల్యాండ్ మ్యాప్ తో కూడిన భూహక్కు పత్రాలు అందిస్తాం. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచేది కలెక్టర్లు.
రాష్ట్రాభివృద్ధిలో ఐఏఎస్ ఆఫీసర్లకు ఇదొక మంచి అవకాశం..
రాబోయే రోజుల్లో ఎలాంటి భూసమస్యలు లేకుండా చేద్దాం. సమస్యలకు పరిష్కారం చూపించేలా ఈ సదస్సులో చర్చిద్దాం.